క్రికెటర్ల వసతి సౌకర్యాలపై BCCI అభ్యంతరం- మౌనం వీడిన ఆసియా క్రీడల నిర్వాహకులు - ఏమన్నారంటే?
క్రికెటర్ల కోసం చేసిన ఏర్పాట్లపై అభ్యంతరాలు- టెంట్లలో డ్రెస్సింగ్ రూమ్స్, దూరంగా వాష్‌రూమ్స్ అంటూ రిపోర్ట్స్- 17 వేల మందికి వసతి సిద్ధంగా ఉందన్న ఆసియా గేమ్స్ నిర్వాహకులు

Published : August 31, 2026 at 2:11 PM IST
Asian Games Cricket Accommodation Issue : జపాన్ వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్ ప్రారంభానికి మూడు వారాల సమయమే ఉంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఐచి, నాగోయా ప్రాంతాల్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే అనుకున్న దానికంటే ఎక్కువ మంది అథ్లెట్లు, అధికారులు రిజిస్టర్ చేసుకోవడంతో వసతి విషయంలో ఇబ్బందులు వస్తాయనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా క్రికెట్ జట్ల బస కోసం చేసిన ఏర్పాట్ల విషయంలో బీసీసీఐ అసంతృప్తిగా ఉందని, ఈ పోటీలకు ప్రధాన జట్టును కాకుండా బీ టీమ్‌ను పంపే ఆలోచన చేస్తుందని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పుడు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా, ఐచి నాగోయా ఆసియా గేమ్స్ నిర్వాహక కమిటీ స్పందించాయి. పోటీల కోసం ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారందరికీ వసతి ఏర్పాటు చేసినట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చాయి.
17 వేల మందికి వసతి ఏర్పాట్లు
జులైలో పేర్ల నమోదు ముగిసే సమయానికి ఆసియా గేమ్స్ కోసం 17 వేల మందికి పైగా అథ్లెట్లు, అధికారులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరందరికీ గేమ్స్‌కు సరిపోయే వసతి అందుబాటులో ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప ఇక కొత్త రిజిస్ట్రేషన్స్‌ను తీసుకోబోమని కూడా చెప్పారు. చివరి దశ ఏర్పాట్లు అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే క్రికెట్ జట్లకు చివరకు ఎలాంటి వసతి కేటాయిస్తారనే వివరాలను ఈ ప్రకటనలో ప్రత్యేకంగా చెప్పలేదు.
ఇంతమంది వస్తారని ముందు అనుకోలేదు
ఆసియా గేమ్స్ కోసం మొదట దాదాపు 15 వేల మంది అథ్లెట్లు, అధికారులు వస్తారని లెక్క వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 17 వేలు దాటింది. అందులో సుమారు 11 వేల మంది అథ్లెట్లు, మరో 6 వేల మంది అధికారులు ఉన్నారు. ఈసారి ఒకే చోట సంప్రదాయ అథ్లెట్స్ విలేజ్ ఏర్పాటు చేయలేదు. అందుకే హోటల్స్‌తో పాటు నాగోయాలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి గదులు, కోస్టా సెరీనా అనే క్రూయిజ్ షిప్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. సంఖ్య పెరగడంతో కొన్ని టీమ్ అధికారుల వసతి విషయంలో ఆయా దేశాల ఒలింపిక్ కమిటీలు కూడా ఏర్పాట్లు చేసుకునేలా మార్పులు చేశారు.
బీసీసీఐకి నచ్చని ఏర్పాట్లు ఇవే!
క్రికెటర్లకు అందుబాటులో ఉన్న ఏర్పాట్ల గురించే మొదట అభ్యంతరాలు వచ్చాయి. మైదానం దగ్గర డ్రెస్సింగ్ రూమ్స్‌ను టెంట్లలో ఏర్పాటు చేశారని, అక్కడి నుంచి వాష్‌రూమ్స్ దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్నాయని బోర్డు అధికారుల దృష్టికి వచ్చింది. హోటల్ గదులు కూడా చాలా చిన్నగా ఉన్నాయని ఆ రిపోర్ట్ పేర్కొంది. మరోవైపు క్రికెట్ జట్లకు మూడు రకాల వసతి ఆప్షన్స్ గురించి చెప్పారట. నగరంలో ఉండి బుల్లెట్ ట్రైన్‌లో మైదానానికి రావడం, సమీపంలో నిలిపే షిప్‌లో ఉండడం లేదా పోటీలకు దగ్గరలో ఏర్పాటు చేసిన టెంట్లలో బస చేసే వసతిని ఉపయోగించడం ఇందులో ఉన్నాయి. భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు కూడా ఈ ఏర్పాట్లపై సంతృప్తిగా లేవని సమాచారం.
B టీమ్ వార్త ఎలా వచ్చిందంటే?
ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు బీసీసీఐ నుంచి ఒక అధికారి జపాన్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి పరిస్థితులపై ఆయన ఇచ్చే రిపోర్ట్ సంతృప్తికరంగా లేకపోతే భారత్ నుంచి B టీమ్‌ను పంపే ఆలోచన కూడా చేయొచ్చని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత దీనిపై మరో క్లారిటీ వచ్చింది. సౌకర్యాల విషయంలో వచ్చిన అభ్యంతరాలు నిజమే అయినా B టీమ్‌ను పంపే ఆలోచన లేదని మరో బీసీసీఐ వర్గం మీడియాకు తెలిపింది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పురుషుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో మహిళల టీమ్ కూడా సిద్ధంగా ఉంది.

