భారత్ x వెస్టిండీస్-టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?- ఆ ఒక్క అడుగు ఎవరిదో
T20 World cup సూపర్ 8లో ఆఖరి పోరు- సెమీస్ బెర్త్ కోసం భారత్- వెస్టిండీస్ మధ్య మ్యాచ్- హోరాహోరీ పక్కా!

Published : February 28, 2026 at 11:00 PM IST
Ind vs WI T20 World cup : టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా ఆదివారం జరగనున్న కీలక మ్యాచ్‌లో భారత్ జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది. సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. పదేళ్ల క్రితం టీ-20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమ్ఇండియా వ్యూహరచన చేస్తోంది.
టీ-20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్, వెస్టిండీస్ పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. ప్రత్యర్థి వెస్టిండీస్ మాత్రం గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీతో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.
ప్రతీకారం తీర్చుకుంటుందా
సరిగ్గా పదేళ్ల క్రితం టీ20 వరల్డ్‌కప్ 2016 సెమీఫైనల్ మ్యాచ్ భారత్, వెస్టిండీస్ మధ్య ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరిగింది. ఈ పోరులో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఛేదించేసింది. తొలుత విరాట్ (89 పరుగులు), రోహిత్ (43), రహానే (40) రాణించడంతో భారత్ మంచి స్కోరే చేసింది. అనంతరం ఛేదనలో లెండిల్ సిమన్స్ (82 పరుగులు), జాన్సన్ ఛార్లెస్ (52), రస్సెల్ (43) మెరుపులతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సిమన్స్కు రెండుసార్లు లైఫ్ వచ్చింది. దీంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది భారత అభిమానులను అప్పట్లో తీవ్రంగా కలచివేసింది. అందుకే ప్రస్తుతం సూపర్ 8 స్టేజీలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమ్ఇండియా వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో టీమ్ఇండియా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
#WATCH | Kolkata: On the India vs West Indies match in the ICC Men's T20 World Cup, Former captain of the Indian cricket team Sourav Ganguly says, " it will be a good match. its is a good ground, good facilities are there. it will be a good game... both are good teams, either can… pic.twitter.com/EMibKgCGuy
— ANI (@ANI) February 28, 2026
బ్యాటింగ్ ఓకే- బౌలింగ్‌తోనే!
భారత జట్టు బ్యాటింగ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చినప్పటికీ బౌలింగ్‌లో మాత్రం ఇంకా లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. జింబాబ్వేపై భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. సంజు శాంసన్ తిరిగి ఓపెనర్‌గా రావడంతో టాప్-6 బ్యాటర్లందరూ రాణించారు. శాంసన్ 24 పరుగులే చేసినప్పటికీ, ఆరంభంలోనే ఇన్నింగ్స్‌కు వేగాన్ని ఇచ్చాడు. దీంతో అభిషేక్ శర్మ ఒత్తిడి లేకుండా ఆడి హాఫ్ సెంచరీ బాదగా, తిలక్ వర్మ కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
దీంతో వరల్డ్ కప్ హిస్టరీలోనే భారత్ అత్యధిక స్కోరు 256 పరుగులు చేసింది. కానీ, బౌలింగ్ విభాగం మాత్రం టీమ్ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా రాణిస్తున్నా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన పాత ఫామ్ కోసం కష్టపడుతున్నాడు. దక్షిణాఫ్రికాపై 47 పరుగులు సమర్పించుకున్న వరుణ్ జింబాబ్వే మ్యాచ్‌లోనూ 35 పరుగులు ఇచ్చాడు.
ఈ క్రమంలో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. శివం దూబే బౌలింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. జింబాబ్వేపై రెండు ఓవర్లలోనే 46 పరుగులు ఇచ్చాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై దూబే బౌలింగ్ విండీస్ పవర్ హిట్టర్లకు వరంగా మారే అవకాశం ఉంది.
ప్రత్యర్థి కూడా బలంగానే!
ఈ టోర్నీలో వెస్టిండీస్ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోంది. సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయే వరకు వారు వరుసగా ఐదు విజయాలు సాధించారు. ఇక సౌతాఫ్రికా మ్యాచ్‌లోనూ విండీస్ బ్యాటర్ల పరాక్రమం స్పష్టంగా కనిపించింది. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా ఆ జట్టు సౌతాఫ్రికాకు లొంగిపోలేదు. అద్భుతంగా పోరాడిన రొమారియో షెపర్డ్, హోల్డర్ జట్టుకు 176 పరుగుల పోరాడగలిగే స్కోరు అందించారు.
ఒక్క బెర్త్- రెండు జట్లు
ఈ క్రమంలో విండీస్‌ను నిలువరించేందుకు భారత్ జట్టు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందో చూడాలి. గ్రూప్ 1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆడిన రెండు మ్యాచుల్లో రెండూ ఓడిన జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో మిగిలిన ఒక్క బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. ఇందులో నెగ్గిన జట్టు సెమీస్‌కు, ఓడిన టీమ్ ఇంటికి వెళ్తాయి.

