IPL మ్యాచ్‌లకు అంపైర్లు తీసుకునే జీతం ఎంతో తెలుసా? డైలీ అలవెన్స్‌లు కూడా!
ఐపీఎల్ మ్యాచ్‌లో అంపైర్ల సంపాదనపై అనిల్ చౌదరి క్లారిటీ- సీజన్‌కు దాదాపు 45లక్షల నుంచి 50లక్షల రూపాయల వరకు సంపాదన- టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతో పాటు టెస్ట్ మ్యాచ్‌లకు లభించే ఫీజుల వివరాలు ఇవే

Published : July 2, 2026 at 5:15 PM IST
IPL Umpires Salary : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లకు మాత్రమే కాకుండా మ్యాచ్‌లు నడిపించే అంపైర్లకు కూడా భారీగా డబ్బులు అందుతాయి. ఈ లీగ్‌లో అంపైరింగ్ చేసే అఫీషియల్స్ ఒక్కో సీజన్‌కు ఎంత సంపాదిస్తారనే విషయాలను అంతర్జాతీయ మాజీ అంపైర్ అనిల్ చౌదరి ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టారు. ఐసీసీ ఈవెంట్లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లలో కూడా అంపైరింగ్ చేసిన ఆయన 2025 సంవత్సరంలో ఈ బాధ్యతల నుంచి రిటైర్ అయ్యారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఐపీఎల్లో ఒక అంపైర్ సగటున ఒక సీజన్‌కు దాదాపు రూ. 45 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు సంపాదిస్తారు.
మ్యాచ్‌ల వారీగా లభించే డాలర్లు
ఐపీఎల్ లీగ్ దశలో జరిగే మ్యాచ్‌ల నుంచి ఫైనల్స్ వరకు అంపైర్లకు ఇచ్చే ఫీజులు వేర్వేరుగా ఉంటాయని అనిల్ చౌదరి స్పష్టం చేశారు. లీగ్ స్టేజ్‌లో ఒక్కో మ్యాచ్‌కు దాదాపు రూ. 3.3 లక్షల రూపాయలు (4000 డాలర్లు) లభిస్తాయి. అదే ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల విషయానికి వస్తే ఈ ఫీజు సుమారు రూ. 5 లక్షల రూపాయలకు (6000 డాలర్లు) పెరుగుతుంది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసే అఫీషియల్స్‌కు ఏకంగా రూ. 6.6 లక్షల రూపాయల (8000 డాలర్లు) వరకు చెల్లిస్తారు. వీటితో పాటు వీళ్లకు లభించే డైలీ అలవెన్స్ కింద అదనంగా మరో రూ.5 లక్షల రూపాయల (6000 డాలర్లు) వరకు అందుతుందని అన్నారు. ఒకవేళ వీళ్లు దేశవాళీ క్రికెట్‌లో కూడా టాప్ అంపైర్లుగా కొనసాగుతుంటే అక్కడ కూడా మరో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల రూపాయల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.
అంతర్జాతీయ మ్యాచ్‌ల ఫీజుల వివరాలు
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల విషయానికి వస్తే అక్కడ కూడా అంపైర్లకు లభించే ఫీజులు చాలా భారీగానే ఉంటాయి. ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అంపైరింగ్ చేసినందుకు గాను దాదాపు రూ.2 లక్షల రూపాయల వరకు ఇస్తారని అనిల్ చౌదరి తెలిపారు. అదే ఒక టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ఏకంగా రూ.8 లక్షల రూపాయల వరకు ఫీజుగా అందుతుందని వెల్లడించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వర్షం వల్ల లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయిపోయినా కూడా అంపైర్ల పేమెంట్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. మ్యాచ్ జరిగిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా అంపైర్లకు అందాల్సిన పూర్తి ఫీజును బోర్డులు చెల్లిస్తాయని ఆయన క్లియర్‌గా చెప్పారు.
కెప్టెన్ల DRS స్టైల్స్
క్రికెట్ గ్రౌండ్‌లో నిర్ణయాలు తీసుకునే సమయంలో టీమ్ఇండియా స్టార్ కెప్టెన్లు DRSని ఎలా ఉపయోగించుకునే వాళ్లో అనిల్ చౌదరి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. విరాట్ కోహ్లీ డీఆర్ఎస్ అప్పీళ్ల విషయంలో ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉండేవాడు. అంపైర్ ఏదైనా ఔట్ ఇవ్వకపోతే, వెంటనే రివ్యూ తీసుకోవడానికి ఎగబడేవాడని అనిల్ చౌదరి చెప్పారు. అదే సమయంలో రోహిత్ శర్మ కాలక్రమేణా చాలా పరిణతి సాధించాడని, ఇప్పుడు చాలా ఆచితూచి మాత్రమే రివ్యూలను సెలెక్ట్ చేసుకుంటున్నాడని తెలిపారు. వీరిద్దరి స్టైల్ గ్రౌండ్‌లో చాలా భిన్నంగా కనిపిస్తుందని అనిల్ వివరణ ఇచ్చారు.
ధోని రివ్యూ సిస్టమ్ మాస్టర్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి అనిల్ చౌదరి ప్రత్యేకంగా మాట్లాడారు. ధోనిని డీఆర్ఎస్ పద్ధతిలో రియల్ మాస్టర్ అని ఆయన కొనియాడారు. వికెట్ల వెనుక ధోని ఉండే పొజిషన్ బాల్ వెళ్లే లైన్‌ను కచ్చితంగా అంచనా వేయడానికి ఎంతగానో సహాయపడుతుందని చెప్పారు. గ్రౌండ్‌లో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా వరకు పక్కాగా ఉంటాయని ప్రశంసించారు. అందుకే అందరూ దీన్ని ధోని రివ్యూ సిస్టమ్ అని పిలుస్తుంటారని చెప్పారు. డీఆర్ఎస్ అంచనా వేయడంలో ధోని తర్వాతే ఎవరైనా అని, అంతటి అద్భుతమైన నైపుణ్యం ఆయన సొంతమని అనిల్ చౌదరి స్పష్టం చేశారు.
ఎంతటి గొప్ప అనుభవం ఉన్న ధోని కూడా కొన్ని అరుదైన సందర్భాల్లో డీఆర్ఎస్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న రోజులు ఉన్నాయని అనిల్ చౌదరి గుర్తుచేశారు. అంపైర్ల నిర్ణయాలను సవాల్ చేసే క్రమంలో వికెట్ కీపర్‌గా ఎంతటి అనుభవం ఉన్నప్పటికీ కొన్నిసార్లు అంచనాలు తలకిందులు అవుతుంటాయని చెప్పారు.
వరుణుడి ఖాతాలోకి తొలి టీ20- అదరగొట్టిన భారత్- ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయకుండానే మ్యాచ్ రద్దు
భారత్ vs ఇంగ్లాండ్ T20 సిరీస్- OTT ఫ్యాన్స్‌కు 'డబుల్ బొనాంజా'!- ఎందుకంటే?

