సంజూ 'సూపర్ సెంచరీ'- ఎట్టకేలకు చెన్నై బోణీ
థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - పోరాడి ఓడిన దిల్లీ క్యాపిటల్స్

Published : April 11, 2026 at 11:34 PM IST
CSK vs DC IPL 2026 : 2026 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటముల తర్వాత నాలుగో మ్యాచ్‌లో గెలుపు రుచి చూసింది. శనివారం సొంతగడ్డపై దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు తేడాతో విజయం సాధించింది. సంజు శాంసన్ సెంచరీతో రాణించడంతో తొలుత సీఎస్కే 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ సరిగ్గా 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్ (60 పరుగులు) పోరాటం వృథా అయ్యింది. చెన్నై బౌలర్లలో జెమీ ఓవర్టన్ 4, అన్షల్ కంబోజ్ 3, ఖలీల్ అహ్మద్, గుర్జపనీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో 1 వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇన్ని రోజులు విమర్శలు ఎదుర్కొన్న ఓపెనర్ సంజు శాంసన్ దిల్లీపై సెంచరీతో చెలరేగాడు. 56 బంతుల్లో ఏకంగా 115 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. 6.2 ఓవర్ వద్ద కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15) ఔటయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన యువ సంచలనం ఆయుశ్ మాత్రే 59 పరుగులు రఫ్పాడించాడు.
Off the mark! 💛#WhistlePodu #CSKvDC pic.twitter.com/sBrO9qgu5e
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2026
ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 113 పరుగులు జోడించారు. 17.3 ఓవర్ వద్ద మాత్రే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. చివర్లో శివమ్ దూబె 20 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో సీఎస్కే భారీ సాధించింది. దిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. సెంచరీతో రాణించిన సంజు శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
శాంసన్ సూపర్ రికార్డ్
లేట్‌గా క్లిక్ అయినా శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుత సీజన్లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్‌గా రికార్డ్ కొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటిదాకా 18 మ్యాచ్‌లు ముగియగా ఇవాళే తొలి శతకం నమోదైంది. ఇటీవల దిల్లీ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (92 పరుగులు, గుజరాత్‌పై) , సమీర్ రిజ్వీ (90 పరుగులు, ముంబయిపై) సెంచరీకి దగ్గరగా వచ్చిన 100 మార్క్ అందుకోలేదు.
This music hits different! 🎶
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2026
So does a win at Anbuden 🌟#WhistlePodu #CSKvDC pic.twitter.com/OhmMeOoPhz
ఈ మ్యాచ్ గురించి మరిన్ని విషయాలు
- చెన్నై చెపాక్ స్టేడియంలో వరుసగా ఆరు ఓటముల తర్వాత సీఎస్కేకు ఇదే తొలి విజయం
- చెపాక్ మైదానంలో దిల్లీ క్యాపిటల్స్‌తో ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచ్‌ల్లో చెన్నై ఎనిమిదింట నెగ్గింది.
- ఐపీఎల్లో ఆలౌట్ అవ్వడం దిల్లీకి ఇది 31వ సారి. లీగ్ చరిత్రలో ఇన్నిసార్లు ఏ జట్టు కూడా ఆలౌట్ అవ్వలేదు
- తొలి విజయానికి చెన్నై ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు తీసుకుంది. బోణీ కొట్టేందుకు సీఎస్కే అత్యధిక మ్యాచ్‌లు తీసుకున్న రెండో సీజన్ ఇది. 2022లో తొలి విజయం ఐదో మ్యాచ్‌లో దక్కింది
- ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చెయ్యడం చెన్నైకు ఇది 26వసారి. ప్రత్యర్థులను ఎక్కువసార్లు ఆలౌట్ చేసిన లిస్ట్‌లో సీఎస్కే మూడో స్థానంలో కొనసాగుతోంది
ఐపీఎల్లో ప్రత్యర్థును జట్లను అత్యధికసార్లు ఆలౌట్ చేసిన జట్లు
- 40 - ముంబయి ఇండియన్స్
- 28 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- 26 - చెన్నై సూపర్ కింగ్స్*
- 25 - కోల్‌కతా నైట్‌రైడర్స్
- 22 - సన్‌రైజర్స్ హైదరాబాద్

