ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్ చరిత్రలో 'ఒకేఒక్కడు'- మూడుసార్లు ఫైనల్ ఆడిన ఏకైక భారత క్రికెటర్

టీ20 వరల్డ్ కప్​లో అరుదైన ఘనత- మూడు సార్లు ఫైనల్స్ ఆడిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డ్

T20 World Cup Finals
T20 World Cup Finals (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : March 1, 2026 at 10:41 AM IST

3 Min Read
Choose ETV Bharat

T20 World Cup Finals : క్రికెట్​లో ఎన్నో రికార్డులు చూస్తుంటాం కానీ కొన్ని మాత్రం చాలా స్పెషల్​గా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా వరల్డ్​కప్ లాంటి మెగా టోర్నీలో ఏ ప్లేయరైనా ఫైనల్​కు వెళ్లి టైటిల్ నెగ్గాలని అనుకుంటాడు. ఇలాంటి మెగా టోర్నీల్లో ఫైనల్ వరకు వెళ్లడం అనేది పెద్ద సవాలుతో కూడుకున్నది. అలాంటిది ఒక క్రికెటర్ ఒకటికాదు, రెండు కాదు ఏకంగా మూడుసార్లు తన కెరీర్లో టీ20 వరల్డ్​కప్ పైనల్ ఆడాడు. అది కూడా భారత ప్లేయరే కావడం విశేషం.

2007లో ఈ పొట్టి ఫార్మాట్ మొదలైనప్పటి నుంచి టీమ్ఇండియా ఎంతో మంది దిగ్గజాలను చూసింది. కానీ ఇన్నేళ్లలో ఒక్కడంటే ఒక్కడే మూడుసార్లు ఫైనల్ మ్యాచ్ ఆడాడు. అందుకో రెండుసార్లు ట్రోఫీని ముద్దాడాడు. మరి ఈ అరుదైన ఘనత దక్కించుకున్న మన భారత క్రికెటర్ ఎవరో? ఆ జర్నీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!

ఎంట్రీలోనే పాకిస్థాన్​పై సూపర్ విక్టరీ
ఆ ఆటగాడు మరెవరో కాదు, మన 'హిట్​మ్యాన్ రోహిత్ శర్మ'. తన కెరీర్ ప్రారంభంలోనే రోహిత్​కు 2007 టీ20 వరల్డ్​కప్ ఫైనల్ ఆడే అవకాశం వచ్చింది. సౌతాఫ్రికాలో జరిగిన ఆ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్​తో ఫైనల్ ఫైట్ జరిగింది. ఆ ఉత్కంఠభరితమైన మ్యాచ్​లో రోహిత్ మెరుపు ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఆ మ్యాచ్ గెలిచి తొలిసారి వరల్డ్ ఛాంపియన్​గా నిలిచింది. యువ క్రికెటర్​గా కెరీర్​ తొలినాళ్లలోనే ప్రపంచ కప్పును ముద్దాడటం రోహిత్​కు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండిపోతుంది.

రెండోసారి ఫైనల్- ఈసారి మిస్!
ఏడేళ్ల గ్యాప్ తర్వాత 2014లో టీమ్ఇండియా రెండోసారి టీ20 ఫైనల్ చేరింది. ఈ జట్టులోనూ రోహిత్ శర్మ సభ్యుడే. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ అదరగొట్టి ఫైనల్ దాకా వెళ్లింది. అయితే అక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియాకు నిరాశ ఎదురైంది. ధోనీ కెప్టెన్​గా ఉన్నప్పుడు ఐసీసీ ఫైనల్​లో భారత్ ఓడిపోయిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. రోహిత్ ఈ మ్యాచ్​లో 26 బంతుల్లో 29 పరుగులు చేశాడు.

ఈసారి కెప్టెన్​గా!
రోహిత్ శర్మ కెరీర్​లోనే హైలైట్​గా నిలిచిపో సందర్భం 2024 టీ20 వరల్డ్​కప్. వెస్టిండీస్- అమెరికా సంయుక్త వేదికలుగా జరిగిన ఈ టోర్నీలో రోహిత్ కెప్టెన్​గా భారత జట్టును నడిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్​లో టీమ్ఇండియా ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో 18ఏళ్ల తర్వాత భారత్ మళ్లీ టీ20 వరల్డ్ ఛాంపియన్​గా నిలిచింది. ఈ మ్యాచ్​తో రోహిత్ శర్మ మూడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన ఏకైక భారతీయ క్రికెటర్​గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

కోహ్లీ ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డ్
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. మన దేశం నుంచి ఆ గౌరవం కేవలం రోహిత్ శర్మకు మాత్రమే దక్కింది. విరాట్ కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కానీ ఈ అరుదైన ఫీట్ ను రోహిత్ సాధించడం విశేషం. ధోనీ (2007, 2014), విరాట్ (2014, 2024) రెండుసార్లే ఫైనల్స్ ఆడారు. అలా యువ ఆటగాడిగా అరంగేట్రం చేసి, అదే జట్టుకు కెప్టెన్​గా వరల్డ్ ఛాంపియన్​గా నిలబెట్టిన ఘతన హిట్​మ్యాన్​కే దక్కుతుంది.

సక్సెస్​ఫుల్​గా రిటైర్మెంట్
2024 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్్కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. 18ఏళ్ల సుదీర్ఘ టీ20 కెరీర్​లో రోహిత్ 159 మ్యాచ్​ల్లో 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండడం విశేషం. అలాగే రోహిత్ టీ20లకు గుడ్​ బై చెప్పే నాటికి ఈ ఫార్మాట్​లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్​గా అతడే టాప్​లో ఉన్నాడు.