ETV Bharat / spiritual

వనవాసం కోసం శ్రీరాముడు చిత్రకూట పర్వతాన్నే ఎందుకు ఎంచుకున్నాడు?

శ్రీరాముని వనవాసం- చిత్రకూట పర్వత విశేషాలు ఇవే!

Lord Rama
Lord Rama (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 6, 2026 at 5:00 AM IST

3 Min Read
Choose ETV Bharat

Why Did Lord Rama Choose Chitrakoot : దుష్ట శిక్షణ కోసం శ్రీ మహా విష్ణువు ధరించిన పరిపూర్ణ మానవావతారం శ్రీరామావతారం. దశరథ మహారాజు జ్యేష్ఠ పుత్రుడుగా ఇక్ష్వాకు వంశ తిలకునిగా జన్మించిన శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసాడు. వనవాసం సమయంలో సీతారామలక్ష్మణులు సంచరించిన అనేక ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. వాటిలో ఒక ప్రదేశమే చిత్రకూటం. ఈ కథనంలో పరమ పవిత్రమైన చిత్రకూట పర్వతంపై వెలసిన పుణ్య క్షేత్రాలు, పవిత్ర తీర్థాలు గురించి తెలుసుకుందాం.

చిత్రకూటం ఎక్కడుంది?
చిత్రకూటం అనేది ఒక పర్వతం. చిత్రకూట్ ప్రాంతంలో.. ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చిత్రకూట్ రామాయణ కాలంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు వనవాసం చేసిన పవిత్ర ప్రదేశం. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది. చిత్రకూట్ పర్వత ప్రాంతం రామాయణానికి సంబంధించిన అనేక సంఘటనలతో ముడిపడి ఉండటం విశేషం.

చిత్రకూట్ విశిష్టత
చిత్రకూట్ పర్వత ప్రాంతంలోని కొండ గుహలన్నీ రామనామ జపంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. పేరుకు ఒక్కటే పర్వత ప్రాంతమైనప్పటికీ ఇక్కడ దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి.

అలరించే ప్రకృతి సౌందర్యం
పచ్చటి కొండలు, ఆ కొండల మీద ఏపుగా పెరిగిన చెట్లు, వాటి మధ్య కంటికి కనిపించకుండా చెవులకు మాత్రమే వినిపించే గుప్త గోదావరి, గల గల పారే మందాకినీ నది పర్యాటకులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

శ్రీరాముని పాద ధూళితో పవిత్రమైన చిత్రకూట్
పితృవాక్య పరిపాలన కోసం పరమ పావనుడైన శ్రీరామ చంద్రుడు, తన భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి 14 ఏళ్ల వనవాసం చేసే సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నాడు. దీంతో ఆ పరమ పావనుడైన శ్రీరామచంద్రుడి పాదధూళిని తనలో నిక్షిప్తం చేసుకున్న చిత్రకూటం పర్యాటక ప్రదేశంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. చిత్రకూట్ లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక దర్శనీయ ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

రామ్​ఘాట్ - జానకి కుండ్
మందాకినీ నది ఒడ్డున ఉన్న రామ్ ఘాట్ ఒడ్డునే శ్రీరాముడు ప్రతి రోజూ స్నానం చేసేవాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడ రామలక్ష్మణులు స్నానం చేసే సన్నివేశాలను తులసీదాస్ తన మనోనేత్రాలతో దర్శించాడని చెబుతారు. ఈ వివరాలన్నింటినీ తులసీ దాస్ తన రామచరిత మానస్ లో ప్రత్యేకంగా పేర్కొన్నాడు. రామ్ ఘాట్ కు కొద్ది దూరంలోనే సీతాదేవి స్నానం చేసిన జానకి కుండ్ ను కూడా దర్శించుకోవచ్చు.

భరత్ మిలాప్
శ్రీరాముడు చిత్రకూటంలో ఉన్నాడని తెలుసుకుని భరతుడు లక్షలాదిమంది సైనికులతో కలిసి వచ్చి శ్రీరాముని కలుసుకున్న ప్రాంతాన్ని భరత్ మిలాప్ అంటారు. రాముడు తన వనవాస దీక్షను వదలనని చెప్పడంతో భరతుడు రాముని పాదుకలను తీసుకొని అయోధ్యకు తిరిగి వెళ్లి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి రాజ్యపాలన గావిస్తాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడ భరతుడికి కట్టిన చిన్న గుడిని కూడా దర్శించుకోవచ్చు.

హనుమాన్ ధార
చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల మీటర్ల ఎత్తులో హనుమాన్ ధార ఉంటుంది. దాదాపు రెండువేల మెట్లను ఎక్కి పైకి చేరుకుంటే ఇక్కడ ఒక పెద్ద హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని నిత్యం ఒక నీటి ధార అభిషేకిస్తూ ఉంటుంది. ఆ జలం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం ఇప్పటికీ చేధించలేని రహస్యంగానే మిగిలిపోయింది. అర్చకులు భక్తులకు ఆ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఈ తీర్థాన్ని స్వీకరిస్తే భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని విశ్వాసం.

రామ శయ్య
సీతారాములు శయనించడానికి వీలుగా ఒక పెద్ద చెట్టు నీడన గల సమతలమైన రాతి ప్రదేశాన్ని శయ్యలా వాడుకొన్నారు. దీనినే రామ శయ్య అని అంటారు. ఇక సీతారాములు కుర్చొన్న ఒక శిలను కూడా దర్శించవచ్చు. ఈ శిలపై ఇప్పటికీ సీతారాముల పాదముద్రలు మెరుస్తూ కనిపిస్తాయి. అయితే మెరుపునకు కారణం ఈనాటికి అంతుచిక్కలేదు.

అమావాస్య ఉత్సవం
చిత్రకూటంలో ప్రతి అమావాస్యకు పెద్ద ఉత్సవం జరుగుతుంది. ముఖ్యంగా దీపావళి రోజున జరిగే దీపోత్సవానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. మనం కూడా చిత్రకూట పర్వతానికి వెళ్లి సీతారాముల ఉనికిని తెలిపే ప్రదేశాలు సందర్శిద్దాం. ఆధ్యాత్మిక అనుభూతిని పొందుదాం. జైశ్రీరామ్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.