ETV Bharat / sports

కివీస్‌తో వన్డే సిరీస్- రిషబ్ పంత్ ఔట్​- రీప్లేస్‌మెంట్​గా ధ్రువ్​ జురెల్​

ప్రాక్టీస్ సెషన్‌లో గాయం- కుడివైపు కండరాలు చిట్లడంతో విలవిల- ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో నిర్ధరణ- వన్డే సిరీస్ మొత్తానికి పంత్ దూరం

Rishabh Pant Ruled Out
Rishabh Pant Ruled Out (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : January 11, 2026 at 11:44 AM IST

3 Min Read
Choose ETV Bharat

Rishabh Pant Ruled Out : భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో గాయపడటంతో బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని సిరీస్ నుంచి తప్పించింది. పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు సెలెక్షన్ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో పంత్ ఆడకపోవడం భారత జట్టుకు నిరాశ కలిగించే అంశం అని విశ్లేషకులు అంటున్నారు.

అసలేం జరిగింది?
శనివారం వడోదరలో టీమ్​ఇండియా నెట్ సెషన్ నిర్వహించింది. ఈ ప్రాక్టీస్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి అతని కుడి వైపున కండరాల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో అతను విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియోలు పంత్‌ను పరీక్షించారు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు హుటాహుటిన ఎంఆర్‌ఐ స్కానింగ్ తీయించారు.

రిపోర్టులో ఏముంది?
స్కానింగ్ రిపోర్టులను పరిశీలించిన వైద్య బృందం కీలక విషయాలు వెల్లడించింది. పంత్‌కు 'సైడ్ స్ట్రెయిన్' అయినట్లు నిర్ధారించారు. అంటే కుడి వైపున ఉన్న 'ఆబ్లిక్ కండరాలు' చిట్లినట్లు తేలింది. అందుకే అతన్ని న్యూజిలాండ్ సిరీస్ నుంచి తప్పించారు. అతను కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

జురెల్‌ ఎంట్రీ
పంత్ గాయపడటంతో ధ్రువ్ జురెల్​కు పిలుపు వచ్చింది. సెలెక్టర్లు వెంటనే జురెల్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించారు. అతను ఇప్పటికే భారత జట్టుతో కలిశాడు. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కూడా వికెట్ కీపర్‌గా ఉన్నాడు. ఇప్పుడు జురెల్ రాకతో జట్టులో మరో కీపర్ ఆప్షన్ లభించింది.

కొత్త స్క్వాడ్ ఇదే
పంత్ నిష్క్రమణ, జురెల్ రాకతో బీసీసీఐ అప్‌డేటెడ్ స్క్వాడ్‌ను ప్రకటించింది.
జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).

పంత్ ఫామ్ ఇలా
ఈ సిరీస్‌కు ముందు పంత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో దిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. లీగ్ దశలో అద్భుతంగా రాణించాడు. రైల్వేస్, సర్వీసెస్ జట్లపై రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. దిల్లీని నాకౌట్ దశకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఫామ్‌లో ఉన్న పంత్ గాయపడటం దురదృష్టకరం.

సిరీస్ షెడ్యూల్ ఇదీ
భారత్, న్యూజిలాండ్ మధ్య పోరు నేటి (జనవరి 11) నుంచే మొదలవుతోంది. మొదటి వన్డే వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరుగుతుంది. రెండో వన్డే రాజ్‌కోట్‌, మూడో వన్డే ఇండోర్‌లో జరుగనుంది. ఈ సిరీస్‌లో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. వీరిద్దరూ కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత వీరి ఆటను చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

వరల్డ్ కప్ సన్నాహాలు
ఈ సిరీస్ కేవలం ద్వైపాక్షిక పోరు మాత్రమే కాదు. వన్డే సిరీస్ ముగియగానే ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరగనుంది. 2026లో భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఆ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగానే ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. పంత్ లేకపోవడం జట్టు సమతుల్యతపై ప్రభావం చూపినా, సీనియర్ల రాక, యువ ఆటగాళ్ల జోరుతో కివీస్‌ను చిత్తు చేయాలని టీమ్ఇండియా భావిస్తోంది.