ETV Bharat / sports

2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ ఎంపిక- అహ్మదాబాద్‌ వేదికగా పోటీలు!

నవంబర్‌ 26 సమావేశంలో తుదినిర్ణయం ప్రకటించనున్నకామన్‌వెల్త్‌ బోర్డు

Commonwealth Games India
Commonwealth Games India (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : October 15, 2025 at 7:45 PM IST

2 Min Read
Choose ETV Bharat

Commonwealth Games India : 2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ ఎంపికైంది. అహ్మదాబాద్‌ వేదికగా 2030లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరగనున్నాయి. అహ్మదాబాద్‌ను వేదికగా కామన్‌వెల్త్‌ బోర్డు ప్రతిపాదించింది. నవంబర్‌ 26వ తేదీన సమావేశంలో తుదినిర్ణయం ప్రకటించనుంది. 2030 కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణకు నైజీరియాలోని అబుజా సైతం పోటీ పడుతోంది. ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మాత్రం అహ్మదాబాద్‌ను సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్ రెండోసారి ఆతిథ్యమివ్వనుంది. గతంలో 2010లో దిల్లీ వేదికగా ఈ క్రీడాపోటీలు జరిగాయి.

అమిత్ షా ఏమన్నారంటే?
కామన్వెల్త్‌ క్రీడలు భారత్‌లో జరగనుండడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు కామన్వెల్త్‌ అసోసియేషన్‌ ఆమోదం తెలపడం గర్వించదగిన విషయమన్నారు. ప్రపంచ క్రీడా పటంలో భారత్‌ను ఉంచడానికి ప్రధాని మోదీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఇది నిదర్శనమన్నారు.

మోదీ జీ దార్శనిక నాయకత్వం ద్వారా ఇది సాధ్యమైంది!
"భారత క్రీడలకు ఇది ఒక గొప్ప క్షణం! ఈ నిర్ణయం ప్రపంచ క్రీడలో భారత్ పెరుగుతున్న ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రధానమంత్రి మోదీ జీ దార్శనిక నాయకత్వం ద్వారా ఇది సాధ్యమైంది, ఆయన నిబద్ధత భారతదేశాన్ని ప్రపంచ క్రీడా పటంలో దృఢంగా నిలిపింది" అని క్రీడా మంత్రి మన్​సుఖ్ మాండవీయ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ (ఇండియా) అధిపతి, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి.టి. ఉష మాట్లాడుతూ, శతాబ్ది కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడం భారతదేశానికి అసాధారణ గౌరవం అని అన్నారు. "ఈ క్రీడలు భారతదేశ ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్ సామర్థ్యాలను ప్రదర్శించడమే కాకుండా, 2047 వికసిత్ భారత్ వైపు మన జాతీయ ప్రయాణంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తాయి" అని తెలిపారు. "2030 క్రీడలను మన యువతకు స్ఫూర్తినిచ్చేందుకు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి, కామన్వెల్త్ అంతటా ఉమ్మడి భవిష్యత్తుకు దోహదపడటానికి ఒక శక్తివంతమైన అవకాశంగా మేం భావిస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు.

2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేందుకు భారత్ బృందం లండన్‌లోని కామన్వెల్త్ క్రీడల మూల్యాంకన కమిటీకి సెప్టెంబర్ 23న అధికారికంగా తన ప్రతిపాదనను సమర్పించింది. ఆ బృందంలో గుజరాత్ క్రీడా మంత్రి హర్ష్ సంఘవి, భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు డాక్టర్ పీటీ ఉష, భారత ప్రభుత్వం క్రీడా శాఖ కార్యదర్శి హరి రంజన్ రావు, గుజరాత్ ప్రభుత్వ క్రీడలు, యువజన సాంస్కృతిక కార్యకలాపాల విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి అశ్విని కుమార్, అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బంచా నిధి పాణి, కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా CEO రఘురామ్ అయ్యర్, CGA ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, CGA అధ్యక్షుడు అజయ్ నారంగ్ ఉన్నారు.

2030 ఎడిషన్ చరిత్రాత్మక ప్రాముఖ్యం కలిగి ఉంది. అప్పటికి కామన్వెల్త్ క్రీడలు మొదలైం 100 సంవత్సరాలు అవుతుంది. దీంతో భారత్​లోని అహ్మదాబాద్‌ శతాబ్ది ఎడిషన్‌కు ఆతిథ్య నగరంగా పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాల వేదికలు, బలమైన రవాణా వ్యవస్థలు, అధిక-నాణ్యత వసతిపై కేంద్రీకృతమై కాంపాక్ట్ గేమ్స్ ముద్రను అందిస్తుంది.

అహ్మదాబాద్‌లో '2030 కామన్వెల్త్ క్రీడలు'- బిడ్ దాఖలుకు పచ్చజెండా

2030 కామన్వెల్త్‌ క్రీడలకు సిద్ధమవుతున్న భారత్​- బిడ్​ను ఆమోదించిన IOC