ETV Bharat / sports

'హైదరాబాద్ విక్టరీ నెం 7'- నల్గొండపై ఈ ఛాంపియన్స్ థ్రిల్లింగ్ విన్

నల్గొండపై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం- రాణించిన వైష్ణవ్ రెడ్డి , అజయ్ గౌడ్, అన్విత్ రెడ్డి

Hyderabad vs Nalgonda
Hyderabad vs Nalgonda (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : July 6, 2026 at 10:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad vs Nalgonda TG 20 : హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అదరగొట్టింది. లీగ్ స్టేజ్​లో ఆడుతున్న ఆఖరి మ్యాచ్​లోనూ విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా నల్గొండ నైట్స్​తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్​లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. నల్గొండ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైష్ణవ్ రెడ్డి (41 పరుగులు, 16 బంతుల్లో), అజయ్ గౌడ్ (35 నాటౌట్), అన్విత్ రెడ్డి (40 పరుగులు), అభిరథ్ రెడ్డి (39 పరుగులు) రాణించారు. దీంతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ గ్రూప్ స్టేజ్​లో ఒక్క మ్యాచ్​లో కూడా ఓడిపోకుండా వరుసగా ఏడో విజయం నమోదు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఉత్కంఠగా సాగిన మ్యాచ్
ఛేదనను హైదరాబాద్ ఘనంగానే ఆరంభించింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి (39 పరుగులు) దూకుడుగా ఆడడంతో మంచి ఆరంభం లభించింది. అయితే అతడిని అనికేత్ రెడ్డి 4.2 ఓవర్ వద్ద ఔట్ చేశాడు. ఆరో ఓవర్ మూడో బంతికి మరో ఓపెనర్ సాయి వికాస్ (13) కూడా ఔటయ్యాడు. గణేశ్ (12), ప్రణవ్ వర్మ (3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో హైదరాబాద్ 11.2 ఓవర్లకు 105-4తో నిలిచింది. ఈదశలో అన్విత్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 40 పరుగులు చేశాడు. దీంతో హైదరాహబాద్ మెరుగైన స్థితిలోకి వచ్చింది.

వైష్ణవ్ అదుర్స్!
అయితే 15.2 వద్ద అన్విత్​ను సతాని ఔట్ చేయడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. 18 బంతుల్లో 39 పరుగులు కావాల్సిన దశలో నల్గొండకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అప్పుడే క్రీజులోకి వచ్చిన వైష్ణవ్ 7 బంతుల్లో చేసింది 7 పరుగులే. కానీ సతాని వేసిన 17వ ఓవర్లో విశ్వరూపం చూపించాడు. నాలుగు సిక్స్​లు బాదేసి ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. దీంతో హైదరాబాద్​పై ఉన్న ఒత్తిడి నల్గొండపైకి వెళ్లింది. దీంతో సమీకరణం 12 బంతుల్లో 13 పరుగులు అయ్యింది. ఇక 19వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఇక 20వ ఓవర్లో తొలి బంతికే సిక్స్​ బాదేసిన వైష్ణవ్ హైదరాబాద్​ను గెలిపించేశాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన నల్గొండ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. వరుణ్ గౌడ్ (53 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు జశ్వంత్ (36 పరుగులు), గౌరవ్ (25 పరుగులు) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో హర్షవర్ధన్ సింగ్ (23 పరుగులు, 11 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో నల్గొండకు ఆ స్కోర్ దక్కింది. హైదరాబాద్ బౌలర్లలో షణ్ముక అశ్విన్ 4, అజయ్ దేవ్, ప్రణవ్ వర్మ చెరో 2, అఖిల్ రాథోడ్ 1 వికెట్ పడగొట్టారు.

మరోవైపు నల్గొండ ఏడు మ్యాచ్​ల్లో నాలుగు విజయాలతో ప్రస్తుతం పట్టికలో మూడో స్థానం (8 పాయింట్లు)తో ఉంది. ప్లేఆఫ్స్​ రేసులో రంగారెడ్డి, కరీంనగర్ కూడా ఉన్నాయి. ఆ జట్లు ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కరీంనగర్ తమ చివరి మ్యాచ్​లో గెలుపొంది, రంగారెడ్డి కూడా భారీ తేడాతో విజయం సాధిస్తే నల్గొండ ఇంటికి వెళ్తుంది. లేదంటే ప్లేఆఫ్స్​కు చేరుకుంటుంది. ఇప్పటికైతే నల్గొండ ఇంకా రేసులోనే ఉంది. రేపటి మ్యాచ్​లతో దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది.