ETV Bharat / sports

మహిళల టీ20 వరల్డ్ కప్ రికార్డ్ స్థాయిలో ప్రైజ్​మనీ- విజేతలకు భారీ నగదు బహుమతి

మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం రికార్డ్ స్థాయిలో ప్రైజ్​మనీని ప్రకటించిన ఐసీసీ- మొత్తం ప్రైజ్ పూల్ పెంచిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్- తొలిసారిగా 12జట్లతో జరగనున్న మెగా టోర్నీకి ఇంగ్లాండ్, వేల్స్ ఆతిథ్యం

Women World Cup Prize Money
Women World Cup Prize Money (AFP)
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2026 at 7:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

Women World Cup Prize Money : మహిళల క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన ఫైట్ జరగనుంది. కేవలం 60 రోజుల్లో ఇంగ్లాండ్, వేల్స్ వేదికలుగా ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి టోర్నీలో పాల్గొనే జట్ల కోసం రికార్డ్ స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. మహిళల క్రీడలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో, పురుషుల క్రికెట్‌తో సమానంగా పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ అడుగు వేసింది. ప్రైజ్ మనీ పెంచడమే కాకుండా, టోర్నీని మరింత విస్తృతం చేస్తూ జట్ల సంఖ్యను కూడా పెంచడం విశేషం. ఈ నిర్ణయం మహిళా క్రికెటర్ల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు కొత్త ఊపునివ్వబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే

రికార్డ్ ప్రైజ్ పూల్- 10 శాతం పెరుగుదల
ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం, 2026 మహిళల టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ పూల్ విలువను 8,764,615 డాలర్లకు (సుమారు రూ. 73.4 కోట్లు) పెంచారు. ఇది 2024 ఎడిషన్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ. గతంలో 10 దేశాలు పాల్గొన్న టోర్నీలో 7,958,077 డాలర్ల ప్రైజ్ మనీ ఉండేది. ఇప్పుడు జట్ల సంఖ్య 12కి పెరగడంతో బహుమతి మొత్తాన్ని కూడా ఐసీసీ భారీగా పెంచింది. క్రికెట్ రంగంలో మహిళా అథ్లెట్ల ప్రభావం పెరుగుతోందని, అందుకే పెట్టుబడులను కూడా అదే స్థాయిలో పెంచుతున్నామని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా ఈ సందర్భంగా వెల్లడించారు.

విజేతలకు రూ. 19 కోట్లు- రన్నరప్‌కు రూ. 9 కోట్లు
ఈ మెగా టోర్నీలో ట్రోఫీని ముద్దాడే జట్టుకు భారీ నగదు బహుమతి దక్కనుంది. విజేతగా నిలిచిన టీమ్ 2,340,000 డాలర్ల (సుమారు రూ. 19.5 కోట్లు) ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటుంది. అలాగే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1,170,000 డాలర్లు (సుమారు రూ. 9.7 కోట్లు) అందజేస్తారు. సెమీఫైనల్‌లో ఓడిపోయిన రెండు జట్లకు చెరో 675,000 డాలర్లు (సుమారు రూ. 5.6 కోట్లు) దక్కుతాయి. ప్రతి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ గెలిస్తే అదనంగా 31,154 డాలర్లు (సుమారు రూ. 26 లక్షలు) ఇస్తారు. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం రూ. 2 కోట్ల ప్రైజ్ మనీని ఐసీసీ గ్యారెంటీ ఇచ్చింది. ఐసీసీ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు మహిళా క్రికెట్ ఎదుగుదలకు ఎంతో అవసరం. ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా మరికొంత మంది యువతులకు ఈ క్రీడ వైపు వచ్చేలా ప్రోత్సహించవచ్చు.

12 జట్లతో కొత్త ఫార్మాట్ విస్తరించిన టోర్నీ
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారిగా 12 జట్లు తలపడబోతున్నాయి. గతంలో కేవలం 10 జట్లు మాత్రమే మెగా టోర్నీలో పోటీ పడేవి. జట్ల సంఖ్య పెరగడం వల్ల టోర్నీ మరింత రసవత్తరంగా మారనుంది. ఆతిథ్య దేశం ఇంగ్లాండ్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా అలాగే వెస్టిండీస్ జట్లు ఈ పోరులో నిలవనున్నాయి. మొత్తం 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 7 వేదికల్లో 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇది మహిళల క్రికెట్‌ను మరింత గ్లోబల్ స్పోర్ట్‌గా మార్చడానికి దోహదపడుతుందని ఐసీసీ భావిస్తోంది.

లార్డ్స్ వేదికగా ట్రోఫీ టూర్ ప్రారంభం
వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటనతో పాటే ఐసీసీ ట్రోఫీ టూర్ కూడా వైభవంగా మొదలైంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ టూర్ ప్రారంభమైంది. మొదటిసారిగా లార్డ్స్ పెవిలియన్‌పై ట్రోఫీ ఆకారాన్ని ప్రొజెక్ట్ చేసి సరికొత్తగా ఆవిష్కరించారు. ఈ ట్రోఫీ నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లో పర్యటించి, ఆ తర్వాత మే నెలలో ఇంగ్లాండ్‌లోని వివిధ నగరాల్లో తిరుగుతుంది. మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, బ్రిస్టల్ వంటి ప్రధాన నగరాల్లో అభిమానులకు ఈ ట్రోఫీని చూసే అవకాశం కల్పిస్తారు. ఇది టోర్నీపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

జూన్ 12న తొలి పోరు- ఇంగ్లాండ్ vs శ్రీలంక
ఈ మెగా టోర్నీ జూన్ 12న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్, శ్రీలంకతో తలపడనుంది. గ్రూప్ దశలో భారత్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్ల మధ్య జరిగే పోరు కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టోర్నీ ఆరంభానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో జట్లన్నీ ఇప్పటికే గట్టిగా సిద్ధమవుతున్నాయి. గత 2024 వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ ట్రోపిని గెలుచుకుంది. మరి ఈ సారి ఎవరు గెలుస్తారో చూడాలి.