బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం- IPL టెలికాస్ట్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం- ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో లీగ్ మ్యాచ్‌లు అక్కడ ప్రసారంపై నిషేధం విధింపు- ఉత్తర్వులు జారీ!

Published : January 5, 2026 at 1:41 PM IST
IPL In Bagladesh : బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌లను తమ దేశంలో ప్రసారం చేయబోమని నిరవధికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2026 ఐపీఎల్‌కు సంబంధించిన ప్రమోషన్స్, మ్యాచ్‌లు బంగ్లాలో ప్రసారం కావు!
అయితే కొద్ది రోజులుగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన వివాదం ముదురుతోంది. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తమ జట్టును భారత్‌కు పంపబోమని బంగ్లాదేశ్ చెప్పిన మరుసటి రోజే ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌లను శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని కోరుతూ ఐసీసీకి బీసీబీ లేఖ రాసింది. దీనిపై ఐసీసీ స్పందించాల్సి ఉంది. అటు బీసీసీఐ మాత్రం బంగ్లాదేశ్ నిర్ణయంపై అధికారికంగా ఇప్పటిదాకా స్పందించలేదు.
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది?
'2026 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐ ఆదేశించినట్లు మా దృష్టికి వచ్చింది. భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయానికి సరైన లేదా సమర్థనీయమైన కారణాన్ని ఇప్పటివరకూ మాకు వివరించలేదు. ఈ నిర్ణయం బంగ్లా ప్రజలలో కోపాన్ని కలిగించింది. అందుకే ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం గురించి ఈ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని ఐపీఎల్‌కు సంబంధించిన ఈవెంట్‌లు, ప్రమోషన్స్, మ్యాచ్‌ల టెలికాస్ట్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం' అని బంగ్లా ప్రభుత్వం పేర్కొంది.
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ తమ జట్టు నుంచి ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేసింది. దీనికి ప్రతి చర్యగా, వచ్చే నెలలో జరాగాల్సిన వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు తాము రాకూడదని నిర్ణయించుకున్నట్లు బంగ్లా బోర్డు ఆదివారం అధికారికంగా స్పష్టం చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఐపీఎల్ వేలానికి ముస్తాఫిజుర్‌ను అందుబాటులో ఉంచాలని బీసీసీఐ తమను కోరిందని, కానీ, అతడిని ఇప్పుడెందుకు కేకేఆర్ నుంచి రిలీజ్ చేసిందో వివరించాలంటూ భారత బోర్డుకు బీసీబీ లేఖ రాసింది.
BANGLADESH GOVERNMENT HAS SUSPENDED IPL BROADCAST IN THE COUNTRY. [Devendra Pandey] pic.twitter.com/K1RsRQv8EP
— Johns. (@CricCrazyJohns) January 5, 2026
జట్టు ప్రకటన
ఈ వివాదాలు కొనసాగుతున్న వేళ టీ20 వరల్డ్‌కప్ కోసం తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇటీవల ఐర్లాండ్‌తో సిరీస్ ఆడని పేసర్ తస్కిన్ అహ్మద్.. జట్టులోకి తిరిగొచ్చాడు. మొత్తం 15 మంది బృందంతో జట్టును ప్రకటించారు.
T20 వరల్డ్‌కప్‌నకు బంగ్లాదేశ్ జట్టు : లిటన్ దాస్ (కెప్టెన్), సైఫ్ హసన్, తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమాన్, తౌహిద్ హృదోయ్, షమిమ్ హొస్సేన్, ఖాజి నురుల్ హసన్, మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ సకిబ్, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్, షోరిఫుల్ ఇస్లామ్.
'జట్టులోంచి తీసేస్తే నేనేం చేస్తా?'- బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెస్పాన్స్

