ETV Bharat / sports

'ముంబయి ఇండియన్స్​కే నాలుగైదు టీమ్స్- ఛాంపియన్స్ లీగ్​ను తీసుకురావడం కష్టం'- లలిత్ మోదీ సెన్సేషనల్ కామెంట్స్

ఛాంపియన్స్ లీగ్​పై లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు- ఒకే యాజమాన్యానికి వేర్వేరు దేశాల్లో ఎన్నో క్రికెట్ జట్లు - టోర్నీని తిరిగి తీసుకొచ్చేందుకు బోర్డుల ప్రయత్నాలు

Champions League T20
ఛాంపియన్స్ లీగ్ టీ20 (ఫైల్) (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : August 29, 2026 at 2:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

Champions League T20 : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, కరీబియన్ లీగ్, ఆస్ట్రేలియా బిగ్ బాష్​తోపాటు ప్రపంచంలోని ఆయా దేశాల డొమెస్టిక్ లీగ్​ల్లోని టాప్ జట్లు ఒకే టోర్నమెంట్‌లో తలపడితే క్రికెట్ అభిమానులకు అంతకంటే కిక్క్ ఇంకేముంటుంది? గతంలో ఛాంపియన్స్ లీగ్ టీ20 ద్వారా ఇలాంటి మ్యాచ్‌లు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దేశాల లీగ్​ల్లోని అత్యుత్తమ జట్లు ఇందులో పోటీపడి ఆడియెన్స్​కు ఫుల్ మజానిచ్చాయి. అయితే 2014 తర్వాత ఈ టోర్నీ కనిపించలేదు. అయితే, కొంతకాలంగా మళ్లీ ఛాంపియన్స్ లీగ్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే?

ఓనర్లకు ఇన్ని జట్లా?
ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్​ ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఛాంపియన్స్ లీగ్​ను తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని లలిత్ మోదీ తేల్చేశారు. ఒకప్పుడు అతనే మొదలుపెట్టిన టోర్నీ గురించి తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్​ అవుతున్నాయి. అయితే ఆయన చెప్పిన అసలు పాయింట్ ఫ్రాంచైజీల యాజమాన్యాల గురించే. గతంలో ఛాంపియన్స్ లీగ్ జరిగినప్పుడు వివిధ దేశాల నుంచి వచ్చే జట్లకు ఎక్కువగా వేర్వేరు ఓనర్లు ఉండేవారని ఆయన చెప్పారు. ఇప్పుడు మాత్రం ఒకే గ్రూప్ ప్రపంచంలోని చాలా లీగ్స్‌లో జట్లను కొనుగోలు చేసింది.

ముంబయి ఇండియన్స్ యాజమాన్యానికే భారత్‌లో ముంబయి ఇండియన్స్, సౌతాఫ్రికాలో ఎంఐ కేప్‌టౌన్, యూఏఈలో ఎంఐ ఎమిరేట్స్, అమెరికాలో ఎంఐ న్యూయార్క్, ఇంగ్లాండ్‌లో ఎంఐ లండన్ ఉన్నాయి. అలాగే లఖ్​నవూ సూపర్ జెయింట్స్ యాజమాన్యానికి సౌతాఫ్రికాలో డర్బన్స్ సూపర్ జెయింట్స్, ఇంగ్లాండ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఇలాంటి జట్లే ఆయా లీగ్స్ నుంచి క్వాలిఫై అయితే ఒకే యాజమాన్యానికి చెందిన టీమ్స్ ఒకదానితో మరొకటి ఆడాల్సి వస్తుందని లలిత్ మోదీ అన్నారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత తరహాలో ఛాంపియన్స్ లీగ్ నిర్వహించడం సాధ్యం కాదని అంటున్నారు.

Champions League T20 SunRisers
2013 ఛాంపియన్స్ లీగ్​లో సన్​రైజర్స్​కు ఆడిన ధావన్ (ఫైల్) (Source : IANS)

ఆరు సీజన్ల తర్వాత ఎందుకు ఆపేశారంటే?
ఛాంపియన్స్ లీగ్ టీ20ను భారత్, ఆస్ట్రేలియా, కరీబియన్, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులు కలిసి 2009లో ప్రారంభించాయి. వివిధ దేశాల దేశవాళీ టీ20 టోర్నీల్లో టాప్‌లో నిలిచిన జట్లను ఇందులో ఆడించేవారు. ముంబయి ఇండియన్స్ రెండుసార్లు టైటిల్ గెలవగా, చెన్నై సూపర్ కింగ్స్ కూడా రెండుసార్లు విజేతగా నిలిచింది. న్యూ సౌత్ వేల్స్ బ్లూస్, సిడ్నీ సిక్సర్స్ ఒక్కోసారి ట్రోఫీ అందుకున్నాయి. మొత్తం ఆరు ఎడిషన్స్ జరిగిన తర్వాత 2014తో టోర్నీ ఆగిపోయింది. 2015లో మూడు బోర్డులు కలిసి ఛాంపియన్స్ లీగ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అప్పట్లో అభిమానులు, స్పాన్సర్ల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేకపోవడం కారణంగానే ఆపేసినట్లు చెప్పారు. చివరిసారి జరిగిన 2014 ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

మళ్లీ తీసుకొచ్చే ప్లాన్!
లలిత్ మోదీ ఛాంపియన్స్ లీగ్ ఇక జరగదని చెబుతున్నా, క్రికెట్ బోర్డులు మాత్రం దాన్ని మళ్లీ ప్రారంభించేలా ఇప్పటికే ప్లాన్ వేసినట్లు సమాచారం. ఐసీసీ వార్షిక సమావేశాల సందర్భంగా సింగపూర్‌లో కలిసిన సభ్య దేశాల ప్రతినిధులు ఈ టోర్నీని తిరిగి తీసుకురావాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 నుంచే కొత్త రూపంలో ఛాంపియన్స్ లీగ్ మొదలయ్యే అవకాశం ఉందని టాక్. భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఇందులో కీలకంగా ఉండే అవకాశం ఉంది.

కొత్త ఛాంపియన్స్ లీగ్ ఎలా ఉంటుందో?
ఛాంపియన్స్ లీగ్‌ను మళ్లీ తీసుకొస్తే పాత ఫార్మాట్‌ను అలాగే కొనసాగించే అవకాశం లేదు. ఇప్పుడు ఒకే యాజమాన్యానికి వేర్వేరు దేశాల్లో జట్లు ఉండటంతో కొన్ని కొత్త రూల్స్ పెట్టాల్సి వస్తుంది. ఒకే గ్రూప్‌కు చెందిన రెండు జట్లు క్వాలిఫై అయితే ఏం చేస్తారు? ఒక ఆటగాడు రెండు జట్లతో సంబంధం ఉంటే ఎవరికి ఆడాలి? ఒక్కో లీగ్ నుంచి ఎన్ని టీమ్స్‌ను తీసుకుంటారు? అనే విషయాలు ఇంకా తేలలేదు. 2027 నుంచి టోర్నీని మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఉందని ఒక టాక్ ఉన్నా, పూర్తి ఫార్మాట్, క్వాలిఫికేషన్ రూల్స్‌పై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు.

'మహిళల క్రికెట్​లో అనయకు ఎలా అనుమతిస్తారు?'- మరిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం

చరిత్ర సృష్టించిన నమీబియా- మళ్లీ సౌతాఫ్రికాను ఓడించిన పసికూన