ఖతార్‌లో కేరళ కుర్రాడు, కాంగోలో తమిళ తంబి- ఫిఫాలో నలుగురు భారత మూలాలున్న ప్లేయర్లు- ఒకరికి ఇండియన్ పాస్‌పోర్ట్ కూడా!
ఫిఫా వరల్డ్ కప్‌లో భారత సంతతి ఆటగాళ్లు- ఒక ప్లేయర్ వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్- మరో 8 రోజుల్లో ఫుట్‌బాల్ సంబరం

Published : June 3, 2026 at 7:28 PM IST
|Updated : June 3, 2026 at 9:44 PM IST
FIFA World Cup 2026 : ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 12న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ షురూ కానుంది. అయితే ఈ ప్రపంచకప్‌లో ఆడడాన్ని ప్రతి దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ ఈ మెగా టోర్నీలో మన భారత జట్టుకు ఇప్పటిదాకా ఆడే అవకాశం రాలేదు. 1950లోనే భారత్ అర్హత సాధించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గింది. కానీ ఈసారి జరగబోయే ఫిఫా వరల్డ్ కప్‌లో మన దేశానికి ఒక సరికొత్త గుర్తింపు లభించబోతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఏకంగా నలుగురు భారత సంతతి ఆటగాళ్లు వేర్వేరు దేశాల తరఫున బరిలోకి దిగుతున్నారు. అందులో ఒక ఆటగాడు ఇప్పటికీ భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండటం విశేషం. మరి ఆ నలుగురు ప్లేయర్లు ఎవరు, వారి నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం!
ఖతార్ జట్టులో కేరళ కుర్రాడు
ఈ నలుగురిలో అందరినీ ఆకర్షిస్తున్న పేరు తహ్సిన్ మహ్మద్ జంషీద్. కేవలం 19 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడు ఖతార్ దేశం తరఫున వరల్డ్ కప్‌లో ఆడబోతున్నాడు. ఇతని తల్లిదండ్రులు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందినవారు కాగా, తహ్సిన్ దోహాలో జన్మించాడు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే ఒక భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న ఆటగాడు బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇతని వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్‌తో పాటు ఖతార్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ప్రత్యేక మిషన్ పాస్‌పోర్ట్ కూడా ఉంది. ఖతార్ లీగ్‌లో అల్ దుహైల్ జట్టు తరఫున ఆడుతూ ఈ కుర్రాడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
A historic moment for Indian football fans! As the 2026 FIFA World Cup approaches, we will have two players of Indian heritage gracing the global stage. 🌏⚽
— Shashi Tharoor (@ShashiTharoor) June 2, 2026
19-year-old winger Tahsin Mohammed Jamshid makes history as the first player of Indian origin selected for the Qatar…
న్యూజిలాండ్ జట్టులో పంజాబీ కనెక్షన్
ఈ టోర్నీలో సందడి చేయబోతున్న మరొక భారత సంతతి ఆటగాడు సర్ ప్రీత్ సింగ్. 27 ఏళ్ల ఈ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ న్యూజిలాండ్ జాతీయ జట్టు తరఫున మైదానంలోకి దిగనున్నాడు. సర్ ప్రీత్ సింగ్ ఆక్లాండ్‌లో జన్మించినప్పటికీ, అతని తల్లిదండ్రులు పంజాబ్ నేపథ్యం ఉన్నవారే. ఇప్పటివరకు న్యూజిలాండ్ జట్టు తరఫున 26 మ్యాచ్‌లు ఆడిన ఇతను 3 గోల్స్ చేయడంతో పాటు 7 అసిస్ట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్భుతమైన పాసింగ్ స్కిల్స్‌తో మిడ్‌ఫీల్డ్‌లో కీలక ఆటగాడిగా మారిన సర్ ప్రీత్ సింగ్, ఈ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టుకు ఆయుధంగా మారనున్నాడు.

ఆస్ట్రేలియా తరఫున నిషాన్ వేట
సాకర్స్ అని పిలిచే ఆస్ట్రేలియా జట్టులోనూ మన భారతీయ మూలాలున్న ఆటగాడు చోటు సంపాదించుకున్నాడు. మెల్‌బోర్న్ విక్టరీ క్లబ్ తరఫున ఆడే నిషాన్ వేలుపిళ్లై ఈసారి ఆస్ట్రేలియా జెర్సీతో వరల్డ్ కప్‌లో కనిపించనున్నాడు. మెల్‌బోర్న్‌లోనే పుట్టి పెరిగిన నిషాన్ తండ్రి శ్రీలంక తమిళ వంశానికి చెందినవారు కాగా, తల్లి ఆంగ్లో ఇండియన్. ఆస్ట్రేలియా సీనియర్ జట్టు తరఫున ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నిషాన్, అందులోనే ఏకంగా మూడు గోల్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
కాంగో జట్టులో తమిళ రక్తం
ఆఫ్రికా ఖండం నుంచి ఈసారి వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన డీఆర్ కాంగో జట్టులోనూ ఒక భారతీయ కనెక్షన్ ఉంది. ఆ జట్టులోని కీలక సెంట్రల్ మిడ్‌ఫీల్డర్ శామ్యూల్ ముత్తుసామి తల్లి కాంగో దేశానికి చెందినవారే అయినప్పటికీ, అతని తండ్రి మాత్రం తమిళ మూలాలున్న వ్యక్తి. 29 ఏళ్ల శామ్యూల్ పారిస్‌లో జన్మించాడు. అతని పూర్వీకులు ఒరిజినల్‌గా తమిళనాడుకు చెందినవారు కావడంతో, ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న నలుగురు భారత సంతతి ఆటగాళ్లలో ఈయన కూడా ఒకరిగా నిలిచాడు.

భారత ఫుట్‌బాల్ జట్టు గ్రౌండ్‌లో లేకపోయినా, ఈ నలుగురు ఆటగాళ్లు వరల్డ్ కప్‌లో ఉండడం విశేషం. ముఖ్యంగా తహ్సిన్ లాంటి కుర్రాళ్లు భారతీయ పాస్‌పోర్ట్‌తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడటం అనేది మన దేశంలోని యువ ఫుట్‌బాల్ ప్లేయర్లకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలి. జూన్ 12 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానుండటంతో, మన క్రీడా అభిమానులంతా ఈ నలుగురు ఆటగాళ్లు మైదానంలో ఎప్పుడు కనిపిస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మారిన ఫిఫా రూల్స్
ఈసారి జరగబోయే ఫిఫా వరల్డ్ కప్‌లో జట్లను పెంచడం వల్ల కూడా మన ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు దక్కాయి. గతంలో 32 జట్లు మాత్రమే ఆడే ఈ టోర్నీని ఈసారి 48 జట్లకు విస్తరించారు. వీటిని మొత్తం 12 గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. జట్ల సంఖ్య పెరగడం వల్ల కతార్, న్యూజిలాండ్, కాంగో లాంటి జట్లకు మెగా టోర్నీలో ఆడే మార్గం సులువైంది. ఆయా దేశాల జాతీయ జట్లలో మన భారతీయ మూలాలున్న ఆటగాళ్లు పీక్ ఫామ్‌లో ఉండటం వల్ల వారికి సులభంగానే వరల్డ్ కప్ ఆడే జట్లలో చోటు దక్కింది.
కివీస్ టూర్ షెడ్యూల్ ఔట్- రోహిత్, విరాట్ కెరీర్లో ఇదే ఆఖరి పర్యటన!
ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు- వచ్చే ఏడాది మార్చి 15 నుంచే టోర్నీ?

