ఒక్క సీజన్‌కే ద్రవిడ్‌కు హ్యాండ్ ఇచ్చారా? ఆర్ఆర్ హెడ్ కోచ్‌గా ఆ లెజెండ్ రీ ఎంట్రీ!
IPL 2026కి ఆర్ఆర్ హెడ్ కోచ్‌గా లెజెండ్ రీ ఎంట్రీ- 2025లో కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ స్థానంలో మార్పు.

Published : November 17, 2025 at 4:46 PM IST
Kumar Sangakkara Head Coach: ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఫ్రాంచైజీలన్నీ పక్కా ప్లానింగ్‌తో సిద్ధమవుతున్నాయి. మెగా ఆక్షన్‌కు ముందే తమ కోచింగ్ స్టాఫ్‌ను సెట్ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో, ఒక టాప్ ఫ్రాంచైజీ పెద్ద సంచలనమే సృష్టించింది. గత సీజన్ (2025)లో ఇండియన్ లెజెండ్‌ను ఎంతో ఆర్భాటంగా హెడ్ కోచ్‌గా తెచ్చుకున్న ఆ టీమ్, ఇప్పుడు ఈ సీజన్‌కు అతన్ని పక్కనపెట్టింది. ఆ ప్లేస్‌లోకి, తమ పాత కోచ్‌నే మళ్లీ వెనక్కి రప్పించింది. ఆ టీమ్ ఏంటి? ఆ లెజెండ్ ఎవరు? ఆ పాత కోచ్ ఎవరు? ఈ అనూహ్యమైన మార్పు వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి ?
ద్రవిడ్‌పై వేటు- మళ్లీ సంగక్కరకే బాధ్యతలు
రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీ సోమవారం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు తమ హెడ్ కోచ్‌గా శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది. 2025 సీజన్‌లో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించగా, ఇప్పుడు ఒక్క సీజన్ తర్వాతే అతన్ని తప్పించి, మళ్లీ పాత కోచ్‌కే బాధ్యతలు అప్పగించారు. సంగక్కర 2021 నుంచి 2024 వరకు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అతని కోచింగ్‌లోనే రాజస్థాన్ 2022లో ఫైనల్ చేరింది, 2024లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే ఫామ్ రిపీట్ చేయాలని టీమ్ భావిస్తోంది.
డ్యూయల్ రోల్- అందుకే ఈ మార్పు
సంగక్కర కేవలం హెడ్ కోచ్‌గానే కాదు, తన పాత రోల్ అయిన 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా కూడా కొనసాగుతాడు. ఈ డ్యూయల్ రోల్‌పై ఫ్రాంచైజీ ఓనర్ మనోజ్ బదాలే క్లారిటీ ఇచ్చారు. "ప్రస్తుత స్టేజ్‌లో జట్టుకు ఏం కావాలో చూశాం. సంగక్కర నాయకత్వం, జట్టుతో అతనికి ఉన్న బాండింగ్, రాయల్స్ కల్చర్ గురించి అతనికున్న లోతైన అవగాహన ఇవన్నీ జట్టుకు సరైన స్థిరత్వాన్ని ఇస్తాయని నమ్మాం," అని అన్నారు. ఒక లీడర్‌గా సంగక్కరపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతని ప్రశాంతత, తెలివితేటలు జట్టును నెక్స్ట్ ఫేజ్‌కు తీసుకెళ్తాయని బదాలే తెలిపారు.
కోచింగ్ స్టాఫ్‌లో మరిన్ని మార్పులు
హెడ్ కోచ్ మార్పుతో పాటు, మిగిలిన కోచింగ్ స్టాఫ్‌లో కూడా రాజస్థాన్ రాయల్స్ కీలక మార్పులు చేసింది. విక్రమ్ రాథోడ్‌కు ప్రమోషన్ ఇస్తూ 'లీడ్ అసిస్టెంట్ కోచ్'గా నియమించింది. అయితే, న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్ మాత్రం బౌలింగ్ కోచ్‌గా యథాతథంగా కొనసాగుతాడు. వీరితో పాటు, ట్రెవర్ పెన్నీ అసిస్టెంట్ కోచ్‌గా, సిద్ లహిరి పెర్ఫార్మెన్స్ కోచ్‌గా తిరిగి జట్టులోకి వచ్చారు. మొత్తం మీద, ద్రవిడ్‌ను పక్కనపెట్టి, సంగక్కర లీడర్‌షిప్‌లో 2026 సీజన్‌కు పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగాలని రాజస్థాన్ రాయల్స్ గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.
సంజూ ఔట్, ద్రవిడ్ ఔట్-టీమ్ పరిస్థితేంటి?
ఈ కోచింగ్ మార్పు ఇప్పుడు ప్లేయర్లపై పెద్ద ఇంపాక్ట్ చూపించనుంది. రాహుల్ ద్రవిడ్ వచ్చి ఒక్క సీజన్ మాత్రమే అవ్వడంతో, అతను సెట్ చేసుకున్న ప్లాన్స్ అన్నీ పక్కకు వెళ్లినట్లే. ముఖ్యంగా, కొద్ది రోజుల క్రితమే జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ (CSKకు ట్రేడ్ అయిన) టీమ్‌ను వీడిన టైమ్‌లో, ఇప్పుడు కోచ్‌ను కూడా మార్చడం గమనార్హం. జట్టుకు ఒక 'స్ట్రాంగ్' లీడర్‌షిప్ అవసరం. ఇక ఇప్పుడు సంగక్కర రీ ఎంట్రీ కీలకం కానుంది. అతను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, హెడ్ కోచ్‌గా రెండు బాధ్యతల్లో ఉండటంతో జట్టు మళ్లీ కొత్తగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. మొదటి IPL ట్రోఫీని అందుకున్న రాజస్థాన్ ఇప్పటివరకు మళ్లీ ఫైనల్లో గెలవలేదు. మరి ఈసారి ఎలాంటి పర్ఫామెన్స్ చూపిస్తారో చూడాలి.

