ETV Bharat / sports

భారత్​లోనే మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ - పాకిస్థాన్​కు నో ఛాన్స్

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య దేశం ఖరారు - అర్హత సాధించిన జట్లు, మ్యాచ్​ల తేదీలు ఇవే

champions trophy 2027
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : September 2, 2026 at 8:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

Champions Trophy 2027 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించనున్న మహిళల మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ 2027కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ముంబయి, వడోదర రెండు వేదికలుగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 దాకా ఈ టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఇందులో ఆరు జట్లు తలపడనున్నాయి.

'మహిళల క్రికెట్‌ కోసం చరిత్రాత్మక ఘట్టం ఎదురుచూస్తోంది. ఈ టోర్నమెంట్ తొలి ఎడిషన్ కావడంతో, ఇది ప్రపంచంలోని అత్యుత్తమ జట్లను అత్యున్నత పోటీ కోసం ఒకచోట చేర్చుతుంది. అదే సమయంలో జట్లు ర్యాంకింగ్‌లలో పైకి ఎదగడానికి, ప్రపంచ వేదికపై స్థానం కోసం పోటీ పడటానికి ఇది మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్రతి సంవత్సరం మహిళల క్రికెట్​లో ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తోంది. మహిళల ఆటను ప్రోత్సహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు మరింత అలరించేందుకు ఇదొక గొప్ప అవకాశం' అని ఐసీసీ పేర్కొంది.

కాగా, 2026 జులై 06 నాటికి టీ20 ర్యాకింగ్స్​లో టాప్ 6లో ఉన్న జట్లు ఇందులో పోటీ పడనున్నాయి. దీంతో ర్యాంకింగ్స్​లో టాప్​లో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. అయితే పాకిస్థాన్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. అందుకే ఆ జట్టు క్వాలిఫై అవ్వలేదు. టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ప్రతి జట్టు మిగతా జట్లతో రౌండ్ రాబిన్ మోడల్​లో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. టాప్‌- 2లో నిలిచిన జట్లు ఫైనల్​కు అర్హత సాధిస్తాయి.

వాస్తవానికి, ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆ దేశ క్రికెట్‌ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో శ్రీలంక ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్న కారణంగా ఆతిథ్య హక్కులను కోల్పోయింది. అయితే ఈ టోర్నీ నిర్వహణకు భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ దేశాలను ఐసీసీ​ను ఆప్షన్లుగా పెట్టుకుంది. ఇవాళ జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్​లో భారత్​ను ఆతిథ్య దేశంగా ఫైనలైజ్ చేసింది. కాగా, ప్రస్తుతం మహిళల క్రికెట్​లో భారత్ వన్డే వరల్డ్​కప్ ఛాంపియన్​గా ఉండగా, ఆస్ట్రేలియా టీ20 విజేతగా కొనసాగుతోంది.