యమునమ్మకు పుష్కర శోభ- ఈ 12 రోజులు స్నానం చేస్తే అశ్వమేధయాగం ఫలితం!
దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో జూన్ 2 నుంచి యమునా నదికి పుష్కరాలు- పన్నెండు రోజుల పాటు జరిగే పుణ్యకాలంలో భక్తులు పుష్కర స్నానాలు, దానధర్మాలు, పితృకార్యాలు

Published : June 1, 2026 at 4:47 AM IST
Yamuna Pushkaralu 2026 : ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. దేవగురువు బృహస్పతి సంచారం ఆధారంగా నదులకు పుష్కరాలు వస్తాయి. హిందూ సంప్రదాయం ప్రకారం పుష్కర స్నానం వలన పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఏ నదికి పుష్కరాలు రానున్నాయి? పుష్కరాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఎన్ని రోజులు జరుగుతాయి? పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? పుష్కరాల్లో ఆచరించాల్సిన విధివిధానాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ ఏడాది ఏ నదికి పుష్కరాలు? ఎప్పుడు ప్రారంభం?
దేవగురువు బృహస్పతి జూన్ 2, మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13, శనివారం తో ముగుస్తాయి. ఈ పన్నెండు రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు.
పుష్కర ఘాట్లు
ఉత్తరాఖండ్ లోని యమునోత్రి వద్ద ఉద్భవించిన యమునా నది ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో యమునోత్రి తో పాటు మధుర, ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం, కాళీపీ ఘాట్‌లు, ఆగ్రా పరిసర నదీతీర ఘాట్లు పుష్కర స్నానాలకు అత్యంత ప్రసిద్ధి.
పుష్కరాలు ఎన్ని రోజులు?
సాధారణంగా బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించినప్పుడు, పుష్కరుడు సంబంధిత నదిలోకి ప్రవేశించి ఏడాది కాలం పాటు ఆ నదిలోనే ఉంటాడు. ఈ క్రమంలో ఏడాది మొత్తం ఆ నదికి పుష్కర శోభ ఉన్నప్పటికీ ప్రత్యేకించి మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పవిత్ర పుష్కర స్నానాలు చేయడం పుణ్యప్రదమని భావిస్తారు. ఈ సందర్భంగా పుష్కరాల్లో ఆచరించించాల్సిన విధివిధానాలు తెలుసుకుందాం.
పుష్కరాల్లో ఆచరించాల్సిన విధివిధానాలు
దశవిధ స్నానాలలో తీర్ధ స్నానం ఉత్తమమైనది అయితే పుష్కర పుణ్య సమయంలో ఆచరించే పుష్కర స్నానం విశేష ఫలదాయకం అని పెద్దలు చెప్తుంటారు. పుష్కర స్నానానికి నదిలో దిగేముందు పురుషులైతే గట్టు మీద ఉన్న మట్టిని, స్త్రీలయితే మట్టికి బదులు పసుపు, కుంకుమ కొద్ది కొద్దిగా మూడు సార్లు నదిలో వేసి, ఆ తరువాతనే నదిలోకి దిగాలని శాస్త్ర వచనం. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదట.
పుష్కర స్నానం ఎలా చేయాలి?
పవిత్ర నదుల్లో పుణ్య స్నానం ఆచరించే ముందు ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్లాలి. భక్తిగా మూడు మునకలు వేసినా సరిపోతుంది. కానీ సబ్బులు, షాంపూలతో మాత్రం నదీ స్నానం చేయకూడదు.
ఏ సమయంలో పుష్కర స్నానం చేస్తే ఎలాంటి ఫలితం?
పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.
పుష్కరాల వేళ ఏ దానం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది?
పుష్కరాల సమయంలో పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దానాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. పుష్కర 12 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దానానికి ప్రసిద్ధి. సాధారణంగా పుష్కరాలు సమయంలో చేసే పిండ ప్రదానం వలన అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ క్రమంలో ఏ రోజు ఏ దానం చేయడం వలన ఎలాంటి ఫలితం లభిస్తుందో చూద్దాం.
- మొదటి రోజు: భూ దానం, ధాన్యం దానం, సువర్ణ దానం, రజత దానం, అన్నదానం
- రెండో రోజు: రత్న దానం, గో దానం, లవణ దానం, వస్త్ర దానం
- మూడో రోజు: గుడ అంటే బెల్లం దానం, అశ్వ శాఖ, ఫల దానం
- నాలుగో రోజు: పాలు, తేనె, నెయ్యి, నూనె
- ఐదో రోజు: ఎద్దులు, ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు
- ఆరో రోజు: ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం
- ఏడో రోజు: గృహ దానం, మంచం, కుర్చీ, పీట లాంటి గృహోపకరణ వస్తువులు
- ఎనిమిదో రోజు: చందనం, కంద మూలాలు, పుష్ప మాలలు
- తొమ్మిదో రోజు: కంబళ్ళు, దుప్పట్లు, పిండ దానం, దాసీ దానం
- పదో రోజు: శాకం, కూరగాయలు దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం
- పదకొండో రోజు: గజ దానం
- పన్నెండో రోజు: నువ్వుల దానం
పితృదేవతల ప్రీత్యర్థం
పుష్కర తీర్ధంలో పిండప్రదానం చేస్తే, సమస్త నదుల తీరాలలో పిండ ప్రదానం చేసినట్లే అని శాస్త్రం చెబుతోంది. అందుకే స్నానాలతో పాటుగా పిండ ప్రదానానికి కూడా పుష్కర తీరం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కార్యక్రమాలు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే చేయాలి. సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పితృ కార్యక్రమాలు నిర్వహించరాదు.
పుష్కర స్నాన మహత్యం
నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మనం కూడా యమునా నది పుష్కరాలలో స్నానమాచరించి మోక్షాన్ని పొందుదాం. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మట్టపల్లిలో శిలపైన వెలసిన నరసింహుడు! - తడి దుస్తులతో 32 ప్రదక్షణిలు చేస్తే కోరికలు తీరుతాయి!

