ETV Bharat / spiritual

పార్వతీదేవి ప్రతిష్టించిన మహా గణపతి- శని దోషాలు తొలగించే కమండల ఆలయ గురించి తెలుసా?

కర్ణాటకలోని చిక్కమగళూరులో వెలసిన వేల ఏళ్ల పురాతన కమండల గణపతి ఆలయం- విశిష్ట ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి- పార్వతీదేవి ప్రతిష్టించిన ఈ స్వయంభూ గణపతి- కమండల తీర్థాన్ని సేవిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం

Kamandala Ganapathi Temple
Kamandala Ganapathi Temple (ETV)
author img

By ETV Bharat Telugu Team

Published : July 22, 2026 at 3:28 AM IST

3 Min Read
Choose ETV Bharat

Kamandala Ganapathi Temple : దక్షిణ భారతంలో వినాయకుని ఆలయాలు అనేకం ఉన్నాయి. తమిళనాట పిళ్ళయార్ గా పూజలందుకునే గణనాథుడు కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో స్వయంభువుగా వెలసి ఉన్నాడు. ప్రతి దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా పురాణ ప్రధానమైన దేవాలయాలే ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో అతి ప్రాచీనమైన ఓ గణపతి ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వేల చరిత్ర కలిగిన కమండల గణపతి దేవాలయం
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా, కొప్ప తాలూకా కేసవే గ్రామంలో వెయ్యి సంవత్సరాల పురాతనమైన కమండల గణపతి దేవాలయం వెలసి ఉంది. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం కొలువై ఉంది. సాక్షాత్తు పార్వతీదేవి ఇక్కడ వినాయకుని ప్రతిష్టించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

ఆలయ స్థల పురాణం
కమండల గణపతి క్షేత్రం గర్భాలయంలో గణపతి విగ్రహం విశిష్టంగా ఉంటుంది. యోగముద్రలో కుర్చొన్న రీతిలో ఇక్కడ గణపతి విగ్రహం ఉండటం విశేషం. పూర్వం ఒకసారి పార్వతీదేవి శని దేవుని నుంచి తప్పించుకోవడానికి భూమిపైకి వచ్చి మైగవధే వద్ద వినాయకుని ప్రతిష్టించి తపస్సు చేసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పార్వతీదేవి స్వయంగా ప్రతిష్టించడం వల్ల, ఇక్కడి వినాయకుడిని దర్శించుకుంటే భక్తులకు శని దోషాలు తొలగిపోతాయని, పాపాలు నశిస్తాయని విశ్వాసం.

కమండల తీర్థం
ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిని కమండల తీర్థం అని అంటారు. ఈ పుష్కరిణిలోని ఏడాదిలో 365 రోజులూ నీరు చేరుతూనే ఉంటుంది. ఈ తీర్థం వెనక ఒక ఆసక్తి గొలిపే కథనం కూడా ఉంది. అదేంటో చూద్దాం.

బ్రహ్మదేవుడు సృష్టించిన కమండల తీర్థం
పార్వతి దేవి ఇక్కడ తపస్సు చేయడానికి ముందు విఘ్నాలు రాకుండా గణనాథుని ప్రతిష్టించడానికి సిద్ధమవుతోంది. అయితే ఆ సమయంలో అక్కడ పూజాదికాలకు అవసరమైన నీరు లభించదు. అప్పుడు పార్వతీదేవి బ్రహ్మదేవుని ప్రార్ధిస్తుంది. పార్వతీదేవి ప్రార్థనకు సంతసించిన బ్రహ్మదేవుడు ఇక్కడ భూమిలోకి బాణం వేసి నీటిని సృష్టించాడు. తామర పువ్వు ఆకారంలో బ్రహ్మ బాణంతో ఏర్పడిన పవిత్ర తీర్థం ఆనాటి నుంచి నిరంతరాయంగా ఇప్పటికీ అదే ఆకారంలో ప్రవహిస్తూ ఉండడం విశేషం. బ్రాహ్మీ నది పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెబుతారు.

కమండల తీర్థం పేరు ఇలా వచ్చింది.
పార్వతీదేవి తపస్సుకు మెచ్చి బ్రహ్మ దేవుడు తన కమండలంలోని పవిత్ర జలాన్ని పార్వతీదేవి తపస్సుకు మెచ్చి చల్లగా, అదే ఈ కమండల తీర్థంగా మారిందని మరో కథనం ద్వారా తెలుస్తోంది. ఈ పుష్కరిణి కమలం ఆకారంలో ఉంటుంది.

యోగముద్రలో వెలసిన కమండల గణపతి
గర్భాలయంలో యోగముద్రలో దర్శనమిచ్చే గణపతిని దర్శించుకోవడం సకల శుభకరమని విశ్వాసం. వర్షాకాలంలో కమండల పుష్కరిణిలోని నీరు గణపతి పాదాలను స్పృశిస్తాయని అంటారు. అందుకే ఈ గణపతిని కమండల గణపతి అని అంటారు. ఆ సమయంలో గణపతిని దర్శించుకొంటే చేసిన సకల పాపాలు పోతాయని చెబుతారు.

కమండల తీర్థ మహత్యం
బ్రహ్మచే సృష్టించబడిన కమండల తీర్థానికి ఎంతో మహత్యం ఉంది. కమండల తీర్థ పుష్కరిణిలో ఏడాదిలో 365 రోజులు నీరు చేరుతూనే ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే శనిదోషం నుంచి విముక్తి లభిస్తుందని అంటారు.

జ్ఞానవృద్ధి కలిగించే పుష్కరిణి తీర్థం
విద్యార్థులు కమండల తీర్థ పుష్కరిణి నీటిని త్రాగితే చదువులో ముందుంటారని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటారు. అంతేకాదు ఈ తీర్ధాన్ని సేవిస్తే సంగీతం, కవిత్వం, రచన వ్యాసంగం వంటి కళల్లో కూడా నిష్ణాతులు అవుతారని స్థానికులు చెబుతారు.

విల్లుకడితే కోరికలు తీరుతాయి
కమండల గణపతి ఆలయంలో యోగ ముద్రలో ఉన్న గణనాథుని దర్శించి, సేవించి భక్తితో విల్లు కడితే కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వాసం. ఈ ఆలయానికి 18 కి.మీ. దూరంగా ఉన్న మృగవధేలో పార్వతీదేవి స్నానం చేసినట్లుగా చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చే భక్తులు మృగవధే ప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కొంతసేపు ధ్యానం చేసుకోవడం వలన మనశ్శాంతి పొందుతారు.

పూజోత్సవాలు
కమండల గణపతి ఆలయంలో ప్రతిరోజూ ఉదయాన్నే గణపతికి అభిషేకం, అర్చనలు జరుగుతాయి. అయితే ఆలయ సంప్రదాయం ప్రకారం ఇక్కడ ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రత్యేక పూజలు జరుగుతాయి, ఆ తర్వాత ఆలయాన్ని మూసి వేస్తారు. ఇక పర్వదినాల్లో, గణేష్ నవరాత్రులు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలి?
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నుంచి 359 కిలోమీటర్ల దూరంలో, చిక్ మగళూరు జిల్లాలోని కొప్ప బస్‌స్టాండ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. కమండల గణపతి దర్శనంతో శని దోషాలు తొలగుతాయని, కమండల తీర్థంతో విద్యార్థులకు జ్ఞానవృద్ధి కలుగుతుందని విశ్వాసం.

మనం కూడా కమండల గణపతిని దర్శించి సకల దోషాలు తొలిగించుకుని జ్ఞానమనే ఐశ్వర్యాన్ని పొందుదాం.

ఓం శ్రీ గణాధిపతయే నమః

హరిద్రా గణపతి అంటే ఎవరు?- 41 రోజుల పూజతో గురుగ్రహ అనుగ్రహం- సకల విఘ్నాలు తొలగుతాయా?

ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చే వినాయకుని పదహారవ రూపం- ఊర్ధ్వ గణపతిని పూజిస్తే జ్ఞానసిద్ధి, ఉన్నత పదవి!