రోహిత్, రికెల్టన్ ధనాధన్- లఖ్‌నవూను చిత్తుగా ఓడించిన ముంబయి
సొంతగడ్డపై రెచ్చిపోయిన రికెల్టన్, రోహిత్ శర్మ- ముంబయి ఇండియన్స్ మూడో విజయం- లఖ్‌నవూ ఓటమి

Published : May 5, 2026 at 12:06 AM IST
MI VS LSG IPL 2026 : హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబయి ఇండియన్స్ గెలుపు బాట పట్టింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రాకతో బ్యాటింగ్‌లో పటిష్ఠంగా మారిన ముంబయి భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసింది. లఖ్‌నవూ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (84 పరుగులు, 44 బంతుల్లో), ర్యాన్ రికెల్టన్ (83 పరుగులు, 32 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చిలర్లో నమన్ ధీర్ (23 పరుగులు) మెరిపించాడు. లఖ్‌నవూ బౌలర్లలో మనిమారన్ సిద్ధార్థ్ 2, మోహ్సిన్ ఖాన్, షమీ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ సీజన్లో పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొన్న నికోలస్ పూరన్ తొలిసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. 21 బంతుల్లోనే 61 పరుగులతో రఫ్పాడిచాడు. మిచెల్ మార్ష్ (44 పరుగులు), హిమ్మత్ సింగ్ (40), మార్క్రమ్ (31) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కార్భిన్ బాష్ 2, విల్ జాక్స్, రఘు శర్మ, గజన్ఫర్ తలో 1 వికెట్ పడగొట్టారు.
ఈ సీజన్లో ముంబయికి ఇది మూడో విజయం. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో ఓడి, మూడు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ప్రస్తుతం 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు, లఖ్‌నవూకు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఇది ఏడో ఓటమి. 4 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది.
ఐపీఎల్ హిస్టరీలో ఇది ఐదో అత్యధిక టార్గెట్ ఛేజింగ్. 265 పరుగులు ఛేజించిన పంజాబ్ ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఈ సీజన్లోనే ఇటీవస దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఈ ఘనత నమోదు చేసింది. 264 పరుగుల టార్గెట్ రెండో స్థానంలో ఉంది. 2024లో కోల్‌కతాపై పంజాబ్ కింగ్స్ జట్టే ఈ లక్ష్యాన్ని అందుకుంది. అలా టాప్ 2 టార్గెట్లను పంజాబే ఛేదించడం విశేషం. అయితే ఈ జాబితాలో టాప్ 6 భారీ టార్గెట్లలో ఈ సీజన్లోనే నాలుగు నమోదు అయ్యాయి. ఇక ముంబయి ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్లో ఇదే అత్యధిక భారీ ఛేజింగ్. ఇంతకుముందు ఇదే సీజన్లో కోల్‌కతాపై ముంబయి 221 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసింది.
IPLలో అత్యధిక లక్ష్యాల ఛేదనలు
- 265 - పంజాబ్ కింగ్స్ vs దిల్లీ- దిల్లీ, 2026
- 262 - పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా- కోల్‌కతా, 2024
- 246 - సన్‌రైజర్స్ vs పంజాబ్ కింగ్స్ - హైదరాబాద్, 2025
- 244 - సన్‌రైజర్స్ vs ముంబయి ఇండియన్స్- వాంఖడే, 2026
- 229 - సన్‌రైజర్స్ vs రాజస్థాన్- జైపుర్, 2026
- 229 - ముంబయి ఇండియన్స్ vs లఖ్‌నవూ- వాంఖడే, 2026*
IPLలో 200+ స్కోరును అత్యధిక సార్లు విజయవంతంగా ఛేదించిన జట్లు
- 11 - పంజాబ్ కింగ్స్
- 7 - ముంబయి ఇండియన్స్
- 6 - రాజస్థాన్ రాయల్స్
- 6 - సన్‌రైజర్స్ హైదరాబాద్
- 5 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రోహిత్‌కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన మేనేజ్మెంట్- లఖ్‌నవూతో మ్యాచ్‌లో బరిలోకి!
టీమ్‌లో హార్దిక్ పాండ్యకు సపోర్ట్ లేదా?- కెప్టెన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడా?- మాజీల అభిప్రాయమిదే!

