ఐపీఎల్ ఆటగాళ్లకు అధికారుల సీరియస్ వార్నింగ్- స్టేడియంలో అవి వాడితే కఠిన చర్యలు తప్పవు!
ఐపీఎల్ ఆటగాళ్లకు సరికొత్త రూల్స్- ఆ వస్తువుల వాడకంపై నిషేధం- డగౌట్‌లో కొత్త రూల్స్ తెచ్చిన బోర్డు

Published : May 29, 2026 at 1:01 PM IST
BCCI Strict Rules In IPL : ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఫ్యాన్స్ అంతా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల మజాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో టోర్నీ నిర్వాహకులు ఆటగాళ్లకు, అలాగే సపోర్ట్ స్టాఫ్‌కు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. స్టేడియంలోకి ఒక కచ్చితమైన వస్తువును తీసుకురాకూడదని, వాటిని వాడితే యాక్షన్ తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. దీంతో అసలు ఆ వస్తువులు ఏంటి, అధికారులు ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
ఆ స్మార్ట్ వస్తువులపైనే నిషేధం
స్టేడియంలోని సెన్సిటివ్ ఏరియాల్లో ఆటగాళ్లు స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ సన్ గ్లాసెస్ అలాగే రికార్డింగ్ ఫీచర్లు ఉన్న హైటెక్ కళ్లద్దాలను వాడకూడదని ఐపీఎల్ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్‌యూ) లేటెస్ట్గా ఆదేశాలు జారీ చేసింది. ప్లేయర్లు, మ్యాచ్ అఫీషియల్స్ ఉండే ప్రత్యేక ఏరియాల్లోకి వీటిని తీసుకురావడం పూర్తిగా నిషేధించారు. మార్కెట్లో ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీతో ఉన్న కళ్లద్దాలు ఎక్కువగా వస్తుండటంతో అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యారు.
అసలు భయం ఎక్కడంటే
ఈ స్మార్ట్ గ్లాసెస్ చూడటానికి మామూలు కళ్లద్దాల్లాగే ఉన్నా, వాటిలో లైవ్ స్ట్రీమింగ్ చేసే కెమెరాలు ఉంటాయి. అలాగే వైఫై, మొబైల్ డేటా ద్వారా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయం కూడా ఉంటుంది. మెసేజ్‌లు పంపడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటిని మ్యాచ్‌లు జరిగే సమయంలో ఎవరైనా వాడితే బయట ఉన్న బుకీలతో సులభంగా కాంటాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. స్పాట్ ఫిక్సింగ్ లాంటివి జరగకుండా చూసేందుకే ఏసీఎస్‌యూ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫోన్లతో పాటే వాటిని కూడా ఇచ్చేయాలి
ఇప్పటివరకు ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లేటప్పుడు తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లను భద్రతా అధికారులకు అప్పగించేవారు. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం తమ వద్ద ఉన్న స్మార్ట్ కళ్లద్దాలను కూడా అక్కడే సెక్యూరిటీ అధికారులకు ఇచ్చేయాలి. అయితే భవిష్యత్తులో ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేసి అలాంటి వస్తువులను సీక్రెట్‌గా లోపలికి తీసుకెళ్తే మాత్రం నిబంధనల ప్రకారం వారిపై చాలా కఠినమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది.
డగౌట్ దగ్గర కూడా కొత్త టెన్షన్
నిజానికి ఈ సీజన్‌లో అధికారులు ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. మే నెల మొదట్లో కూడా టీమ్ డగౌట్‌ల దగ్గర సంబంధం లేని వ్యక్తులు తిరుగుతున్నారని ఏసీఎస్‌యూ గుర్తించింది. నెట్ బౌలర్లు, లాజిస్టిక్స్ స్టాఫ్ లాంటి వాళ్లు పర్మిషన్ లేని కమ్యూనికేషన్ డివైజ్‌లు తీసుకుని లోపలికి రాకూడదని అప్పట్లోనే అన్ని ఫ్రాంచైజీల సీఈఓలతో మీటింగ్ పెట్టి మరీ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.
ఆ అలవాట్లపై కూడా నిఘా
స్టేడియంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ స్మోకింగ్ చేయడం లాంటి వాటిపై కూడా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే హోటల్ లాబీల్లో, కేఫ్‌ల్లో, స్మోకింగ్ జోన్‌ల దగ్గర ఆటగాళ్లు అనవసరంగా గుంపులుగా తిరగకూడదని సూచించారు. ఎందుకంటే అలాంటి పబ్లిక్ ప్రదేశాల్లోనే బుకీలు ఆటగాళ్లను కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పరిసరాల్లో కూడా సెక్యూరిటీని బాగా పెంచారు.
పదేళ్లుగా మారుతున్న టెక్నాలజీ
2013లో ఐపీఎల్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత బోర్డు చాలా కఠినమైన రూల్స్ తీసుకువచ్చింది. అప్పటి నుంచి యాంటీ కరప్షన్ యూనిట్ స్టేడియాలు, హోటళ్లు, ప్రాక్టీస్ చేసే గ్రౌండ్ల దగ్గర భద్రతను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అలెర్ట్ చేస్తోంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయి కళ్లద్దాల రూపంలో కూడా డివైజ్‌లు వస్తుండటంతో నిర్వాహకులు ఒక అడుగు ముందే వేసి ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను పూర్తిగా బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఒక్క రోజే రెండు ప్రపంచ రికార్డులు- వేర్వేరు ఈవెంట్లలో సత్తా చాటిన భారత అథ్లెట్లు!

