ETV Bharat / sports

'ఆంధ్ర నుంచి అంతర్జాతీయ స్టేజ్​ దాకా'- శ్రీ చరణి జర్నీ ఇదే

'పోలీసు, ఇంజినీర్ అవ్వాలని క్రికెటర్ అయ్యా- అబ్బాయిలతో గల్లీ క్రికెట్ ఆడేదాన్ని'- వరల్డ్​కప్ విజేత శ్రీ చరణితో 'ఈనాడు' స్పెషల్ ఇంటర్వ్యూ

Shree Charani
Shree Charani (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : November 13, 2025 at 2:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Shree Charani Cricket Journey : మహిళల ప్రపంచకప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించింది 21ఏళ్ల తెలుగమ్మాయి శ్రీ చరణి. అప్పటికి అంతర్జాతీయ క్రికెట్​లో ఎంట్రీ కొన్ని నెలలే అయ్యింది. అయినా ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్​కప్ జట్టులో చోటు దక్కించుకుంది. ఇలా వచ్చిన అవకాశాన్ని చరణి రెండు చేతులా అందిపుచ్చుకుంది. వరల్డ్​కప్​లో తన బౌలింగ్​తో అద్భుతాలు చేసిన ఆమె మొత్తంగా 14 వికెట్లు నేలకూల్చి సత్తా చాటింది. దీంతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో చరణి టాప్ 4లో నిలిచింది. ఈ క్రమంలో ఆమె 'ఈనాడు'తో పలు విషయాలు షేర్ చేసుకుంది.

ఆంధ్ర నుంచి అంతర్జాతీయ స్టేజ్ వరకు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం ఎర్రమల్లపల్లెలో శ్రీ చరణి జన్మించింది. ఇదే ఏడాది ఏప్రిల్​లో శ్రీలంకతో జరిగిన వన్డేతో ఆమె అంతర్జాతీయ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే జరిగిన టోర్నీలో ఎంపికైంది. కెరీర్, జర్నీ గురించి ఆమె మాటల్లోనే..

మాది కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఎర్రమల్లపల్లె ఊరు. పల్లె నుంచి వచ్చినా క్రికెట్‌ అంటే ఇష్టం పెంచుకున్నా. నేను తొలిరోజుల్లో అథ్లెట్‌ని. చిన్నప్పుడు ఖోఖో, బ్యాడ్మింటన్‌ ఆటలు కూడా ఆడేదాన్ని. అయితే అప్పట్లో నేను పోలీస్ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవ్వాలి అనుకునేదాన్ని. కానీ క్రికెట్‌వైపు వచ్చాక అదే నా లోకం అయ్యింది. గల్లీల్లో అబ్బాయిలతో కలిసి క్రికెట్‌ ఆడేదాన్ని. డీఏవీ మైదానంలో మామయ్య కిషోర్‌ కుమార్‌రెడ్డితో కలిసి ప్రాక్టీస్ చేసేదాన్ని. అయితే టీమ్ఇండియాకు ఎంపికవుతానని మాత్రం ఊహించలేదు. అవకాశం వచ్చాక మాత్రం నిరూపించుకోవాలని బలంగా అనుకున్నాను.

అలా టీమ్ఇండియాలోకి!
ఇంట్లో ఒప్పించి శిక్షణలో చేరిన ఏడాదిలోపే రాష్ట్ర స్థాయి మ్యాచ్‌ల్లో ఆడాను. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్‌ కావడం, తక్కువ పరుగులు ఇస్తానన్న పేరు తెచ్చుకున్నా. అది నాకు కలిసొచ్చింది. అలా ఉమెన్స్‌ ఛాలెంజర్స్‌ ట్రోఫీకి క్వాలిఫై అయ్యాను. ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటాను. ఆ సమయంలోనే డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంచైజీలు గుజరాత్, ముంబయి, ఆర్‌సీబీ, దిల్లీ నా ఆటను పరిశీంచాయి. కానీ నాకు ఆ విషయం నాకు తెలియదు. ముంబయి జట్టు సంప్రదించినప్పుడు అర్థమైంది. చివరికి వేలంలో రూ.55 లక్షలకు దిల్లీ దక్కించుకుంది.

అదే టర్నింగ్ పాయింట్. అప్పుడే గుర్తింపు మొదలైంది. డబ్ల్యూపీఎల్‌ తర్వాత దేహ్రాదూన్‌లో జూనియర్‌ ఇండియా జట్లతో ఆడాను. అక్కడ కూడా బౌలింగ్‌లో రాణించడం వల్ల భారత్​ జట్టులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీలంకతో వన్డేతో అరంగేట్రం చేశాను. ఆపై ఇంగ్లాండ్‌తో వన్డేలతోపాటు టీ- 20ల్లోనూ ఎంపికయ్యాను. అందులో రాణించడంతో వరల్డ్​కప్ జట్టులోనూ చోటు దక్కింది. ఆ టోర్నీలో అన్ని మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్ దక్కడం, టీమ్‌తో కలిసి టైటిల్ అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నా.

వాళ్ల సపోర్ట్ మర్చిపోలేనిది
జాతీయ జట్టుకు ఎంపికవ్వడం ఆనందమే. కానీ, జట్టు సభ్యులు ఎలా ఉంటారోనని కొంచెం భయపడ్డాను. కానీ వాళ్లంతా మైదానంలోనే సీరియస్‌గా ఉంటారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో అందరూ సరదాగా ఉంటారు. దీంతో కొన్ని రోజుల్లోనే భయం పోయింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, జెమీమా, దీప్తి లాంటి సీనియర్లు చాలా ప్రోత్సహించారు. అది మర్చిపోలేను. తెలుగు అమ్మాయినైనా ఆంధ్ర జట్టు తరఫున వివిధ రాష్ట్రాలతో మ్యాచ్​లు ఆడడం వల్ల ఇంగ్లీష్, హిందీపైనా పట్టు సాధించాను. భాషపరంగా ఇబ్బంది లేకపోవడమూ నాకు కలిసొచ్చింది.

చదువు వదిలేయలేదు
ఆటల్లో రాణిస్తూనే చదువూ కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. కాకపోతే అందరిలా రోజూ కాలేజీకి వెళ్లడం కష్టమే. కానీ నా పదోతరగతి స్నేహితులే నాకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఇప్పటికీ వాళ్లతోనే ఫ్రెండ్​షిప్ కొనసాగిస్తున్నాను. ఖాళీ దొరికితే కుటుంబంతో గడపడానికే ఇష్టపడతాను. నాకు నాన్‌వెజ్‌ ఎక్కువ ఇష్టం. అమ్మ చేతి వంట అంటే మరీ మరీ ఇష్టం.

సలహా
అమ్మాయిల క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. తమపై తమకు నమ్మకం ఉన్న ఎవరైనా ఈ క్రీడలోకి రావొచ్చు. అయితే పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ముఖ్యం. ఫిట్‌నెస్‌పై చాలా దృష్టిపెట్టాలి. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాల్సిందే. కొంచెం స్వేచ్ఛ, అమ్మానాన్నల అండ దొరికితే ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.

నెక్ట్స్ మ్యాచ్
ప్రతి క్రికెటర్‌ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. వరల్డ్ కప్‌ గెలుచుకోవడం అంటే కల నెరవేరినట్లే. అలాగని ఆటను నిర్లక్ష్యం చేయను. ఆటపై మరింత ఎక్కువ దృష్టి పెడతాను. త్వరలోనే రాయ్‌చూర్‌లో వన్డే మ్యాచ్​ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం దానికి ప్రిపేర్ అవుతున్నాను!

స్మృతి మంధాన, శ్రీ చరణి అదుర్స్- తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ

రూ.2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం - శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానా