ETV Bharat / sports

జైస్వాల్ తుపాన్ ఇన్నింగ్స్​- ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం

వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్- జైస్వాల్ అద్భుత బ్యాటింగ్, సూర్యవంశీ వేగవంతమైన ఇన్నింగ్స్- బిష్ణోయ్, బర్గర్, సందీప్ శర్మ బౌలింగ్‌లో మెరుపులు

IPL MI Vs RR
IPL MI Vs RR (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 8, 2026 at 6:52 AM IST

3 Min Read
Choose ETV Bharat

IPL 2026 MI Vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్‌పై 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించినప్పటికీ, ఆటలో ఎక్కడా ఉత్కంఠ తగ్గలేదు. ముఖ్యంగా యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వంసకర బ్యాటింగ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ మొదటి బంతి నుంచే దాడి మొదలుపెట్టింది. యశస్వి జైస్వాల్ అసలు ఆగేలా కనిపించలేదు. తొలి ఓవర్లోనే అతను బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లోనే 22 పరుగులు రావడం మ్యాచ్ మూడ్‌ను మార్చేసింది.

ఇంకొవైపు వైభవ్ సూర్యవంశీ కూడా అదే దూకుడును కొనసాగించాడు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతను కొట్టిన భారీ సిక్సర్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. మూడో ఓవర్లో ట్రెంట్ బౌల్ట్‌కూ శిక్ష తప్పలేదు. ఇలా కేవలం మూడు ఓవర్లలోనే రాజస్థాన్ 58 పరుగులు సాధించడం విశేషం. ఈ జోడి తొలి వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 80 పరుగులు జోడించడం మ్యాచ్‌లో కీలక మలుపు. అయితే ఆరవ ఓవర్లో సూర్యవంశీ ఔటవడంతో రాజస్థాన్ వేగం కొంత తగ్గింది.

అయినప్పటికీ జైస్వాల్ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. మరో ఎండ్‌లో పరాగ్ కొద్దిసేపు వేగంగా ఆడగా, జురెల్ త్వరగా ఔటయ్యాడు. చివర్లో హెట్‌మయర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ 11 ఓవర్లలో 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్‌కు ఆరంభం నుంచే షాక్‌లు తగిలాయి. తొలి ఓవర్లోనే రికెల్టన్ ఔటవడంతో ఒత్తిడి పెరిగింది. వెంటనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ముంబయి కష్టాల్లో పడింది.

తర్వాతి దశలో కూడా పరిస్థితి మారలేదు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య వంటి కీలక బ్యాటర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో హార్దిక్, తిలక్ వికెట్లు తీయడంతో మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ వైపు మొగ్గింది. మధ్యలో రూథర్‌ఫర్డ్, నమన్ ధీర్ కొంత పోరాటం చూపించినప్పటికీ, అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. చివరకు ముంబయి 11 ఓవర్లలో 123 పరుగులకే పరిమితమైంది.

రాజస్థాన్ బౌలర్లలో నంద్రీ బర్గర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ సాధించారు. సమిష్టి బౌలింగ్‌తో ముంబయి బ్యాటింగ్‌ను కట్టడి చేయడంలో వారు విజయవంతమయ్యారు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటింది. ముఖ్యంగా యువ ఆటగాళ్ల ప్రదర్శన జట్టుకు బలంగా మారింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ టాప్ ఆర్డర్ విఫలం కావడం ఓటమికి ప్రధాన కారణమైంది.

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి నాటౌట్‌ 77; వైభవ్‌ (సి) తిలక్‌ (బి) శార్దూల్‌ 39; జురెల్‌ ఎల్బీ (బి) ఘజన్‌ఫర్‌ 2; పరాగ్‌ (సి) తిలక్‌ (బి) ఘజన్‌ఫర్‌ 20; హెట్‌మయర్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 6
మొత్తం: (11 ఓవర్లలో 3 వికెట్లకు) 150
వికెట్ల పతనం: 1-80, 2-84, 3-121
బౌలింగ్‌: దీపక్‌ 1-0-22-0; బుమ్రా 3-0-32-0; బౌల్ట్‌ 1-0-22-0; హార్దిక్‌ 2-0-17-0; శార్దూల్‌ 2-0-36-1; ఘజన్‌ఫర్‌ 2-0-21-2

ముంబయి ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) జురెల్‌ (బి) ఆర్చర్‌ 8; రోహిత్‌ ఎల్బీ (బి) సందీప్‌ శర్మ 5; సూర్యకుమార్‌ (సి) ఆర్చర్‌ (బి) బర్గర్‌ 6; తిలక్‌ వర్మ (సి) హెట్‌మయర్‌ (బి) బిష్ణోయ్‌ 14; హార్దిక్‌ (సి) జైస్వాల్‌ (బి) బిష్ణోయ్‌ 9; నమన్‌ ధీర్‌ (సి) బిష్ణోయ్‌ (బి) బర్గర్‌ 25; రూథర్‌ఫర్డ్‌ (సి) సందీప్‌ శర్మ (బి) తుషార్‌ 25; శార్దూల్‌ (సి) జురెల్‌ (బి) సందీప్‌ శర్మ 8; దీపక్‌ చాహర్‌ నాటౌట్‌ 6; బౌల్ట్‌ రనౌట్‌ 1; బుమ్రా నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 11
మొత్తం: (11 ఓవర్లలో 9 వికెట్లకు) 123
వికెట్ల పతనం: 1-10, 2-20, 3-22, 4-41, 5-46, 6-93, 7-103, 8-111, 9-116
బౌలింగ్‌: ఆర్చర్‌ 2-0-17-1; బర్గర్‌ 2-0-21-2; సందీప్‌ శర్మ 3-0-26-2; తుషార్‌ దేశ్‌పాండే 2-0-29-1; రవి బిష్ణోయ్‌ 2-0-25-2