ETV Bharat / sports

ఆసియా బాక్సింగ్‌లో స్వర్ణం ముద్దాడిన అరుంధతి చౌదరి- మూడేళ్ల కష్టాలను దాటి 8 నెలల్లోనే ఫామ్​లోకి!

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన అరుంధతి చౌదరి- మంగోలియాలోని ఉలాన్‌బాటర్ వేదికగా జరిగిన ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన- మణికట్టు గాయంతో మూడేళ్లు ఆటకు దూరమై పట్టుదలతో రీఎంట్రీ

Arundhati Choudhary  Asian Boxing Championship
Arundhati Choudhary Asian Boxing Championship (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : April 10, 2026 at 11:40 AM IST

3 Min Read
Choose ETV Bharat

Asian Boxing Championship 2026 : భారత క్రీడారంగంలో మరో ధ్రువతార మెరిసింది. అడ్డంకులు ఎన్ని ఎదురైనా, సంకల్పం బలంగా ఉంటే విజయం వరిస్తుందని రాజస్థాన్‌కు చెందిన బాక్సర్ అరుంధతి చౌదరి నిరూపించారు. మంగోలియాలోని ఉలాన్‌బాటర్ వేదికగా జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు. ముఖ్యంగా మూడేళ్ల పాటు గాయంతో పోరాడి, రింగుకు దూరమైన తర్వాత ఆమె సాధించిన ఈ విజయం క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తోందనే చెప్పాలి. అరుంధతి గెలుపుతో ఆమె స్వగ్రామమైన కోటలో పండుగ వాతావరణం నెలకొంది. పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచిన అరుంధతి ప్రస్థానం అలాగే ఆమె భవిష్యత్తు లక్ష్యాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఆసియా బాక్సింగ్‌లో స్వర్ణ పోరాటం!
మంగోలియాలో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ ఎలైట్ ఛాంపియన్‌షిప్‌లో అరుంధతి చౌదరి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు. గురువారం 70 కేజీల ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ప్రత్యర్థి బక్త్​ సెడిష్​ (కజకిస్థాన్​)పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 4-1 స్కోరుతో ఘనవిజయం సాధించారు. కజకిస్థాన్ వంటి బలమైన దేశాల నుంచి వచ్చిన బాక్సర్లను ఓడించి పసిడి పతకాన్ని ముద్దాడటం సామాన్యమైన విషయం కాదు. నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహైన్ వంటి వరల్డ్ ఛాంపియన్లతో కూడిన భారత జట్టులో అరుంధతి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

గాయాన్ని జయించి మళ్లీ రింగులోకి
అరుంధతి ప్రయాణం పూల బాట ఏమీ కాదు. మణికట్టుకు తీవ్రమైన గాయం కావడంతో ఆమె దాదాపు మూడేళ్ల పాటు బాక్సింగ్ రింగుకు దూరమయ్యారు. ఈ క్రమంలో ముంబయిలో ఆమెకు రెండు సార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఆమె చేసిన పోరాటాన్ని ఆమె తండ్రి సురేష్ చౌదరి వనవాసంతో పోల్చారు. గాయం నుంచి కోలుకున్న కేవలం ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలోనే ఆమె మళ్లీ ఫామ్​లోకి రావడం విశేషం. పట్టుదలే ఆమెను మళ్లీ ఛాంపియన్‌గా మార్చింది.

Arundhati Choudhary  Asian Boxing Championship
తాను సాధించిన మెడల్​ను వీడియో కాల్​లో తల్లిదండ్రులకు చూపిస్తున్న అరుంధతి (Source : ETV Bharat)

కంటతడి పెట్టుకున్న తల్లిదండ్రులు
అరుంధతి స్వర్ణం గెలిచిన వార్త తెలియగానే కోటలోని ఆమె నివాసం వద్ద కోలాహలం మొదలైంది. ఈ విజయం గురించి ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. "నా కూతురు రాజస్థాన్‌కు మాత్రమే కాదు, దేశం మొత్తానికి గర్వకారణంగా నిలిచింది" అని తండ్రి సురేష్ చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. ఆసియా స్థాయిలో ఇంతటి పోటీని ఎదుర్కొని గెలవడం గర్వంగా ఉందన్నారు. ఆమె తల్లి సునీతా చౌదరి మాట్లాడుతూ నేటి కాలంలో కుమారుల కంటే కుమార్తెలే దేశానికి ఎక్కువ కీర్తిని తీసుకువస్తున్నారని గర్వంగా చెప్పారు.

Arundhatis parents
కుతురు విజయాన్ని మిఠాయిలు తినిపించుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్న అరుంధతి తల్లిదండ్రులు (Source : ETV Bharat)

వరల్డ్ కప్ నుంచి ఆసియా గోల్డ్ వరకు!
అరుంధతి గత కొద్దికాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. నోయిడాలో జరిగిన వరల్డ్ కప్‌లో స్వర్ణం గెలిచిన ఆమె, ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగిన 'బాక్సామ్' ఇంటర్నేషనల్ టోర్నీలో 70 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని సాధించారు. ఇప్పుడు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కూడా అదే జోరును కొనసాగించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సెమీఫైనల్ అలాగే ఫైనల్ మ్యాచ్‌లలో ఆమె చూపిన తెగువ చూస్తుంటే, రాబోయే పెద్ద టోర్నీలకు ఆమె పవర్ఫుల్​గా సిద్ధమైనట్లు అర్ధమవుతుంది.

వరల్డ్​కప్​తో సమానం : కోచ్
అరుంధతి కోచ్ అశోక్ గౌతమ్ ఆమె సాధించిన విజయాన్ని కొనియాడారు. "ఈ టోర్నీలో ప్రపంచస్థాయి బాక్సర్లు పాల్గొన్నారు. ఇక్కడ స్వర్ణం గెలుచుకోవడం అంటే దాదాపు వరల్డ్ కప్ గెలిచినట్లే" అని అభిప్రాయపడ్డారు. నిఖత్ జరీన్, లవ్లీనా వంటి దిగ్గజాల సమక్షంలో అరుంధతి ఇంతటి ప్రదర్శన చేయడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందన్నారు. ఆమెలోని టెక్నిక్ స్పీడ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయని వివరించారు.

ఆసియా టైటిల్ సాధించిన తర్వాత అరుంధతి విశ్రాంతి తీసుకోవాలని అనుకోవడం లేదు. త్వరలోనే ఆమె కోటకు చేరుకుని, ఆ తర్వాత గ్లాస్గోలో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ కోసం సిద్ధం కానున్నారు. దీనికోసం ఆమె ఉజ్బెకిస్థాన్ లేదా అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకునే అవకాశం ఉంది. అరుంధతి నెక్స్ట్ టార్గెట్ ఒలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే. తన ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులను అధిగమిస్తూ ఆమె సాగిస్తున్న ఈ ప్రయాణం తప్పక ఒలింపిక్ పతకం వైపు తీసుకెళ్తుందని ఆమె కుటుంబం నమ్ముతోంది.

వీళ్లు కూడా
అరుంధతితోపాటు ప్రీతి పవార్ (54 కేజీ), ప్రియ (60 కేజీ), మీనాక్షి హుడా (48 కేజీ) గోల్డ్ మెడల్స్ సాధించారు. హువాంగ్ (చైనీస్‌ తైపీ)పై 5- 0 తేడాతో ప్రీతి నెగ్గగా, 5- 0 తేడాతోనే నోమన్‌దరి (మంగోలియా)పై మీనాక్షి విజయం సాధించింది. ఇక 3- 0 తేడాతో వాన్‌ యంగ్‌ (ఉత్తర కొరియా)పై ప్రియ గెలుపొంది స్వర్ణం ముద్దాడింది.