గ్రౌండ్ సిబ్బందికి రూ.25 లక్షల నగదు బహుమతి- ఎందుకంటే?
గ్రౌండ్ సిబ్బంది అవిశ్రాంత కృషికి ఏసీఏ సత్కారం- మూడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించినందుకు గ్రౌండ్బాయ్స్కు దక్కిన గౌరవం

Published : April 13, 2026 at 2:38 PM IST
ACA Reward For Ground Staff : అసోం క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) గువాహటిలోని తమ గ్రౌండ్ సిబ్బంది అవిశ్రాంత కృషిని సత్కరించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పటికీ, వారి కృషి వల్లే ఐపీఎల్ 2026కు సంబంధించిన మూడు షెడ్యూల్డ్ లీగ్ మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించగలిగారని చెప్పింది. ఈ మేరకు ఆదివారం నాడు ఒక ప్రశంసనీయమైన చర్యగా, బర్సపారా స్టేడియంలోని గ్రౌండ్స్‌మెన్‌లకు క్రికెట్ బోర్డు రూ. 25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది.
అసోం క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా, ఏసీఏ అధ్యక్షుడు తరంగ గొగోయ్ ఏసీఏ సోషల్ మీడియా హ్యాండిల్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. "గువాహటిలోని ఏసీఏ స్టేడియంలో మూడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడం వెనుక, ప్రచారానికి దూరంగా ఉంటూ, అవిశ్రాంతంగా పనిచేసే ఒక బృందం ఉంది. అదే మా అంకితభావం గల గ్రౌండ్ సిబ్బంది" అని పేర్కొన్నారు.
"ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య పనిచేస్తూ, క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌లు పిచ్‌లను అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేసి, నిర్వహించేలా చూసుకున్నారు" అని తమ ప్రకటనలో పేర్కొన్నారు. "వారి కృషి మ్యాచ్‌లు సజావుగా జరగడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే జాతీయ స్థాయిలో ఈ వేదికకు పెరుగుతున్న ఖ్యాతిని నిలబెట్టడంలో కూడా సహాయపడింది" అని ఆ ప్రకటనలో తెలిపారు.
ఆ సేవకు గుర్తింపుగా ఈ రివార్డ్
కాగా, వారి అమూల్యమైన సేవలకు గుర్తింపుగా, క్యూరేటర్, గ్రౌండ్స్‌మెన్‌లకు రూ.25 లక్షల రివార్డును ప్రకటించడానికి అసోం క్రికెట్ అసోసియేషన్ గర్విస్తోందని తెలిపింది. అసోసియేషన్ అధ్యక్షుడు తరంగ గొగోయ్, కార్యదర్శి సనాతన్ దాస్, జట్టు వృత్తి నైపుణ్యాన్ని, నిబద్ధతను ప్రశంసించారు. మ్యాచ్‌లు సజావుగా జరగడంలో వారి అంకితభావమే కీలకమని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. "మ్యాచ్ కార్యకలాపాలకు అసలైన వెన్నెముక మీరు. మీ కృషి వృథాగా పోదు" అని ట్వీట్ చేశారు.
వర్షం పడినా మ్యాచ్‌కు అంతరాయం కలుగకుండా
ఈ వేదికపై నిర్వహించిన మూడు మ్యాచ్‌లలో, రెండు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్ (RR), ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో రాజస్థాన్ విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రాజస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి కూడా వర్షం అంతరాయం కలిగించింది. ఫలితంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ ఒక్క ఓవర్ కూడా వృథా కాలేదు. వర్షం పడుతున్నప్పటికీ మ్యాచ్ జరిగేలా కృషి చేసినందుకు గానూ గ్రౌండ్స్‌మెన్‌లకు ఏసీఏ పురస్కారం అందజేసింది.
రాజస్థాన్ అద్భుత ప్రదర్శన
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబయి, రాజస్థాన్ మధ్య జరిగి మ్యాచ్‌ను వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించారు. అయినప్పటికీ ఆటలో ఎక్కడా ఉత్కంఠ తగ్గలేదు. ముఖ్యంగా యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వంసకర బ్యాటింగ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అలా రాజస్థాన్ అద్భుత ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్‌పై 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా వైభవ్
గువాహటి వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు టీం 202 స్కోర్‌ను లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ రాజస్థాన్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి, ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఛేదనలో వైభవ్ ఆటే హైలైట్‌గా నిలిచింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
జైస్వాల్ తుపాన్ ఇన్నింగ్స్- ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
రాజస్థాన్ సూపర్ విక్టరీ- వైభవ్ విధ్వంసంతో RCBకి తొలి ఓటమి

