ETV Bharat / spiritual

యమ దీపం ఇలా పెడితే- అకాల మృత్యుదోషాలు తొలగడం తథ్యం!

యమ దీపం ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు- అకాల మరణ భయం ఉండదని శాస్త్రవచనం!

Yama Deepam 2025
Yama Deepam 2025 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : October 18, 2025 at 5:01 AM IST

2 Min Read
Choose ETV Bharat

Yama Deepam 2025: యమ దీపం అంటే అకాలమృత్యు భయాలు, అపమృత్యు దోషాలు తొలగించమని ప్రార్ధిస్తూ యమధర్మరాజుని స్మరిస్తూ దీపం పెట్టడం. దీపావళి ముందు యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా దీపం పెట్టడం అత్యంత శుభకరంగా చెబుతారు. మరణానికి అధిపతి అయిన యమున్ని స్మరిస్తూ వెలిగించే దీపం ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా యమ దీపాన్ని ఎప్పుడు పెట్టాలి? యమ దీపం పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యమ దీపం అంటే?
యమ దీపం పెట్టడం అనే సంప్రదాయం ధన త్రయోదశి రోజున యముని గౌరవార్ధం పాటించే ఆచారం. ఈ దీపాన్ని యముని ఆశీర్వాదం పొందడానికి, అకాల మరణం నుంచి రక్షణ కలగాలని వెలిగిస్తారు.

యమ దీపం ఎప్పుడు పెట్టాలి?
హిందూ పంచాంగం ప్రకారం 2025లో ధన త్రయోదశి తిథి అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 19న మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల వరకు కొనసాగుతుంది. కాబట్టి అక్టోబర్ 18, శనివారం రోజునే ధన త్రయోదశి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

సుముహూర్తం
అక్టోబర్ 18, శనివారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ధన త్రయోదశి రోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల లోపు యమ దీపం వెలిగించడానికి శుభ ముహూర్తం. ఈ సమయంలో యమ దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

యమ దీపం ఎక్కడ వెలిగించాలి?
జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచించిన ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో ఈ యమ దీపాన్ని వెలిగించాలి. పురాణాల ప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు. కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యమధర్మరాజు అనుగ్రహంతో కుటుంబ సభ్యులకు ఎలాంటి మృత్యు భయాలు దరి చేరవని విశ్వాసం.

యమ దీపం వెలిగించే విధానం!
యమ దీపం వెలిగించడంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెబుతోంది. అవేంటో చూద్దాం.

యమ దీపాన్ని ఇలా ప్రార్ధించాలి!
ముందుగా ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ పోయాలి. యమ దీపం నాలుగు వైపులా ఉండాలి. నాలుగు వత్తులతో వెలిగించాలి. ఆ ప్రమిదను ఒక రావి ఆకుపై దక్షిణ దిక్కుగా ఉంచి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి యమ దీపానికి నమస్కరిస్తూ, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, కష్టాల నుంచి ఉపశమనం కలిగించమని ప్రార్థించాలి. ఈ ప్రార్థన వల్ల ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతుందని విశ్వాసం.

యమ దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి!

'మృత్యునాం దండపాశాభయం కాలేన్ శ్యామయ సః

త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మామ్'

ఈ శ్లోకాన్ని కుటుంబ సభ్యులందరూ చదువుకోవాలి.

యమ దీపదాన ఫలం
వెలిగించిన యమ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటాయని, అకాల మరణ భయం ఉండదని శాస్త్రవచనం. రానున్న ధన త్రయోదశి రోజు మనం కూడా యమ దీపాన్ని వెలిగిద్దాం. అపమృత్యు దోషాల నుంచి, అకాల మృత్యు భయాల నుంచి ఉపశమనం పొందుదాం.
శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.