ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు- వచ్చే ఏడాది మార్చి 15 నుంచే టోర్నీ?
ఐపీఎల్ షెడ్యూల్: ఇకపై మార్చి 15 నుంచి మే 15 వరకు!- మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉందా?

Published : June 2, 2026 at 4:37 PM IST
IPL Schedule To Change : వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ షెడ్యూల్ మారనుందా? మార్చి 15 నుంచే టోర్నో మొదలుకానుందా? మ్యాచ్‌ల సంఖ్య కూడా భారీగా పెరగనుందా? మీడియాలో వస్తున్న ఈ వార్తలపై బీసీసీఐ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఐపీఎల్ విండో మార్పు గురించి పెద్దగా ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్‌లకు, ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తున్న వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంపై మాత్రమే దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. తీవ్రమైన ఎండలు, వర్షాల వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగకుండా వచ్చే సీజన్ నుంచి టోర్నమెంట్‌ను రెండు వారాల ముందే ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ఏడాది (2026) ఐపీఎల్ మార్చి 28న ప్రారంభం కాగా, కొన్ని మ్యాచ్‌లపై వర్షం ప్రభావం పడింది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే వర్షార్పణం అయ్యింది. మరోవైపు వేసవి ఎండల తీవ్రత వల్ల మైదానంలోని ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు చాలా ఇబ్బందులు పడ్డారు. టోర్నమెంట్ జరిగే సమయంలో ఇలా వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంపై బీసీసీఐ ఆందోళన చెందుతోంది.
మ్యాచ్‌ల సంఖ్య పెంచుతారా?
ఓ ప్రముఖ మీడియాతో బీసీసీఐ బోర్డు మెంబర్ దేవజిత్ సైకియా మాట్లాడుతూ, ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచుతారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. "బీసీసీఐ ఈ అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎందుకంటే, గతంలో లాగానే ఈ ఏడాది కూడా ఐపీఎల్ రెండు నెలల కంటే ఎక్కువ కాలం సాగింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ఈ ఏడాది 2 నెలల 2 రోజులపాటు టోర్నమెంట్ జరిగింది. అయితే ప్రస్తుతం బీసీసీఐ బోర్డు మ్యాచ్‌ల సంఖ్య కంటే, వాతావరణ పరిస్థితులపైనే ప్రధానంగా దృష్టి సారించింది" అని దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
'గతేడాది ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత, మధ్యలో ఒక వారం పాటు టోర్నమింట్ను నిలిపివేశారు. దీనితో లీగ్ కొద్దిగా పొడిగించబడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాకు ఉన్న ఆందోళన ఏమిటంటే, టోర్నమెంట్ మే 31 వరకు సాగితే, వర్షాల వల్ల కొన్ని మ్యాచ్‌లపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరికొన్ని మ్యాచ్‌లపై ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్సుంది' అని దేవజిత్ సైకియా అభిప్రాయపడ్డారు.
టోర్నీని ముందుకు జరుపుతారా?
తీవ్రమైన ఎండలు, ముందస్తు వర్షాల (ప్రీ-మాన్సూన్) ప్రభావం పడకుండా ఉండడం కోసం ఐపీఎల్ షెడ్యూల్‌ను కాస్త ముందుకు జరిపి, మే నెల మధ్య నాటికే టోర్నమెంట్‌ను ముగించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోందని సైకియా స్పష్టం చేశారు.
"మేము ఐపీఎల్‌ను మరో 15 రోజులు ముందుకు తీసుకువచ్చే మార్గాలను అన్వేషిస్తున్నాం. ఈ ఏడాది మేము మార్చి 28న టోర్నీని ప్రారంభించాం. కానీ వచ్చే సీజన్ నుంచి కాస్త ముందుగా, అంటే బహుశా మార్చి 15 నాటికే ఐపీఎల్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించాం. మే 15 కల్లా టోర్నమెంట్‌ను ముగించాలని చూస్తున్నాం. దీని వల్ల వేడి వాతావరణం లేదా వర్షాల ప్రభావం అటు ఆటగాళ్లపై, ఇటు స్టేడియానికి వచ్చే వీక్షకులపై, అభిమానులపై పడకుండా ఉంటుంది" అని సైజికా పేర్కొన్నారు.
భవిష్యత్తులో మ్యాచ్‌లు పెంచే ఛాన్స్ ఉందా?
భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచుతారా, లేదా? అనే ప్రశ్నకు సైకియా తనదైన రీతిలో సమాధానం చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా, అది పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్, ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) నిబంధనలపై ఆధారపడి ఉంటుందని సైకియా స్పష్టం చేశారు.
"కాబట్టి మేము దీనిపై పని చేస్తున్నాం. కానీ మ్యాచ్‌లను 74 నుంచి 94కి పెంచే విషయాన్ని ప్రస్తుతానికి అంత సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పలేను. ఎందుకంటే ఇందులో అనేక ఇతర అంశాలు ముడిపడి ఉన్నాయి. ఐసీసీ నిర్వహించే వివిధ ఎఫ్టీపీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు, మల్టీనేషనల్ టోర్నమెంట్లను కూడా మేము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మ్యాచ్‌లు పెంచడంపై ప్రస్తుతానికి ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడం లేదు. అయితే 2027 తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో చూద్దాం. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది" అని దేవజిత్ సైకియా అన్నారు.
2026 IPL : ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?
17ఏళ్లు నో టైటిల్- ఏడాది గ్యాప్‌లో రెండుసార్లు ఛాంపియన్- ట్రోల్స్‌కు చెక్ పెట్టిన ఆర్సీబీ బాయ్స్!

