టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు- 4- 1తేడాతో యాషెస్ ఆసీస్ కైవసం
సిడ్నీ టెస్టులో 5 వికెట్ల తేడాతో విజయం- 31 వికెట్లతో చెలరేగిన స్టార్క్- పరుగుల వరద పారించిన ట్రావిస్ హెడ్

Published : January 8, 2026 at 3:21 PM IST
Australia Wins Ashes : యాషెస్ చివరి టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన ఐదో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆసీస్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 160 పరుగులు స్వల్ప ఛేదనలో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మార్నస్ లబుషేన్ (37), జేక్ వెదరాల్డ్ (34) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 3, విల్ జాక్స్ 1 వికెట్ దక్కించుకున్నారు. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4- 1 తేడాతో దక్కించుకుంది.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జాకబ్ బెతెల్ (154 పరుగులు) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్ (42), బెన్ డకెట్ (42) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, వెబ్‌స్టర్ చెరో 3, బొలాండ్ 2, నెసర్ 1 వికెట్ తీశాడు. దీంతో ఆస్ట్రేలియా ముందు 160 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 31.2 ఓవర్లలో ఛేదించింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (16) విన్నింగ్ షాట్ బాదాడు. కామెరూన్ గ్రీన్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
కెప్టెన్ల స్పందన
"మా జట్టు ప్రదర్శన అద్భుతం. అందరూ సమష్టిగా రాణించారు. ముఖ్యంగా స్టార్క్, హెడ్, క్యారీలు ఈ సిరీస్‌లో నిలిచిపోయే ప్రదర్శన చేశారు" అని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఇక "మేము ఇంతకంటే బాగా ఆడాల్సింది. కానీ ఆస్ట్రేలియా ఐదు టెస్టుల్లోనూ అద్భుతంగా ఆడింది" అని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రత్యర్థిని కొనియాడాడు. కాగా, ఈ సిరీస్‌లో పాట్ కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ 4 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Congratulations to our Australian Men's Cricket Team on securing the NRMA Insurance Ashes series 4-1 🇦🇺#Ashes pic.twitter.com/0VWis6gA5P
— Cricket Australia (@CricketAus) January 8, 2026
స్టార్క్, హెడ్ అదరహో
ఈ సిరీస్‌లో ఆసీస్ ప్లేయర్లు రికార్డులు సృష్టించారు. పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సిరీస్‌లో 19.9 సగటుతో ఏకంగా 31 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' గా ఎంపికైయ్యాడు. అటు బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్ మూడు భారీ సెంచరీలతో రెచ్చిపోయాడు. సిరీస్‌లో ఏకంగా 629 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కూడా 28 డిస్మిసల్స్‌తో ఆకట్టుకున్నాడు.
డీఆర్ఎస్ వివాదం
చివరి రోజు ఆటలో థర్డ్ అంపైర్ నిర్ణయం కాంట్రవర్సీ అయ్యింది. ఆసీస్ బ్యాటర్ జేక్ వెదరాల్డ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి బ్యాట్‌కు తాకినట్లు అనిపించింది. ఇంగ్లాండ్ అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చారు. డీఆర్ఎస్లో స్నికో మీటర్‌లో చిన్న కదలిక కనిపించింది. అయినా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాక్ అయ్యారు. కెప్టెన్ స్టోక్స్ అంపైర్లతో వాగ్వాదానికి దిగినా ఫలితం లేకపోయింది.
ఖవాజాకు వీడ్కోలు
ఈ మ్యాచ్‌తో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా కెరీర్ ముగిసింది. అతడికి ఇదే చివరి టెస్టు కావడంతో మైదానంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన ఖవాజాకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ హానర్' ఇచ్చి గౌరవించారు. అభిమానులు చప్పట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఖవాజా తన చివరి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి ఔటయ్యాడు. పెవిలియన్‌కు వెళ్తూ మైదానంలో రాసిన "థాంక్యూ ఉజీ" సందేశం వద్ద మోకాళ్లపై కూర్చుని పిచ్‌ను ముద్దాడాడు.
రికార్డు స్థాయి అటెండెన్స్
ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు క్రికెట్ అభిమానులు పోటెత్తారు. ఐదు రోజుల్లో కలిపి మొత్తం 2,11,032 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. సిడ్నీ మైదానంలో అత్యధిక మంది హాజరైన టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డు సృష్టించింది.
One final bit of history to end a remarkable Ashes series 🌟#Ashes pic.twitter.com/x4ZNWmMh6l
— Cricket Australia (@CricketAus) January 8, 2026
సంక్షిప్త స్కోర్లు
- ఇంగ్లాండ్ : 384 & 342
- ఆస్ట్రేలియా : 567 & 161/5
బాక్సింగ్ డే టెస్టు 'ఇంగ్లాండ్'దే- రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
యాషెస్‌లో ఆస్ట్రేలియా 'హ్యాట్రిక్' విక్టరీ- ఇంగ్లాండ్ వరుసగా మూడో ఓటమి

