"జాతకం" ఎప్పుడు చూపించుకోవాలి? - ఇదే సరైన సమయం అంటున్న జ్యోతిష్యులు!
'జాతకం' అంటే ఏమిటి? - ఎప్పుడు చూపించుకుంటే మంచిదో వివరిస్తున్న పండితులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 29, 2026 at 2:37 PM IST
When to Check Your Horoscope : భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి దాదాపు అందరిలోనూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది జ్యోతిష్యశాస్త్రాన్ని బలంగా నమ్ముతుంటారు. తమ జీవితంలో జరగబోయే మంచి చెడులను గురించి తెలుసుకుని, ఏవైనా గ్రహ దోషాలుంటే పరిహారాలు చేయించుకోవడం కోసం జ్యోతిష్యులను ఆశ్రయిస్తుంటారు. అయితే, కచ్చితమైన ఫలితాలు తెలుసుకోవాలంటే "వ్యక్తిగత జాతకం" తప్పనిసరి అని చెబుతారు పండితులు. ఇంతకీ, జాతకం అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు చూపించుకుంటే మంచిది? దీనిపై జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జాతకం అంటే ఏమిటి?
మన జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యం వంటి విషయాల గురించి తెలుసుకోడానికి జ్యోతిష్యశాస్త్ర పండితులను ఆశ్రయిస్తుంటాం. అయితే, వ్యక్తిగత జాతకం ఉంటేనే కచ్చితమైన ఫలితాలు చెప్పగలమని పండితులు అంటుంటారు. ఒక వ్యక్తి ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రం, ఏ వారంలో పుట్టాడో తెలిపి వాటి ఆధారంగా రాబోయే కాలంలో ఎలాంటి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయో తెలిపేదే "జాతకం" అని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, పంచాగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన వెంటనే పండితుల చేత జాతకాన్ని వ్రాయిస్తారు. దీనినే "జన్మకుండలి"గా చెబుతారు. అయితే, కొందరికి అలాంటి ఆనవాయితీ ఉండకపోవచ్చంటున్నారు.
"జన్మకుండలి" అంటే ఏమిటంటే?
జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి పుట్టిన తేదీ నెల, సంవత్సరంతో సహా, టైమ్, పుట్టిన ప్లేస్ వంటివి తప్పనిసరి. ఇవన్నీ కచ్చితంగా ఉంటే జాతకం కూడా కచ్చితంగా చెప్పే ఛాన్స్ ఉంటుందంటున్నారు ప్రభాకర చక్రవర్తి శర్మ. ముఖ్యంగా జనన సమయం సరిగా ఉండాలి. ఎందుకంటే, లగ్నం నిర్ణయించేందుకు ఇదే ముఖ్య ఆధారమంటున్నారు. ఈ లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధరించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.
శివలింగంపై దర్శనమిస్తున్న "వేంకటేశ్వరుడు" - ఒక్కసారి దర్శిస్తే పాపాలు తొలగిపోతాయట!
జాతకాన్ని ఎప్పుడు చూపించాలంటే?
మనిషి జీవితంలో రోజూ జాతకాన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు. అయితే, నాలుగు సందర్భాల్లో మాత్రం తప్పకుండా జాతకం చూపించుకుంటే మంచిదంటున్నారు జ్యోతిష్యులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి. అందులో భాగంగానే తొలిసారి పుట్టగానే జాతకం చూపించుకోవాలంటున్నారు.
ఎందుకంటే?
- జన్మించగానే మొదటిసారి జాతకం ఎందుకు చూపించాలంటే, బాలారిష్ట లేదా జాతకంలో ఉన్న దోషాలకు శాంతుల ద్వారా మొదటి 21 రోజుల్లో లేదా తొలి ఏడాదిలోగా పరిహారాలు జరిపించుకోవడం వల్ల దోష నివృత్తి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
- ఇక రెండో సారి ఎప్పుడు చూపించుకోవాలనే విషయానికొస్తే, వివాహానికి ముందు జాతకం చూపించుకోవాలంటున్నారు జ్యోతిష్యులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి. పెళ్లికి ముందు మీకు తెలిసిన జ్యోతిషుడి వద్ద జాతకాలు చూపించుకున్న వారికి సత్ఫలితాలుంటాయని చెబుతున్నారు.
- మూడోది ఎప్పుడంటే, మన జీవితంలో కష్టం ఎదురైనప్పుడో, ఏదైనా జాబ్, వైవాహిక, సంతాన, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయనిపించినప్పుడూ జాతకం చూపించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చెబుతోంది శాస్త్రం.
- ఇక జాతకం చూపించుకోవాల్సిన నాలుగో సందర్భం విషయానికొస్తే, ఏదైనా శుభకార్యం (ఉదా: ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, వివాహం వంటివి) ఆచరించేటప్పుడు జాతకం చూపించుకోవాలని చెబుతున్నారు పంచాగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
గుడిలో "ధ్వజస్తంభం" ఎందుకు ప్రతిష్ఠిస్తారు? - దీని వెనుకున్న అసలు రహస్యమిదే!

