వినాయకుడి బొజ్జ చుట్టూ పాము ఎందుకు ఉంటుంది?- దీని వెనుక ఉన్న అద్భుత కథ!
వినాయకుడు విఘ్నాలు తొలగించే దైవం- చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తే చాలు

Published : January 7, 2026 at 5:00 AM IST
Secret Behind Ganesha Snake Belt: పాలు తాగే పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి వరకు అందరికీ గణపతి అంటే ఎంతో ఇష్టం. హిందువుల పండుగలలో తొలి పండుగ వినాయక చవితి. ఈ సందర్భంగా ఊరూవాడా అనేక రూపాలలో గణపతి కొలువై భక్తులను అనుగ్రహిస్తాడు. సాధారణంగా వినాయకుని రూపం అందరికీ సుపరిచితమే! పెద్ద చెవులు, చిన్న చిన్న కళ్లు, పెద్ద బొజ్జ, ఏనుగు తొండంతో ముద్దులొలికే గణపతి అందరికీ ఇష్టుడు. అయితే వినాయకుని బొజ్జ చుట్టూ పాము ఉండడం ఎప్పుడైనా గమనించారా! వినాయక చవితి కథలో ఈ ప్రస్తావన ఉంటుంది. అసలు వినాయకుని బొజ్జ చుట్టూ పాము ఎందుకుంటుందో తెలుసా! ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే!
వినాయకుని శరీరంపై ఆదిశేషుడు
మనం నిత్యం చూసే గణపతి విగ్రహాలలో గణపతికి యజ్ఞోపవీతం స్థానంలో పాము ఉండడం చూస్తాం. అలాగే వినాయకుడి పొట్ట చుట్టూ చేతులకు కూడా పాములు ఉంటాయి. ఇలా వినాయకుని శరీరంపై ఆదిశేషుడు ఉండడం వెనుక ఒక పురాణగాథ ఉంది. అదేమిటో చూద్దాం.
ఆదిశేషుని గర్వం
ఒకసారి కైలాసంలో పరమ శివుడు కొలువు తీరి ఉన్నప్పుడు మహర్షులు, దేవతలు, మునులు వచ్చి పరమేశ్వరుని స్తుతిస్తూ ఆయనను సేవిస్తున్నారు. ఆ సమయంలో శివుని తలపై సర్పరూపంలో ఆదిశేషుడు ఉన్నాడు. శేషుడు తన మనసులో 'దేవతలందరూ మొక్కే శివుని శిరసుపై నేను ఉన్నాను. నా గొప్ప ఎక్కువ కాబట్టే శివుడు నన్ను శిరస్సున ధరించాడు. అందరూ శివుని పాదాల దగ్గర ఉంటే నేను శివుని శిరస్సున ఉన్నాను' అని అనుకున్నాడంట! ఇలా అనుకోగానే గర్వంతో అహంకారం పెరిగింది.
శివుడాజ్ఞ లేనిదే
ఆదిశేషుడు మనసులో అనుకున్న ఈ మాటలన్నీ శివుడు గ్రహించాడు. ఎలాగైనా ఆదిశేషుని గర్వాన్ని అణచాలని అనుకున్నాడు. వెంటనే తన శిరసుపై ఉన్న ఆదిశేషుని తీసి నేలకేసి కొట్టాడు. దానితో ఆదిశేషుని ఒక్కో తల పది ముక్కలైంది. వెంటనే ఆదిశేషునికి తన తప్పు తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో శివుని పాదాలను ఆశ్రయించి తనను క్షమించమని వేడుకున్నాడు. కానీ ఆదిశేషుడు ఎంత వేడుకున్నా శివుడు అతనిని తిరిగి తన శిరస్సున ధరించలేదు. పూర్వపు స్థానం ఇవ్వలేదు.
నారదుని ఉపాయం
తనకు పట్టిన దుర్గతికి దుఃఖిస్తూ ఆదిశేషుడు కైలాసం నుంచి వెళ్లిపోతుండగా నారద మహర్షి కనిపించి ఆదిశేషుని దుఃఖానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు ఆదిశేషుడు జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు నారదుడు 'తండ్రి ఆగ్రహించాడని వెళ్ళిపోతే ఎలా! ఆయన కుమారుడైన గణపతిని ఆశ్రయించు' అని చెప్పి గణపతి షడక్షర మంత్రాన్ని జపించమని చెప్పి వెళ్ళిపోతాడు.
గణపతి కోసం శేషుని తపస్సు
నారదుడు సూచించినట్లుగా ఆదిశేషుడు గణపతి షడక్షర మంత్రాన్ని జపిస్తూ వేయి సంవత్సరాలపాటు కఠోర తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు గణపతి ప్రత్యక్షమై 'నీకు తిరిగి నా తండ్రి శిరసు మీద పూర్వపు స్థానాన్ని కల్పిస్తాను' అని మాట ఇస్తాడు.
పరమ శివునికి నచ్చచెప్పిన గణపతి
ఇచ్చిన మాట ప్రకారం గణపతి తన తండ్రికి నచ్చే చెప్పి ఆదిశేషునికి పరమ శివుని శిరసుపై పూర్వపు స్థానాన్ని కల్పిస్తాడు. అందుకు సంతోషించిన శేషుడు గణపతితో 'స్వామి నువ్వు కూడా నన్ను ధరించు' అనగా వినాయకుడు దానికి ఇంకా సమయం ఉందిలే అని చెబుతాడు.
వినాయకుడికి ఆభరణంగా మారిన శేషుడు
ఈ క్రమంలో వినాయకుడు ఉండ్రాళ్లు, కుడుములు తిని పొట్ట విరిగినప్పుడు అతని పొట్టను పాముతో కట్టడం అనే అంశాన్ని మనం వినాయక చవితి కథలో చూస్తాం. ఈ సంఘటన జరిగినప్పుడు బ్రహ్మదేవుడు ఆదిశేషుని పిలిచి 'నువ్వు వినాయకుని పొట్ట మరోసారి విరగకుండా పొట్టకు చుట్టుకుని ఉండు. భుజానికి జాజ్ఞోపవీతంగా ఉండు' అని ఆఙ్ఞాపించాడంట! ఆనాటి నుంచి ఆదిశేషుడు వినాయకుని శరీరం మీద ఒక ఆభరణంలా మారాడు.
వినాయకుడు విఘ్నాలు తొలగించే దైవం. అందుకే ప్రతిరోజూ వినాయకుని తప్పకుండా పూజించాలి. ముఖ్యంగా బుధవారం రోజు వినాయకుని షోడశ నామాలు చదువుకుని చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తే చాలు ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోతాయని పెద్దలు అంటారు.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

