ETV Bharat / sports

కమ్‌బ్యాక్‌కు దగ్గరగా వచ్చి మళ్లీ ఆగిన హార్దిక్- ఈసారి ఏం జరిగిందంటే?

టీ20లతో కమ్‌బ్యాక్‌కు ప్లాన్ చేసిన హార్దిక్- సెలక్షన్‌కు ముందు మరో చిన్న ఇబ్బంది- వన్డే సిరీస్‌కు ముందు కూడా ఇలానే!

Hardik Pandya Injury Update
హార్దిక్ పాండ్య (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : September 1, 2026 at 2:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hardik Pandya Injury Update : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ భారత జట్టులోకి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో మరోసారి బ్రేక్ పడింది. 32 ఏళ్ల హార్దిక్ కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇక బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉంటూ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. సెప్టెంబర్ 13 నుంచి దిల్లీలో అఫ్గానిస్థాన్‌తో మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌ను కమ్‌బ్యాక్ కోసం టార్గెట్ చేశారు. ట్రైనింగ్ కూడా ప్లాన్ ప్రకారమే సాగుతుండటంతో ఈసారి జట్టులోకి రావడానికి మంచి అవకాశం ఉందని భావించారు. కానీ సెలక్షన్‌కు కొద్ది రోజుల ముందు మరో ఇబ్బంది ఎదురైంది. ఈ వారంలోనే జట్టును ఎంపిక చేయనున్న సెలెక్టర్లకు హార్దిక్ ఫిట్‌నెస్‌పై పూర్తి సమాచారం అందనుంది. ఈ సిరీస్‌లో ఆడాలని హార్దిక్ కూడా టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇప్పటికీ రాలేదు.

ఈసారి ఏం జరిగిందంటే
హార్దిక్‌కు కాలి భాగంలో చిన్న ఇబ్బంది వచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు వరకు రిహాబ్, ట్రైనింగ్ అనుకున్న విధంగానే సాగుతున్నాయట. కానీ చివరి సమయంలో వచ్చిన ఈ సమస్య కారణంగా ఆఫ్ఘనిస్థాన్ టీ20లకు అతడ్ని ఎంపిక చేయడం కష్టమయ్యే అవకాశం ఉంది. హార్దిక్ జట్టులో ఉంటే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అందుకే జస్ట్ బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉంటే సరిపోదు. మ్యాచ్‌లో బౌలింగ్ చేసేంత ఫిట్‌గా ఉన్నారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. బెంగళూరులో రికవరీలో ఉన్న ఆటగాళ్ల ఫిట్‌నెస్ వివరాలను బీసీసీఐ వైద్య బృందం సెలెక్టర్లకు అందించనుంది. ఆ తర్వాతే హార్దిక్‌ను ఈ సిరీస్‌కు తీసుకుంటారా లేదా అన్నది తేలనుంది.

అప్పుడు కూడా ఇలానే
హార్దిక్‌కు ఇలా కమ్‌బ్యాక్‌కు దగ్గరగా వచ్చాక గాయం రావడం ఇది మొదటిసారి కాదు. ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు కూడా జట్టులోకి రావడానికి సిద్ధమయ్యాడు. అప్పటికి ఫిట్‌నెస్ బాగుండటంతో పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే సిరీస్‌కు ముందు స్వల్ప గాయం కావడంతో ఆ ప్లాన్ ఆగిపోయింది. అప్పటివరకు పూర్తి ఫిట్‌నెస్‌కు చేరుకున్నారని భావించినా చివరి సమయంలో వచ్చిన ఆ గాయం వల్ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండలేకపోయాడు. ఇప్పుడు టీ20 కమ్‌బ్యాక్‌కు ముందు కూడా మరో చిన్న ఇబ్బంది రావడంతో రెండోసారి అదే తరహా పరిస్థితి ఎదురైంది.

ఆరు నెలలుగా టీమిండియాకు దూరం
హార్దిక్ చివరిసారి భారత్ తరఫున మార్చి 8న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో కనిపించలేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మే 24న ఆడిన మ్యాచ్ ఆయన చివరి కాంపిటేటివ్ గేమ్. అనంతరం స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వైట్‌బాల్ మ్యాచ్‌లకు దూరమయ్యారు. తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో కూడా జట్టులో లేరు. దీంతో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దాదాపు ఆరు నెలల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ కూడా మిస్ అయితే ఈ విరామం మరింత పెరుగుతుంది. భారత జట్టులో హార్దిక్ పాత్ర చాలా కీలకం. బ్యాటర్‌గా మాత్రమే కాకుండా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించగలడు. అసలే ఈమధ్య కాలంలో వైట్ బాల్ క్రికెట్​లో వరుస పరాజయాలు వస్తున్నాయి. అందుకే పాండ్య అవసరం జట్టుకు చాలా ఉంది.

మిగతా ఆటగాళ్ల పరిస్థితి ఏంటంటే
అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ముందు మిగతా ఆటగాళ్ల ఫిట్‌నెస్ అప్‌డేట్ కోసం కూడా ఎదురు చూడాల్సి వస్తోంది. నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ రికవరీ అవుతున్నట్లు సమాచారం. జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఈ మూడు టీ20లకు అందుబాటులో ఉంటారా అనేది ఇంకా తేలలేదు. అయితే ఆసియా గేమ్స్‌కు సిద్ధమయ్యేలా అతడి రికవరీ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆటగాళ్లు అందరూ జట్టుకు చాలా కీలకం. అందుకే ఈసారి పూర్తి ఫిట్‌నెస్ వచ్చిన తర్వాతే వారి కమ్‌బ్యాక్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

క్రికెటర్ల వసతి సౌకర్యాలపై BCCI అభ్యంతరం- మౌనం వీడిన ఆసియా క్రీడల నిర్వాహకులు - ఏమన్నారంటే?

మహిళల​ ఆసియా కప్​: థాయిలాండ్​పై 94 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం