ఒకేసారి గేల్, విరాట్ రికార్డ్ బ్రేక్- బాబర్ అజామ్ సూపర్ ఫీట్!
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో రాణిస్తున్న బాబర్ అజామ్- తాజాగా కరాచీపై సూపర్ ఇన్నింగ్స్- ఈ క్రమంలోనే గేల్, విరాట్ రికార్డ్ బద్దలు

Published : April 10, 2026 at 5:00 PM IST
Babar Azam New Record : పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో నిలకడగా రాణిస్తున్న పెషవార్ జల్మీ కెప్టెన్ బాబర్ అజామ్ టీ20 క్రికెట్లో మరో కీలక మైలురాయి అందుకున్నాడు. ఈ లీగ్‌లో తాజాగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ (87 పరుగులు) సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసి అరుదైన ఘనత సాధించాడు. ఇంతకీ అదేంటంటే?
టీ20 క్రికెట్లో బాబర్ తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా ఈ ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నాడు. అయితే 338 ఇన్నింగ్స్‌ల్లోనే బాబర్ ఈ మార్క్ అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 12వేల టీ20 రన్స్ పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్ కొట్టాడు. ఇదివరకు ఈ ఘనత క్రిస్ గేల్ పేరిట ఉండేది. అతడు 343 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు. తాజాగా బాబర్ అది బ్రేక్ చేశాడు. ఇక ఈ లిస్ట్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ 360 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు.
టీ20 క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 12వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్లు
| ప్లేయర్ | ఇన్నింగ్స్ |
| బాబర్ అజామ్ | 338 |
| క్రిస్ గేల్ | 343 |
| విరాట్ కోహ్లీ | 360 |
| డేవిడ్ వార్నర్ | 368 |
| జోస్ బట్లర్ | 405 |
రెండో బ్యాటర్‌గా ఘనత
కాగా, టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన పాకిస్థాన్ రెండో బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు. అతడి కంటే ముందు మాజీ బ్యాటర్ షోయబ్ మాలిక్ ఈ ఘనత అందుకున్నాడు. షోయబ్ 557 మ్యాచ్‌ల్లో 13,571 చేశాడు.
🚨 BABAR AZAM BREAKS CHRIS GAYLE RECORDS 🚨
— Cricket Central (@CricketCentrl) April 9, 2026
Fewest innings to reach 12,000 T20 runs:
Babar Azam - 338
Chris Gayle - 343
Virat Kohli - 360 pic.twitter.com/RL554cse6P
వన్డేల్లోనూ రికార్డే
2015లో వన్డేల్లో అరంగేట్రం చేసిన బాబర్ ఆ ఫార్మాట్లోనూ పలు ఘనతలు సాధించాడు. గతంలో 97 ఇన్నింగ్స్‌ల్లోనే 5,000 వన్డే పరుగులు పూర్తి రికార్డ్ కొట్టాడు. ఈ ఫార్మాట్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గానూ బాబర్ రికార్డు క్రియేట్ చేశాడు. 2021లో వన్డే ర్యాకింగ్స్లో టాప్ ప్లేస్ కూడా దక్కించుకున్నాడు. ఇక ఇప్పటిదాకా బాబర్ వన్డేల్లో 140 మ్యాచ్‌ల్లో 6501 పరుగులు చేశాడు. ఇందులో 20 సెంచరీలు ఉన్నాయి.
పెషవార్ గ్రాండ్ విక్టరీ
ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన పెషవార్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. బాబర్ (87) హాఫ్ సెంచరీతో రాణించగా, కుశాల్ మెండీస్ (109 పరుగులు, 52 బంతుల్లో) సెంచరీతో అదరగొట్టాడు. చివర్లో అబ్దుల్ సమద్ (40 పరుగులు, 12 బంతుల్లో: 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పెషవార్కు భారీ స్కోర్ దక్కింది.
అనంతరం ఛేదనలో కరాచీ చేతులెత్తేసింది. 16.1 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. అజామ్ ఖాన్ (25 పరుగులు) టాప్ స్కోరర్. పెషవార్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన కరాచీ ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఇఫ్తికార్ అహ్మద్, నహిద్ రానా, సుఫియాన్ ముకీమ్ తలో 3, షరీఫుల్ ఇస్లామ్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆల్‌రౌండ్ షో ప్రదర్శన చేసిన పెషవార్ 159 పరుగుల భారీ తేడాతో నెగ్గింది.
లైవ్ ప్రెస్‌మీట్‌లో 'విరాట్ కోహ్లీ'తో పోలిక- రిపోర్టర్‌కు బాబర్ అజామ్ స్ట్రాంగ్ కౌంటర్!
బాబర్, రిజ్వాన్‌కు పాకిస్థాన్‌కు షాక్- ఆసియా కప్‌లో నో ప్లేస్

