ETV Bharat / spiritual

కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం- ఏయే రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

మార్చి 3న ఏర్పడనున్న కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఎంతసేపు కనిపిస్తుంది ఏ రాశులకు శుభం? ఎవరు పరిహారం చేయాలి?

Kethu Graha Chandra Grahanam
Kethu Graha Chandra Grahanam (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 4:00 AM IST

3 Min Read
Choose ETV Bharat

Kethu Graha Chandra Grahanam : తెలుగు పంచాంగం ప్రకారం మార్చి 3, మంగళవారం కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. దృక్ సిద్ధాంత పంచాంగం ప్రకారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి, మార్చి 3 మంగళవారం రోజు సింహ రాశిలో పుబ్బ నక్షత్రంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపించనుంది. ఈ సందర్భంగా ఈ పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో ఎంత సమయం పాటు కనిపించనుంది? ఈ రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏయే రాశుల వారు గ్రహణం చూడకూడదు? తదితర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పండితులు ఏమి చెబుతున్నారు?
మార్చి 3 వ తేదీ ఏర్పడనుంది పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ సాధారణంగా గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలని తప్పకుండా పాటించాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. మన దేశంలో గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి చంద్రోదయం కాదు. కానీ గ్రహణం విడుపు సమయానికి చంద్రోదయం అవుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని అంటారు.

చంద్రగ్రహణ ప్రారంభ, ముగింపు సమయాలు
మార్చి 3 న మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం అవువుతుంది. తిరిగి సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణ కాలం మొత్తం 3 గంటల 27 నిమిషాలు. పేరుకు ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ మన దేశంలో చంద్రోదయం అయ్యాక ఈ గ్రహణం అనేక ప్రాంతాల్లో 25 నుంచి 40 నిమిషాల పాటు మాత్రమే కనిపించనుంది. అయితే గ్రహణం కనబడేది ఎక్కువగా ఈశాన్య భారతంలో మాత్రమే!

ప్రధాన ఆలయాలు మూసివేత!
కొంతసేపు కనిపించినప్పటికీ గ్రహణ కాల నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఇతర ప్రధాన ఆలయాలు కూడా గ్రహణకాలంలో మూసివేయబడతాయి. గ్రహణ కాలంలో మూసి ఉన్న ఆలయాలు శుద్ధి తరువాత తిరిగి రాత్రికి తెరుచుకుంటాయి.

గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి?
సనాతన ధర్మం పాటించే గృహస్థులు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరాదు. భోజన కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 12 గంటల వరకు ముగించుకోవడం మంచిది. ఇంట్లో నిల్వ ఉన్న ఊరగాయలు, పచ్చళ్ల మీద దర్భలు ఉంచాలి. గ్రహణానికి ముందు, గ్రహణం తరువాత పట్టు, విడుపు స్నానాలు ఆచరించాలి. గ్రహణం విడిచే సమయంలో సముద్ర స్నానం కానీ, నదీస్నానం కానీ చేయడం సర్వ శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. రాత్రి 7:30 తరువాత విడుపు స్నానం చేసి, దైవారాధన చేసుకుని ఆహారాన్ని స్వీకరించవచ్చు.

ఏయే రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు?
ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడనుంది కాబట్టి సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్రకిరణాలు సోకని ప్రదేశంలో ఉండటం మంచిది.

గ్రహణ పరిహారం ఎలా?
రానున్నది పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి సింహరాశి, కర్కాటక రాశి, మకర రాశి, కుంభ రాశి వారు గ్రహణం మరుసటి రోజు ఆలయానికి వెళ్లి తెల్లని వస్త్రాలపై బియ్యం పోసి దానిపై రజిత చంద్రబింబాన్ని ఉంచి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి దానం ఇవ్వడం మంచిది. మిగిలిన రాశుల వారికి ఈ గ్రహణం వల్ల మధ్యమ, శుభ ఫలితాలు ఉంటాయి.

దైవారాధన
సాధారణంగా గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఈ పుణ్యకాలంలో దుర్గాదేవిని స్మరించడం, పంచాక్షరీ మంత్ర జపం చేయడం విశేషమైన పుణ్యఫలాన్ని అందిస్తాయి. కాబట్టి గ్రహణం అంటే భయపడకుండా దైవారాధనతో శుభ ఫలితాలను పొందవచ్చు.
శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.