ETV Bharat / sports

'క్రికెట్​లో ఎప్పట్నుంచో మద్యం తాగే కల్చర్ ఉంది- అది ఇంగ్లాండ్​కు వ్యసనం కాదు!'- బెన్ స్టోక్స్

స్టువర్ట్ బ్రాడ్​ పాడ్​కాస్ట్​లో పాల్గొన్న మాజీ క్రికెటర్ బెన్ స్టోక్స్- తన రిటైర్మెంట్​పై తొలిసారి మాట్లాడిన స్టోక్స్- ఆ రూమర్లకు చెక్

Ben Stokes
Ben Stokes (Source : IANS (File))
author img

By ETV Bharat Sports Team

Published : August 4, 2026 at 7:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ben Stokes On His Retirement : ఇంగ్లాండ్ మాజీ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ గురించి తొలిసారి స్పందించాడు. ఇంగ్లాండ్ జట్టు భవిష్యత్తుపై ఆందోళన కారణంగానే తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆకస్మికంగా తప్పుకున్నట్లు వెల్లడించాడు. అయితే సమీప భవిష్యత్తులోగానీ, ముఖ్యంగా 2027 యాషెస్ సిరీస్‌కు ముందు తాను రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చి మళ్లీ ఇంగ్లాండ్​కు ఆడే అవకాశం లేదని స్పష్టం చేశాడు. అయితే భవిష్యత్తులో ఎప్పటికైనా ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలన్న కోరిక ఉందని చెప్పాడు. అలాగే క్రికెట్​లో ఎప్పట్నుంచో తాగే కల్చర్ ఉందని అన్నాడు.

ఆ కోరిక ఉంది
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్, జాస్ బట్లర్ హోస్ట్ చేస్తున్న ఓ పాడ్‌కాస్ట్‌లో స్టోక్స్ రీసెంట్​గా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు కోచ్​గా వ్యవహరించాలని ఉందని చెప్పాడు. "కోచ్‌గా క్రికెట్‌లోనే కొనసాగడం సాధ్యమేనని నాకు తెలుసు. నేను ప్రస్తుతం ఆటతో పాటు లెవెల్ 3 కోచింగ్ అర్హత కోసం కృషి చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా 'భవిష్యత్తులో ఎప్పుడైనా ఇంగ్లాండ్‌కు కోచ్‌గా వ్యవహరించాలనుకుంటున్నారా?' అని అడిగితే, నేను 'కచ్చితంగా' అని చెబుతాను. నేను ఆడకపోయినా, ఏదో ఒక హోదాలో జట్టుకు నాయకత్వం వహించడానికి నా మనసులో కోరిక ఉంది" అని అన్నాడు.

కాగా, స్టోక్స్ రిటైర్మెంట్​పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ఇటీవల మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. ఒకవేళ స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జాతీయ జట్టులోకి తిరిగి రావాలనుకుంటే, అతనికి ఆ అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. కానీ, స్టోక్స్ ఆ అవకాశాన్ని కొట్టిపారేశాడు. "నేను జాతీయ జట్టులోకి తిరిగి వెళ్లాలని లేదు. నాకు ఇప్పుడు 35 ఏళ్లు. నన్ను కెప్టెన్సీకి పరిగణించకపోతే నాకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నా కెరీర్‌లో చాలా భాగాన్ని జట్టుకు నాయకత్వం వహించడానికే అంకితం చేశాను. కాబట్టి, నేను ఇంగ్లాండ్ తరఫున ఆడితే, కేవలం కెప్టెన్‌గానే ఆడాలని అనుకుంటాను" అని అన్నాడు. అయితే, తాను రిటైర్మెంట్‌తో సంతోషంగానే ఉన్నానని, ఇంగ్లాండ్ తరఫున మైదానంలోకి తిరిగి వచ్చే ఉద్దేశం లేదని స్టోక్స్ క్లారిటీ ఇచ్చాడు. ఇక హ్యారీ బ్రూక్‌కు బదులుగా జో రూట్‌ను తిరిగి టెస్టు కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయంపై అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ, జో రూట్, కొత్త కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మధ్య సమన్వయం అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

క్రికెట్ అంటేనే తాగుడు కల్చర్
అలాగే ఇంగ్లాండ్ టీమ్​కు మద్యం సేవించడం అనేది వ్యసనంగా మారిందా అని బ్రాడ్ అడగ్గా స్టోక్స్ దాన్ని తోసిపుచ్చాడు. క్రికెట్ గేమ్​లోనే ఆల్కహాల్ డ్రింక్ కల్చర్ ఉందని, ఇంగ్లాండ్ ప్లేయర్లే కాకుండా ఇతర జట్ల ఆటగాళ్లు కూడా మద్యం తాగుతారని అన్నాడు. కాలంతోపాటు ఆట ప్రొఫెషనల్​గా మారినప్పటికీ, తాగే కల్చర్ మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చిందని చెప్పాడు. అంతేకానీ ఇంగ్లాండ్ జట్టుకు మాత్రమే మద్యం సమస్య ఉందంటే ఏ మాత్రం ఒప్పుకోనని అన్నాడు.

ముందు సస్పెన్షన్ - తర్వాత రిటైర్మెంట్
ఇటీవల న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం పాలైంది. దీంతో స్టోక్స్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి కెరీర్‌కు తెరపడింది. అయితే ఆ సిరీస్ సమయంలో స్టోక్స్ టీమ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘించి, అర్థరాత్రి సమయంలో లండన్‌లో ఒక పబ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో నడిరోడ్డుపై ఓ రగ్బీ ప్లేయర్​​తో గొడవ పడ్డాడు. ఈ కారణంగా స్టోక్స్​ రెండో టెస్టుకు సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆ తర్వాత మూడో టెస్టు ఆడి, రిటైర్మెంట్‌ ప్రకటించారు. అయినప్పటికీ, ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కూడా క్రికెట్​లో మరో రోల్​లో కొనసాగాలని భావిస్తున్నట్లు తాజాగా తెలిపాడు.

'అతనే సెలెక్టర్ అయితే తప్ప, వరల్డ్​కప్​కు ఈ జట్టు ఉండదు!'- రవిశాస్త్రి టీమ్​పై మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

'అశ్విన్ భాయ్ క్షమించు- పర్సనల్‌గా మెసేజ్ చేస్తా'- అర్షదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్