ETV Bharat / sports

గ్రాండ్ చెస్ టూర్: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద- తొలి భారతీయుడిగా ఘనత

15-13 తుది స్కోరుతో టైటిల్ సొంతం- తొలి గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌తో పాటు 2 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ- గ్రాండ్ చెస్ టూర్‌ను గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు

praggnanandhaa Grand Chess Tour Finals
ప్రజ్ఞానంద రమేశ్ బాబు (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 7:06 AM IST

3 Min Read
Choose ETV Bharat

Praggnanandhaa Grand Chess Tour Final : భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్​బాబు చెస్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ లూయిస్‌లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనం చేసి విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌లో తొలి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో పాటు, 2 లక్షల డాలర్ల ప్రథమ బహుమతిని కూడా దక్కించుకున్నాడు.

ఈ విజయంతో ప్రజ్ఞానంద అరుదైన ఘనత సాధించాడు. చెస్.కామ్ ప్రకారం, గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఒక దశలో ప్రత్యర్థి కరువానా స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఒత్తిడిని అధిగమించిన ప్రజ్ఞానంద వరుస విజయాలతో మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. ర్యాపిడ్ గేమ్‌లలో అద్భుతంగా రాణించి ఆధిక్యంలోకి వచ్చిన అతడు, ఆ తర్వాత బ్లిట్జ్ గేమ్‌లలోనూ కీలక పాయింట్లు సాధించి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు.

ఆరు పాయింట్ల వెనుకబడి
ఫైనల్ రోజు ప్రజ్ఞానంద, కరువానా కంటే ఆరు పాయింట్ల వెనుకబడి ప్రారంభించాడు. దీంతో మ్యాచ్‌లో విజయం సాధించాలంటే అతడు ఆరంభం నుంచే దూకుడుగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా త్వరగానే మ్యాచ్​ను తనవైపునకు తిప్పుకున్నాడు. ర్యాపిడ్ విభాగంలో సాధించిన ఈ విజయాలు ప్రజ్ఞానందకు ఎంతో కీలకంగా మారాయి. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అనంతరం బ్లిట్జ్ గేమ్‌లలో కరువానాను సమం చేశాడు. చివరకు 15-13 తుది స్కోరుతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

తొలి బ్లిట్జ్‌లో ఉత్కంఠ
మొదటి బ్లిట్జ్ గేమ్‌లో ప్రజ్ఞానందకు గెలిచే అవకాశాలు లభించాయి. అయితే సమయం తక్కువగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న గందరగోళంలో అతడు కొంత తడబడ్డాడు. దీంతో అతడి పరిస్థితి కొద్దిసేపు క్షీణించింది. అయినప్పటికీ కరువానా ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. చివరకు ఆ గేమ్ డ్రాగా ముగిసింది.

కీమర్‌పైనూ సత్తా
ఇదిలా ఉండగా, జీఎమ్ విన్సెంట్ కీమర్‌తో జరిగిన పోరులోనూ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన చేశాడు. మూడో దశలో ఇద్దరూ ఒక్కో విజయం సాధించినప్పటికీ, బ్లిట్జ్‌లో ప్రజ్ఞానంద పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. వరుసగా నాలుగు గేమ్‌లను గెలుచుకుని, మరో గేమ్ మిగిలి ఉండగానే మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరకు 18-12 తేడాతో విజయం సాధించాడు.

క్లాసిక్ గేమ్‌లో ఓటమి
అంతకుముందు బుధవారం జరిగిన క్లాసిక్ గేమ్‌లలో ప్రజ్ఞానందకు కరువానా నుంచి గట్టి సవాల్ ఎదురైంది. తొలి క్లాసిక్ గేమ్‌లో కరువానా చేతిలో 6-0 తేడాతో ఓటమి చవిచూశాడు. దీంతో ప్రజ్ఞానందపై ఒత్తిడి మరింత పెరిగింది. అయితే రెండో క్లాసిక్ గేమ్‌లో అతడు పుంజుకున్నాడు. ఆ గేమ్‌ను 3-3తో డ్రా చేసుకుని మ్యాచ్‌లో నిలిచాడు. అలా ఈ టోర్నీలో టాప్-3 స్థానాల్లో నిలిచిన ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ టోర్నీకి నేరుగా అర్హత సాధించి, టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

18 మంది ఖరారు
టోటల్ చెస్ పైలెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టూర్ టోర్నీలో ప్రజ్ఞానందతో పాటు భారత స్టార్ ప్లేయర్లు అర్జున్, ఇరిగేశి, వైశాలి పోటీపడుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 10న ఆరంభమయ్యే ఈ టోర్నీలో మొత్తం 24 మంది ప్లేయర్లు ఆడనుండగా, ఇప్పటిదాకా 18 మంది ఖరారయ్యారు. బ్లిట్జ్, ర్యాపిడ్, ఫాస్ట్ క్లాసికల్ ఫార్మాట్లలో పోటీలను నిర్వహిస్తారు. ఇటీవల నార్వే చెస్ టైటిల్, సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టైటిల్, గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ నెగ్గి ప్రజ్ఞానంద జోరు మీద ఉన్నాడు. అతడి సోదరి వైశాలి మహిళల క్యాండిడేట్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తెలంగాణ కుర్రాడు అర్జున్ గత కొన్నేళ్లుగా ర్యాపిడ్, బ్లిట్జ్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు. ఈ ముగ్గురు ఈ టోర్నీలో ఎలా ఆడతారో చూడాలి.

నాలుగు గ్రూపులుగా విడిపోయి
ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్, అమెరికా స్టార్లు ఫాబియానో కరువానా, వెస్లీ సో తదితరులు ఈ పోటీల్లో ఆడుతున్నారు. 24 మంది పాల్గొనే ఈ టోర్నీలో ప్లేయర్లు గ్రూప్‌కు ఆరుగురు చొప్పున నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతారు. లీగ్ దశ డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతుంది. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తారు. టోటల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టూర్‌లో భాగంగా మొత్తం నాలుగు టోర్నీలు జరుగుతాయి. వీటిలో టాప్-4 ప్లేయర్లు టోర్నీ బెర్తును సొంతం చేసుకుంటారు.

సిరీస్ గెలిస్తే, ఏం లాభం?- తగ్గిన టీమ్ఇండియా పర్సంటేజ్- WTC ఫైనల్ ఛాన్స్​లు ఎలా ఉన్నాయంటే?

భారత్​కు నిరాశ- రెండో టెస్టును డ్రా చేసుకున్న శ్రీలంక