"మహా శివరాత్రి" రోజున ఏం చేయాలి? - ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?
ఉపవాసం, జాగారం ఎలా చేయాలి? - జ్యోతిష, వేద పండితులు ఏం చెప్తున్నారంటే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 12:46 PM IST
Maha Shivaratri 2026 : శివరాత్రి వచ్చేసింది. అసలు శివరాత్రి అంటే ఏమిటి? ఆ రోజున ఏం చేయాలి? అనేది చాలా మందికి తెలియదు. కేవలం గుడికి వెళ్లి దర్శించుకుని, ఉపవాసం, జాగరణ చేయడమే శివరాత్రి అనుకుంటుంటారు. కానీ, ఆ రోజున ఏం చేయాలో తెలుసా?
"మహా శివరాత్రి" ఏ శివలింగానికి పూజచేస్తే ఎలాంటి ఫలితం? - జ్యోతిషులు చెప్తున్నదిదే!
ఈ సకల చరాచర జగత్తుకు లయకారకుడైన ఆ పరమేశ్వరుడు భక్తుల పాలిట పెన్నిధి. భోళా శంకరుడైన శివుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహా శివరాత్రి. మనసా, వాచా ఆ పరమేశ్వరుడిని స్మరిస్తూ రాత్రంతా జాగరణలో దైవ సన్నిధిని అనుభూతి చెందడమే మహాశివరాత్రి పరమార్థం. మహాశివుడుకి భక్తులపై ఎంతో ప్రేమ. భక్తులకు శివుడంటే ఒక భరోసా, బలమైన నమ్మకం. అందుకే 'హరహర మహాదేవ' అని స్తుతిస్తూ శివరాత్రిని జరుపుకొంటారు. ప్రతి నెలలోనూ శివరాత్రి ఉంటుంది. అయినా సరే 'తనివి తీరలేదూ' అంటూ వీటన్నింటిలో అత్యంత విశిష్టమైనదిగా ఈ మహా శివరాత్రిని జరుపుకొంటారు. అలాంటి మహాశివరాత్రి ఫిబ్రవరి 15న వచ్చేసింది. ఈ రోజు ప్రత్యేకత, ఈ పర్వదినాన ఏ నియమాలు ఆచరిస్తే, ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందనే విషయాలను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు వర్ణించారు. పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఎలా వివరించారో తెలుసుకుందాం.
మహా శివరాత్రి ఆదివారం రావడం ఎంతో విశేషం అని పండితులు చెప్తున్నారు. 'అఘము' అంటే పాపం, 'మాఘం' అంటే పాపాలను నశింపజేసేదని అర్థం. అలాంటి మాఘ మాసంలో సూర్యారాధన ఎంతో విశేషమైనదని, సూర్యసంబంధిత ఆదివారం, మాఘ మాసంలో మహా శివరాత్రి రావడం విశేషం అని వివరించారు. సూర్యుడికి రుద్రుడు అధి దేవత, అలాంటి మాఘపు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సూర్యారాధన, శివారాధన కలిపి ఆచరించడం వల్ల పాపాలు తొలగుతాయని పేర్కొన్నారు.
ఏ నియమాలు ఆచరించాలి?
మహా శివరాత్రి కేవలం పర్వదినం మాత్రమే కాదు! ఆత్మజాగరణకు దారి చూపే పవిత్రమైన ఈ రోజు మనిషి బాహ్య ప్రపంచాన్ని విడిచి తన అంతరంగంలో ఉన్న శివతత్త్వాన్ని గ్రహించాలి. సాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు సేవించిన రోజు కూడా ఇదే, అందుకే నీలకంఠుడు అనికూడా అంటారు. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ చేయాలి.
పరమశివుడు జ్యోతిర్లింగమై ఆవిర్భవించిన పవిత్ర ఘట్టమైన లింగోద్భవం, హిమవంతుడి కుమార్తె పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్న గొప్ప రోజు కూడా ఇదే కావడం విశేషం. అందుకే అత్యంత పవిత్రమైన ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని పరిశుభ్రం చేసుకోవడంతో పాటు తలస్నానం చేసి శివాలయాన్ని సందర్శించాలి. ఉపవాసం అంటే అంతఃశక్తిని జాగృతం చేస్తూ శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం అని అర్థం. అంతేగానీ, అన్నం మానేసి కాలక్షేపానికి సినిమాలు చూడడం పాటలకు డ్యాన్సులు చేస్తూ మెలకువగా ఉండటం జాగరణ కాదని గుర్తుంచుకోవాలి. శివరాత్రి ఉదయం, ప్రదోష కాలంలో, రాత్రి సమయంలో మరీ ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలం (అర్ధరాత్రి 11.30 నుంచి 12.30 మధ్య)లో శివారాధన చేయడం శుభకరం.
"విష్ణుహు అలంకార ప్రియః శివః అభిషేక ప్రియః" అని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. శివరాత్రి రోజు ఇంట్లో కుడిచేతి బొటనవేలిని మించకుండా ఉన్న శివలింగానికి పంచామృతాలు, చందనం, విభూతి, గంగా జలంతో అభిషేకం జరిపించాలి. బిల్వ దళాలు సమర్పించి అర్చన చేయాలి.
దోష నివారణలు- ఫలితాలు
ఆదివారం మహాశివరాత్రి రావడం వల్ల ఈ రోజు ఎంతో ప్రత్యకమైనదని పండితులు చెప్తున్నారు. శివారాధన చేసినవారికి అనారోగ్య సమస్యలు తొలగడంతో పాటు పితృదేవతలు తరిస్తారని పేర్కొన్నారు. ఆరోగ్యం, ఆయుష్షు, యశస్సు, కీర్తి, విజయాలు దక్కుతాయని, నవగ్రహాలకు నాయకుడైన సూర్యుడిని ఆరాధించడంతో పాటు శివారాధన చేసిన వారికి శత్రుపీడ, గ్రహ బాధలు తొలగి శుభాలు కలుగుతాయని వెల్లడిస్తున్నారు. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, ఓం నమఃశివాయ మంత్ర జపం, రుద్రాభిషేకం, బిల్వార్చనతో పాటు దానం వంటివి చేస్తే పాపాలు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సౌఖ్యం, మానసిక ప్రశాంతత, మోక్ష ప్రాప్తి కలుగుతాయని పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
తిరుమల శంఖనిధి, పద్మనిధి- ఒక్కసారి దర్శిస్తే ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు వృద్ధిచెందడం ఖాయం!
ఉత్తరాఖండ్ రక్షక దేవత- రోజులోనే 3 రూపాలు మార్చుకునే అమ్మవారు- ధారి దేవి రహస్యమిదే!

