ETV Bharat / sports

హోరాహోరీ మ్యాచ్​లో శ్రీలంక ఓటమి - పాకిస్థాన్ గెలిచినా ఇంటికే!

SL VS PAK World Cup - లంకపై 5 పరుగుల తేడాతో నెగ్గిన పాకిస్థాన్- అయినా సెమీస్​ రేస్ నుంచి ఔట్

SL VS PAK
SL VS PAK (Source : AP)
author img

By ETV Bharat Sports Team

Published : February 28, 2026 at 10:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

SL VS PAK World Cup : టీ20 వరల్డ్​కప్​ను పాకిస్థాన్ విజయంతో ముగించింది. తాజాగా కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 5 పరుగుల తేడాతో పాక్ నెగ్గింది. 213 పరుగుల ఛేదనలో లంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 రన్స్​ చేసింది. డాసున్ షనక (76 పరుగులు, 31 బంతుల్లో) మెరుపులు వృథా అయ్యాయి. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3, షహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, మహ్మద్ నవాజ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

శ్రీలంక ఛేదనలో పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ కమిల్ మిశ్రా (26 పరుగులు), చరిత్ అసలంక (25 పరుగులు) వేగంగా ఆడడంతో లంక రన్​రేట్ బాగానే కొనసాగింది. ఈ ఇద్దరు ఔటైనా పవన్ రత్నాయకే (58 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ఆ తర్వాత లంక వరుస వికెట్లు కోల్పోవడంతో పాక్​కు ఆశలు చిగురించాయి. కానీ, చివర్లో కెప్టెన్ డాసున్ షనక పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు.

31 బంతుల్లోనే 76 పరుగులతో దాదాపు పాక్​ను ఓడించనంత పని చేశాడు. ఇందులో 8 సిక్స్​లు ఉన్నాయి. అయితే ఓడించకపోయినా, పాకిస్థాన్​ను సెమీస్ రేస్ నుంచి మాత్రం తప్పించగలిగాడు. చివరి ఓవర్లో 28 పరుగులు అవసరం కాగా, షనక వరుసగా 4, 6, 6, 6 బాది ఊపు తెచ్చాడు. దీంతో చివరి రెండు బంతుల్లో సమీకరం 6 పరుగులకు మారింది. అయితే ఆఖరి రెండు బంతులను షహీన్ అఫ్రిదీ డాట్స్​గా వేయడంతో పాక్ 5 రన్స్​తో నెగ్గింది.

పాక్ ఇంటికి - కివీస్ సెమీస్​కు
ఈ మ్యాచ్​లో నెగ్గడంతో పాకిస్థాన్ కూడా కివీస్​తో సమానంగా 3 పాయింట్లతో నిలిచింది. కానీ పాక్ (-0.123) కంటే కివీస్ మెరుగైన (+1.390) రన్​రేట్ ఉండడంతో సెమీఫైనల్​కు దూసుకెళ్లింది. అదే ఈ మ్యాచ్​లో శ్రీలంకపై పాక్ 64 పరుగుల తేడాతో నెగ్గి ఉంటే సెమీస్​కు వెళ్లేది. దీంతో గ్రూప్ 2లో సెమీస్​ రేస్ ముగిసింది. ఇంగ్లాండ్, కివీస్ సెమీఫైనల్​కు దూసుకెళ్లాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్లు షహిబ్​జాదా ఫర్హాన్ (100 పరుగులు) సెంచరీతో అదరగొట్టగా, ఫకర్ జమాన్ (84 పరుగులు) రాణించాడు. దీంతో పాక్ భారీ స్కోర్ అందుకుంది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక 3, డాసున్ షనక 2, దుష్మంత చమీర 1 వికెట్ దక్కించుకున్నారు.

షనక సిక్స్​ల రికార్డ్
ఈ ఇన్నింగ్స్​లో ఎనిమిది సిక్స్​లు బాదడంతో షనక కెరీర్​లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్​కప్ హిస్టరీలో అత్యధిక సిక్స్​లు బాదిన కెప్టెన్​గా రికార్డు కొట్టాడు. ఈ క్రమంలో రోహిత్​ను అధిగమించాడు. రోహిత్ 19 సిక్స్​లు బాదగా, తాజా ఎడిషన్​తో కలిపి షనక మొత్తం 21 సిక్స్​లు కొట్టాడు.

T20 వరల్డ్​కప్​లో అత్యధిక సిక్సర్లు కెప్టెన్‌

  • 21 - డాసున్ షనక (శ్రీలంక)
  • 19 - రోహిత్ శర్మ (భారత్)
  • 17 - క్రిస్ గేల్ (వెస్టిండీస్)
  • 17 - జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)
  • 16 - ధోని (భారత్)

పాకిస్థాన్ తుది జట్టు : సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్

శ్రీలంక తుది జట్టు : పాథుమ్ నిస్సంక, కమిల్ మిషారా, చరిత్ అసలంక, పవన్ రాత్నాయకే, కమిందు మెండిస్, దాసున్ షనక (కెప్టెన్), జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక