ETV Bharat / spiritual

తిరుమల శ్రీనివాసుడు- కలియుగ ప్రత్యక్ష దైవంగా ఎందుకు అవతరించాడు?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి అవతార మహిమ ఇదే!

Tirupati Sri Venkateswara Swamy
Tirupati Sri Venkateswara Swamy (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : December 30, 2025 at 5:29 AM IST

5 Min Read
Choose ETV Bharat

Tirupati Venkateswara Swamy History : "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి" ఈ చరాచర సృష్టిలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు...శ్రీనివాసునికి సాటిరాగల దేవుడు భూత భవిష్యత్ కాలాల్లో మరొకరు ఉండరు అని ఈ శ్లోకానికి అర్థం. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుఠమని ప్రశస్తి. తిరుమల గిరిపై సాలగ్రామ శిలగా, అర్చావతార మూర్తిగా, స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుని ఏడు కొండలవాడని, శ్రీనివాసుడిని, గోవిందుడని, బాలాజీ అని రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. భక్తులు ఆర్తిగా ఏ పేరుతో పిలిచినా వెంటనే వారి కష్టాలను రూపుమాపే కొంగుబంగారం శ్రీనివాసుడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Article:
అదిగో అల్లదిగో శ్రీహరివాసము
తిరుమల గిరుల్లో శ్రీనివాసుడు వెలసి ఉన్న గర్భాలయానికి ఆనంద నిలయం అని పేరు. ఇది నిజం! ఎంతో దూరం నుంచి వచ్చి, ఏడుకొండలు నడిచి, పిల్లా పాపలతో ఎన్నో గంటలు క్యూ లైన్లలో నిల్చుని లిప్తకాలం పాటు శ్రీనివాసుని దర్శించినా తమ కష్టాలు మర్చిపోయి దివ్యానుభూతితో ఆనందాన్ని పొందే శ్రీనివాసుని నివాసస్థానం నిజంగా ఆనంద నిలయమే! మరి ఈ ఆనంద నిలయం స్థల పురాణం గురించి తెలుసుకుందాం.

స్థల పురాణం
కలియుగ దైవమైన శ్రీనివాసుడు వెలసిన దివ్య క్షేత్రాన్ని వెంకటాచలం అంటారు. స్కంద పురాణం లోని వైష్ణవ ఖండంలోని వేంకటాచల మహత్యం లోని తిరుమల చరిత్ర గురించిన వివరణ ఉంది.

భృగు మహర్షి ఆగడం
వైకుంఠానికి వెళ్లిన భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు తనను పట్టించుకోలేదన్న కోపంతో ఆయన వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. అప్పుడు విష్ణువు భృగు మహర్షిని శాంతింపజేయడానికి ఆయన పాదాలు నొక్కుతున్నట్లుగా నటిస్తూ ఆయన అరికాలిలోని కన్నును చిదిమేస్తాడు. దానితో భృగు మహర్షి అహంకారం పటా పంచలవుతుంది. విష్ణువు వక్షస్థలం లోని తన నివాస స్థానాన్ని అవమానించిన మహర్షికి విష్ణువు సేవలు చేయడం చూసి ఆగ్రహించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకం చేరుతుంది.

భూలోకం చేరిన శ్రీనివాసుడు
లక్ష్మీదేవి అన్వేషిస్తూ శ్రీనివాసుడు కూడా భూలోకానికి చేరుకుంటాడు. తిరుమల గిరుల్లో పశువుల కాపరికి ఒక పుట్టలో శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. అనంతరం ఆ ప్రాంతంలో సంచరిస్తూ వకుళమాత ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ శ్రీకృష్ణుడే తన కోసం వచ్చాడని వకుళమాత ఆనందిస్తుంది. వైకుంఠాన్ని వీడిన లక్ష్మీదేవి ఆకాశరాజుకు పద్మసరోవరంలో లభిస్తుంది. ఆమెకు పద్మావతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. తిరుమల గిరుల్లో వనవిహారానికి వెళ్లిన శ్రీనివాసుడు పద్మావతిని చూసి మోహిస్తాడు. పద్మావతి కూడా శ్రీనివాసుడే తనకు భర్త కావాలని కోరుకుంటుంది.

శ్రీనివాస కళ్యాణం
ఇరువురి మనసు గ్రహించిన వకుళమాత ఆకాశరాజు వద్దకు వెళ్లి వారితో మాట్లాడి పద్మావతి శ్రీనివాసుల కల్యాణాన్ని జరిపిస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు కొండ ఎక్కరాదన్న నియమం ఉండడం వలన పద్మావతి శ్రీనివాసులు తిరుమల కొండ కింద అగస్త్య మహర్షి ఆశ్రమంలో కొంతకాలం నివసిస్తారు. అప్పుడు శ్రీనివాసుని ఆదేశంతో ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తి కొండపై ఆలయాన్ని నిర్మిస్తాడు.

ఆలయ చరిత్ర
వక్షస్థలంలో మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిరాలు, గోపురాలు, ప్రాకారాలు, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. ఎందరో రాజులు, చక్రవర్తులు స్వామివారికి అమూల్యమైన ఆభరణాలు, భూ విరాళాలు ఇచ్చారు. స్వామివారి మహిమ కారణంగా, ఆదిశంకరులు స్వామివారి పాద పీఠం కింద ప్రతిష్టించిన శ్రీచక్రం వలన తిరుమల శ్రీనివాసునికి విపరీతమైన ధనాకర్షణ ఉంది. శ్రీనివాసుడు పద్మావతితో తన కళ్యాణం సమయంలో కుబేరుని వద్ద కొంత ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఈ రోజుకి ఆ అప్పుకు వడ్డీ మాత్రమే కడుతున్నాడు కానీ అసలు తీర్చలేదని వేంకటాచల మహత్యంలో వివరించి ఉంది.

అపారమైన ఐశ్వర్యం
తిరుమల శ్రీనివాసుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దైవంగా ఖ్యాతి చెందాడు. అపారమైన ధన సంపదలు, ఆభరణాలు, విలువైన రత్నాలు, మాణిక్యాలు, లెక్క లేనన్ని భూములు ఒకటా... రెండా స్వామి సంపద లెక్కించడం అసాధ్యం. మరి లక్ష్మీపతి శ్రీనివాసునికి ఐశ్వర్యం కూడా ఆభరణమే కదా!

పూజోత్సవాలు
వేంకటపతి సన్నిధి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అంటూ ఎల్లప్పుడూ నిత్యకల్యాణం పచ్చతోరణం గా భాసిల్లుతోంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రారంభించిన బ్రహ్మోత్సవాలు జరిగే వేళ తిరుమల వైభవం చూడటానికి ముక్కోటి దేవతలు కూడా భువికి దిగి వస్తారంట!

వైకుంఠ ద్వార దర్శనం
ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు, ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం మోక్షకారకమని అష్టాదశ పురాణాలు చెబుతున్నాయి. ఆనంద నిలయంలో ఈ ద్వార దర్శనం పది రోజుల పాటు జరగడం విశేషం.

దర్శనీయ స్థలాలు
వరాహ స్వామి గుడి
తిరుమల వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి. శ్రీనివాసునికి వరాహస్వామి ఇక్కడ నివసించడానికి స్థలం ఇచ్చాడని వరాహ పురాణం, వేంకటాచల మహత్యంలో వివరించి ఉంది. ఇప్పటికీ ఆ తాళపత్ర గ్రంథాలు తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఉన్న వరాహస్వామి ఆలయంలో స్వామి విగ్రహం కింద జాగ్రత్తగా భద్రపరచి ఉన్నాయి. తనకు నివాస స్థలం ఇచ్చినందుకు శ్రీనివాసుడు ప్రథమ దర్శనం వరాహ స్వామికే అని వరాన్ని ఇచ్చాడంట! ఆనాటి నుంచి ముందుగా వరాహ స్వామిని దర్శించిన తరువాతనే శ్రీనివాసుని దర్శనానికి వెళ్లాలన్న నియమం ఉంది.

స్వామి పుష్కరిణి
శ్రీ మహా విష్ణువు భూలోకానికి వచ్చే సమయంలో ఆయనతో పాటు వైకుంఠంలోని విరజా నది కూడా భూలోకానికి వచ్చి స్వామి అవసరాల కోసం పవిత్ర పుష్కరిణిగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్లడం ఆలయ సంప్రదాయం. పుష్కరిణి స్నానం కొన్ని కోట్ల జన్మల పాపాలు తొలగిస్తుందని శాస్త్రవచనం.

తిరుచానూరు
శ్రీవారి పట్టపురాణి పద్మావతి వెలసిన తిరుచానూరు తిరుపతికి 6 కి.మీల దూరంలో ఉంది. ఇవి మాత్రమే కాకుండా అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురం దర్శనీయ స్థలాలు. తిరుమల కొండ మీద శ్రీవారి శిలాతోరణం, తరిగొండ వెంగమాంబ బృందావనాన్ని కూడా దర్శించుకోవచ్చు.

నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల గిరులు నిత్యం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. ప్రతిరోజూ లక్షలాదిమంది భక్తులు దర్శించుకునే ఏకైక పుణ్యక్షేత్రం తిరుమల. ప్రతిరోజూ కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే పుణ్య క్షేత్రం కూడా తిరుమలనే!

తిరుమలలో ఇవి నిషిద్ధం
పరమ పవిత్రమైన తిరుమల కొండకు శ్రీవారి దర్శనం కోసం మాత్రమే వెళ్ళాలి తప్ప ఇతర ఉద్దేశ్యాలతో కానీ, విహారయాత్ర కోసం కానీ తిరుమలకు వెళ్ళరాదు. తిరుమల లో ఉన్నంత సేపు నిరంతరం గోవింద నామం ఉచ్ఛరిస్తూనే ఉండాలి. పవిత్ర తిరుమలలో పాదరక్షలు ధరించరాదు. మద్య మాంసాలు తీసుకోకూడదు. తిరుమల లో బ్రహ్మచర్యం పాటించడం తప్పనిసరి. తిరుమలలో లభించే పువ్వులన్ని శ్రీవారి కోసమే! అందుకే తిరుమల లో మహిళలు తలలో పువ్వులు ధరించరాదు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులేవీ చేయరాదు.

శ్రీనివాసుడు మన దేవుడు.... మనందరి దేవుడు....దేవ దేవుడైన ఆ ఏడుకొండలవాడిని ఉత్తర ద్వారం నుంచి దర్శించడం పూర్వజన్మ సుకృతం.....మోక్ష కారకం!

ఏడుకొండలవాడా.... వేంకట రమణా.... గోవిందా... గోవిందా!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం