ఆసియా ఛాంపియన్షిప్ : ఆయుశ్‌కు నిరాశ- ఫైనల్‌లో ఘోర ఓటమి
బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్ - పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ఆయుశ్ ఓటమి

Published : April 12, 2026 at 6:39 PM IST
Asia Championship Badminton 2026 : 2026 బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టికి ఎదురుదెబ్బ తగిలింది. అతను ప్రపంచ నంబర్ టూ షి యు క్వి చేతిలో 21-8, 21-10 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. ఫైనల్‌కు చేరడానికి ముందు అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించిన ఆయుశ్ శెట్టి, టైటిల్ పోరులో చతికిలపడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ ఓటమితో ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం భారత్ నిరీక్షణ ఇంకా కొనసాగుతుంది.
ఫైనల్‌లో ఆయుశ్ తడబాటు
భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆయుశ్ ఫైనల్‌లో తడబడ్డాడు. ఒత్తిడికి గురయ్యాడో ఏమో కానీ వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. చైనాకు చెందిన షి యుకి మొదటి సెట్‌లో ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు. బ్రేక్ సమయానికి 11-6 లీడ్‌లో ఉన్నాడు. అదే లీడ్ కొనసాగిస్తూ 21- 8 తేడాతో తొలి సెట్‌ను షి యుకి గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో ఆయుశ్ కాస్త పుంజుకున్నట్లే కనిపించాడు. తొలుత 7- 2తో లీడ్‌లోకి వచ్చాడు. దీంతో కమ్‌బ్యాక్ ఇచ్చినట్లే అనిపించింది. కానీ షి యుకి జెట్ స్పీడ్‌లో దూసుకొచ్చాడు. తొలి సెట్‌లో ప్రదర్శించిన అదే జోరు అందుకొంటూ బ్రేక్ సమయానికి 11- 8తో ఆధిక్యం సాధించాడు. ఆ తర్వాత అదే జోరు ప్రదర్శించిన అతడు, ఆయుశ్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి ఈ సెట్‌ను కూడా 21- 10తో గెలుచుకొని స్వర్ణ పతరం ముద్దాడాడు.
అంతకుముందు ఈ టోర్నీలో ఆయుశ్ శెట్టి అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు ఫైనల్‌కు చేరడానికి ముందు, ప్రపంచ నంబర్ 7 లీ షి ఫెంగ్, ప్రపంచ నంబర్ 4 జోనాథన్ క్రిస్టీ, ప్రపంచ నంబర్ 1 కున్లావుట్ విట్సెర్న్‌లను ఓడించాడు. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లకు ముందు ఆయుశ్ పారిస్ ఒలింపిక్ కాంస్య పతక విజేత లీ జి జియా, మాజీ ప్రపంచ ఛాంపియన్ లో కీన్ యు, బ్రియాన్ యంగ్‌లను కూడా ఓడించాడు. దీంతో భారీ అంచనాలతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కానీ తుది మెట్టుపై బోల్తా కొట్టాడు.

