ETV Bharat / spiritual

ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు? ఆగస్టు 21 లేదా 28నా? పండితులు ఏం చెబుతున్నారు?

శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడంతో ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం తేదీపై భక్తుల్లో సందిగ్ధత- పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం, రెండో శుక్రవారం అనే సంప్రదాయాల నేపథ్యంలో వ్రతం తేదీపై అస్పష్టత

Varalakshmi Vratham 2026 Date
Varalakshmi Vratham 2026 Date (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : August 6, 2026 at 2:11 AM IST

3 Min Read
Choose ETV Bharat

Varalakshmi Vratham 2026 Date : పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో సిరులు కురిపించే వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు తప్పకుండా ఆచరిస్తారు. సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయం. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు ఆచరించాలి అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు వరలక్ష్మీ వ్రతం గురించి శాస్త్రం ఏమి చెబుతోంది? ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? పండితులు ఏమి చెబుతున్నారు? తదితర ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వరలక్ష్మీ వ్రతం విశిష్టత
ఏడాది మొత్తం మహిళలు ఎదురు చూసే వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలోనే వస్తుంది. ఈ సందర్భంగా మహిళలు వరాలు ప్రసాదించే వరలక్ష్మీదేవిని కలశంలో ఆవాహన చేసి, షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామ పూజలు, తోరపూజ, ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడం, తాంబూలదానం మొదలైన కార్యక్రమాలతో ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. కుటుంబ అభివృద్ధి, సుమంగళితనం, సంతాభివృద్ధి, సిరిసంపదలు, యోగక్షేమాల కోసం సుమంగళి స్త్రీలు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం తేదీపై కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఏ రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి? పండితులు ఏమి చెబుతున్నారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

పౌర్ణమి ముందు శుక్రవారం
తెలుగు పంచాంగం ప్రకారం సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని స్కంద పురాణంలో వివరించి ఉంది. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం వల్ల వరలక్ష్మీ వ్రతం విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది.

రెండో శుక్రవారమా! పౌర్ణమి ముందు శుక్రవారమా!
ఆగస్టు 21, శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం. సాధారణంగా ఎవరైనా ఈ రోజునే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఆగస్టు 28, పౌర్ణమి తిథి, శ్రావణ మాసం మూడో శుక్రవారం రెండూ కలిసి రావడం వల్ల ఈ గందరగోళం ఏర్పడింది. పౌర్ణమికి ముందు శుక్రవారం అయినా పౌర్ణమితో కూడిన శుక్రవారం అయిన ఒకటే అని శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 28 నే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది ప్రత్యేకం
శ్రీ వరలక్ష్మీ వ్రత నిర్ణయంలో ఈ ఏడాది కొంత ప్రత్యేకత ఉంది. శ్రావణ పొర్ణమి తిథి శుక్రవారాన్ని స్పృశించడం వల్ల ధర్మనిర్ణయంలో పేర్కొన్న 'నోపాంతే భార్గవాదినే' అనే నియమం ప్రకారం పూర్ణిమ తిథి వచ్చిన శుక్రవారం రోజునే వరలక్ష్మీ వ్రతం ఆచరించవచ్చనే నియమం వర్తిస్తుంది. ఆ ప్రకారంగా చూస్తే ఆగస్టు 28 నే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పంచాంగ కర్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.

శృంగేరి పీఠంలో ఇలా
శృంగేరి శ్రీ శారదా పీఠం సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రధాన పూజలు, వ్రతం సాయంకాలం ఆచరిస్తారు. అయితే ఆగస్టు 28 న పూర్ణిమ తిథి సాయంత్రానికి లేనందున ఈ సంప్రదాయాన్ని అనుసరించి సాయంకాలం వ్రతం ఆచరించే వారు ఆగస్టు 21, రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు మాత్రం ఆగస్టు 28, మూడో శుక్రవారం రోజునే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పండితులు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా ఈ సంవత్సరం రెండు ఆచరణ విధానాలు ఉండడం వలన కొంత ప్రత్యేకత నెలకొంది.

అన్ని శుక్రవారాలు ఆచరణ యోగ్యమే!
అయితే ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా వరలక్ష్మీ వ్రతం నోచుకోవడం శాస్త్ర సమ్మతమే! కాబట్టి అనవసర గందరగోళాలు, భయాలు పక్కన పెట్టి మనకు వీలు కుదిరిన శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిద్దాం. భక్తితో చేసే పూజలు స్వీకరించడానికి, వరాలు కురిపించడానికి ఆ సిరుల తల్లి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కావాల్సిందల్లా నిర్మలమైన భక్తిశ్రద్ధలు మాత్రమే!

మనం కూడా ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతాన్ని పండితులు, పంచాంగ కర్తలు చెప్పిన సూచనలు పాటిస్తూ జరుపుకుందాం. ఆ శ్రీలక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిసంపదలు పొందుదాం.

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

అరుణాచలంలో మోక్ష మార్గం- ఇడుక్కు పిళ్లైయార్ గుహలో నుంచి వెళ్తే పాపాలు తొలగిపోతాయని ఎందుకు నమ్ముతారు?

పుత్ర దోషాలను తొలగించే దొడ్డమల్లూరు నవనీత కృష్ణుడు- భక్తుడి కోసం తలతిప్పిన బాలకృష్ణుడి ఆలయం ఇదే!