హార్దిక్‌పై వేటు- ముంబయి కెప్టెన్సీ మార్పు పక్కా!- షాకింగ్ రిపోర్ట్ వైరల్
కెప్టెన్‌గానే కాదు ప్లేయర్‌గానూ వరుసగా ఫెయిల్ అవుతున్న హార్దిక్ పాండ్య- అతడిపై మేనేజ్మెంట్ వేటు వేసిందా? వచ్చే మ్యాచ్‌కూ దూరం కానున్న కెప్టెన్!

Published : May 6, 2026 at 5:25 PM IST
Hardik Pandya Mumbai Indians : 'ముంబయి ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను మేనేజ్మెంట్ పక్కన పెట్టేసింది?' అనే ప్రచారం క్రీడావర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ సీజన్‌లో హార్దిక్ కెప్టెన్సీలో ముంబయి ప్రదర్శన అత్యంత పేలవంగా ఉండడమే ఇందుకు కారణం. అతడి కెప్టెన్సీలో 9 మ్యాచ్‌లు ఆడితే అందులో రెండింట్లోనే నెగ్గింది. కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గానూ హార్దిక్ విఫలవుతూ వస్తున్నాడు. ఇలాంటి పరిణామాల వేళ తదుపరి మ్యాచ్ కోసం ముంబయి తాజాగా రాయ్‌పుర్‌కు వెళ్లింది. అయితే ఈ జట్టుతో హర్దిక్ వెళ్లకపోవడంతో అతడిపై 'వేటు' పడిందనే ఊహాగానాల మొదలయ్యాయి.
గత మ్యాచ్‌లోనూ దూరమే!
ఇటీవల ముంబయి వాంఖడే వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడింది. ఇందులో రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ బరిలోకి దిగలేదు. అతడి గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో జట్టును నడిపించాడు. టాస్ సమయంలో హార్దిక్ 'వెన్నునొప్పి' కారణంగా ఆడడం లేదని సూర్య చెప్పాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను ఛేదించి ముంబయి ఘన విజయం సాధించింది. రోహిత్, రికెల్టన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో సూర్యను కెప్టెన్‌గా కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు వినిపించాయి.
ఎయిర్‌పోర్టులో కనిపించని పాండ్య!
ఇలాంటి సమయంలో జరిగిన తాజా సంఘటన కొత్త అనుమానాలకు దారి తీస్తుంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, మే 10న ముంబయి ఇండియన్స్ రాయ్‌పుర్ వేదికగా ఆర్సీబీని ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ కోసం ఇవాళ ముంబయి జట్టు రాయ్‌పుర్‌కు పయణమైంది. అయితే ముంబయి విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద ముంబయి ఆటగాళ్లు కనిపించారు. కానీ, హార్దిక్ ఈ జట్టుతో కనిపించలేదు. అయితే మ్యాచ్‌కు ఇంకా నాలుగు ఉంది. కానీ ఈ మధ్యలో హార్దిక్ జట్టుతో కలుస్తాడనిగానీ, అతడి గాయంపై గానీ ఎలాంటి సమాచారం లేదు. దీంతో 'అతడిని మేనేజ్మెంట్ పక్కన పెట్టేసిందా?' అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Hardik Pandya didn't travel with Mumbai Indians to Raipur for their match against RCB as per Cricbuzz.
— Rajiv (@Rajiv1841) May 6, 2026
Man, I don't think it is just back spasm that is keeping Hardik Pandya out, there is something more to it which we don't know. I think MI is testing Sky's captaincy as they are… pic.twitter.com/c3xLBYgnD2
ఏదో జరుగుతోంది!
హార్దిక్‌కు వెన్నునొప్పి అని చెబుతూ జట్టుకు దూరంగా ఉంచడంపై ఓ నెటిజన్ ఎక్స్‌లో స్పందించారు. 'ముంబయి జట్టు నుంచి హార్దిక్ దూరంగా ఉండటానికి వెన్ను నొప్పి మాత్రమే కారణం కాకపోవచ్చు. దీని వెనుక ఏదో వేరే విషయం ఉంది. ముంబయి దాదాపు ప్లేఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్నట్లే! అందుకే మేనేజ్మెంట్ సూర్యకుమార్ కెప్టెన్సీని పరీక్షించాలని భావిస్తున్నట్లు ఉంది. అంతా బాగుంటే వచ్చే సీజన్‌లో సూర్యనే ముంబయిని నడిపించవచ్చు. హార్దిక్ కేవలం ఆటగాడిగానే ఆడుతాడు' అని పోస్టులో రాసుకొచ్చాడు.
అలాంటిదేమీ ఉండదా?
అయితే ప్రస్తుతం హార్దిక్ వెన్నునొప్పితో బాధపడుతుండడం వల్లే అతడికి విశ్రాంతి ఇచ్చి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఇలాంటి గాయంతోనే హార్దిక్ గతంలోనూ చాలా రోజులు ఆటకు దూరమయ్యాడు. అందుకే ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడే తప్ప, 'వేటు' పడే అవకాశాలు లేవని అంటున్నారు. ఫిట్నెస్ సాధించి వస్తే, జట్టును నడిపించేది హార్దికే అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో ఏం జరగనుందో ముందు ముందు చూడాలి!
ఆటగాడిగానూ ఫెయిల్
ప్రస్తుత IPL సీజన్‌లో హార్దిక్ వ్యక్తిగత ఫామ్ కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఈ సీజన్‌లో 8 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన హార్దిక్, 20.85 సగటున 136.44 స్ట్రైక్ రేట్‌తో 146 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్కసారి కూడా 50+ స్కోర్ చేయలేదు. 40 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. బౌలింగ్ విషయానికి వస్తే, 8 ఇన్నింగ్స్‌లలో 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ప్లేఆఫ్స్ అవకాశాలు కష్టమే!
ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడగా, అందులో కేవలం 3 మ్యాచ్‌ల్లే విజయం సాధించి, మిగిలిన 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం 6 పాయింట్లుతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గితే 14 పాయింట్లు అవుతాయి. అయినప్పటికీ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేం. మిగిలిన జట్ల ఫలితాలు అనకూలంగా వస్తే కానీ ఛాన్స్ లేదు!
టీమ్‌లో హార్దిక్ పాండ్యకు సపోర్ట్ లేదా?- కెప్టెన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడా?- మాజీల అభిప్రాయమిదే!
'తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు!'- వరుస ఓటములపై హార్దిక్ పాండ్య నిరాశ

