'అతడు ఇకపై ఆడనప్పుడు నేను ఏం చేయాలి?'- మెస్సి రిటైర్మెంట్‌పై తల్లి, భార్య భావోద్వేగ ప్రకటన
లియోనెల్ మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్ రిటైర్మెంట్‌పై స్పందించిన అతని తల్లి, భార్య- భావోద్వేగానికి గురైన తల్లి సెలియా- భర్త రిటైర్మెంట్‌పై ఇన్‌స్టాలో పోస్టు పెట్టిన భార్య ఆంటోనెలా

Published : September 1, 2026 at 7:33 AM IST
Messi Retirement Family Statement : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి తన కెరీర్‌కు వీడ్కోలు పలకడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెస్సి రిటైర్మెంట్, ఆయన తండ్రి జార్జ్ మెస్సి మరణం ఒకే సమయంలో జరగడంపై అతడి తల్లి సెలియా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మెస్సి ఆట గురించి తన భర్త అన్న మాటలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మెస్సి తండ్రి జార్జ్ మెస్సి గత నెల ఆగస్టు 8న రోసారియోలో తుదిశ్వాస విడిచారు. కొడుకు ఫుట్‌బాల్‌కు దూరమయ్యే రోజు వస్తే తన పరిస్థితి ఏమిటని జార్జ్ మెస్సి తరచూ ఆందోళన చెందేవారు. సరిగ్గా ఆయన మరణించిన కొన్ని వారాలకే మెస్సి కూడా అంతర్జాతీయ జెర్సీకి వీడ్కోలు పలకడం గమనార్హం.
ఈ పరిణామాలపై మెస్సి తల్లి సెలియా అమెరికా టీవీతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నేను ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాను. మాకు ముందే ఈ నిర్ణయం గురించి తెలిసినా, కుటుంబం మొత్తం బాధలో ఉన్నాం. కానీ, నా కొడుకు సంతోషంగా ఉండటమే మాకు ముఖ్యం. ఆయన తండ్రి ఎప్పుడూ ఒక మాట అనేవారు. 'అతను(మెస్సి) ఇకపై ఆడకపోతే నేను ఏం చేయాలి?' అని బాధపడేవారు. చివరికి ఆయన మరణం, మెస్సి రిటైర్మెంట్ దాదాపు ఒకే సమయంలో జరిగాయి" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నీపై ఉన్న ప్రేమ అనంతం: మెస్సి భార్య ఆంటోనెలా భావోద్వేగ సందేశం
మెస్సి సతీమణి ఆంటోనెలా రోక్కుజ్జో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాసిన ఒక సుదీర్ఘ భావోద్వేగ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెస్సి సుదీర్ఘ ప్రయాణాన్ని, ఆయన పడిన శ్రమను ఆమె ఆ లేఖలో పంచుకున్నారు. మెస్సి తన ప్రయాణాన్ని చూసి ఎంతో గర్విస్తున్నామని చెప్పారు.
"ఎన్ని సంవత్సరాలు, ఎన్నో క్షణాలు, ఎనలేని ఆనందం, అలాగే ఎన్నో ఎదురుదెబ్బలు. నువ్వు బాధపడటం, కిందపడటం, మళ్లీ లేవడం నేను చూశాను. పరిస్థితులు అనుకూలించనప్పుడు కూడా నువ్వు నిరుత్సాహపడకుండా ముందుకు సాగడం, మళ్లీ మళ్లీ ప్రయత్నించడం నేను కళ్లారా చూశాను. మా జీవితాల్లో అత్యంత మధురమైన రోజులను అనుభవించే అదృష్టం నాకు దక్కింది."
- ఆంటోనెలా రోక్కుజ్జో, మెస్సి సతీమణి
'ప్రపంచ కప్‌ను పైకి ఎత్తడం మన పిల్లలు చూశారు'
ఈ మొత్తం ప్రయాణంలో తనను కదిలించిన విషయం మరొకటి ఉందని ఆంటోనెలా చెప్పుకొచ్చారు. "మన పిల్లలు ఇదంతా ప్రత్యక్షంగా చూస్తూ పెరగడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. తమ తండ్రి తను కోరుకున్న దాని కోసం ఎలా పోరాడాడో, ఎప్పటికీ వెనకడుగు వేయకుండా చివరి వరకు ఎలా నమ్మాడో వారు చూశారు. నువ్వు ఇదంతా సాధించి, ప్రపంచ కప్‌ను పైకి ఎత్తడం వారు కళ్లారా చూశారు. ఒకరోజు మన పిల్లలు నీ గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ప్రస్తుతానికైతే వారు తమ తండ్రి విషయంలో గర్వంతో ఉన్నారు. నీ ప్రయాణం పట్ల, నువ్వు ఎదుర్కొన్న సవాళ్ల పట్ల, అన్నిటికంటే మించి నీ వ్యక్తిత్వం పట్ల నేను గర్విస్తున్నాను. నీ పక్కనే నిలబడి ఆ ప్రయాణంలో భాగమవడం నా అదృష్టం. నీపై మాకు ఉన్న ప్రేమ అనంతం" అని ఆంటోనెలా పేర్కొన్నారు.
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనా 0-1తో స్పెయిన్ చేతిలో ఓడిపోయిన కొద్ది వారాల తర్వాత మెస్సి ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 19న ఫైనల్ ముగిసిన రెండు రోజుల తర్వాతే తాను ఈ నిర్ణయం రాసుకున్నట్లు మెస్సి వెల్లడించారు. అయితే గత నెల ఆగస్టు 8న తన తండ్రి జార్జ్ మెస్సి మరణం తర్వాత, తన నిర్ణయం సరైనదేననే నమ్మకం మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు. జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే సమయం ఆసన్నమైందని, తాను తన వంతుగా దేశానికి కావాల్సినంత సేవలందించానని ఆయన భావోద్వేగంతో తెలిపారు.
రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సి - ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు
క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన ఫలితం- ప్రింటర్ పనిచేయకపోవడంతో మ్యాచ్‌లో ఓటమి- 'ఇదేం రూల్ బాబు?'

