ETV Bharat / spiritual

బుధ గ్రహం అనుకూలంగా ఉంటే ఏం జరుగుతుంది? దోష నివారణకు శాస్త్రం చెప్పిన పరిహారాలు ఇవే!

వేద జ్యోతిషశాస్త్రంలో బుద్ధి, విద్య, వాక్చాతుర్యం, వ్యాపారానికి కారకుడిగా బుధ గ్రహం- బుధ గ్రహం శుభ, అశుభ ఫలితాలు, దోష నివారణకు శాస్త్రం సూచించిన పరిహారాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Budha Graha Dosha Remedies
Budha Graha Dosha Remedies (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 22, 2026 at 2:27 AM IST

3 Min Read
Choose ETV Bharat

Budha Graha Effects and Remedies: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో బుధ గ్రహాన్ని శుభ గ్రహంగా భావిస్తారు. బుధుడు బుద్ధి, కమ్యూనికేషన్, వ్యాపారం, గణితానికి కారకుడు. శివుని అంశతో జన్మించిన బుధుని నవగ్రహాలలో యువరాజుగా వ్యవహరిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో బుధుడు బలంగా ఉంటే, ఆ వ్యక్తి చదువులో రాణించి, గొప్ప వ్యాపారవేత్తలు లేదా వక్తలుగా ఎదుగుతారు. జాతకరీత్యా బుధుడు బలహీనంగా ఉంటే ఏకాగ్రత లోపించడం, చర్మ సమస్యలతో ఇబ్బంది పడడం, వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కథనంలో జాతకరీత్యా బుధుడు అనుకూలంగా ఉంటే ఏమి జరుగుతుంది? ప్రతికూలత వలన ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? వీటిని ఎలా అధిగమించవచ్చు అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

బుధ గ్రహాధిపతి జాతకులు ఎలా ఉంటారంటే!
ఖగోళ శాస్త్రం ప్రకారం బుధుడు సౌర కుటుంబంలో సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే చిన్న గ్రహం. ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం, వ్యాపారం, విద్య, నాడీ వ్యవస్థకు బుధుడు అధిపతి. బుధుడు శుభ గ్రహం కాబట్టి బుధుడు అనుకూలత ఉన్నవారికి అపారమైన దూరదృష్టి ఉంటుంది. అనగా ఏ పని తలపెట్టినా రాబోయే ఆటంకాలను ముందుచూపుతో గ్రహించి జాగ్రత్త వహించగల నేర్పరితనం ఉంటుంది. సహజంగా కన్యారాశి జాతకులకు బుధుడు అధిపతి. ఇలా బుధగ్రహం అధిపతి ఉన్న జాతకులు గణితం, జ్యోతిష్యం, వ్యాపారం, వైద్యం, మంత్రం, యంత్రం, దూరదృష్టి, చమత్కార సంభాషణలు చేయగలిగి వారై, శివ భక్తి పరాయణులై ఉంటారు.

బుధుడు అనుకూలంగా ఉంటే?
జాతకరీత్యా బుధుడు అనుకూలంగా ఉంటే రాబోయే ఆపదలు ముందుగా గుర్తించి, తప్పించుకోగలిగిన సమర్ధవంతులై ఉంటారు. అంతేకాదు అకస్మాత్తుగా కలిగే ఆపదల నుంచి బయటపడగల నేర్పరితనం కూడా ఉంటుంది. బుధ గ్రహం అనుకూలంగా ఉంటే గణితంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అంతేకాదు నలుగురికి ఉపయోగపడేలా గణితంలో పరిశోధనలు చేసి నూతన విషయాలు అన్వేషించి అందరి ప్రశంసలు అందుకుంటారు.

బుద్ధిబలాన్ని పెంచే వినాయకుడు
బుధ గ్రహానికి అధిపతి వినాయకుడు. వినాయకుడు జ్ఞానానికి, బుద్ధికి ప్రతీక! అందుకే బుధగ్రహం అనుకూలత ఉన్న జాతకులు జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. వ్యాపారంలో చక్కగా రాణిస్తారు. వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతులు అవుతారు. మంచి వాక్చాతుర్యంతో, సౌమ్య సంభాషణలతో శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగల సమర్థులు.

బుధ గ్రహం ప్రతికూలంగా ఉంటే?
జాతకరీత్యా బుధ గ్రహం ప్రతికూలంగా ఉంటే మందబుద్ధి కలిగి ఉంటారు. చదువులు వెనుకబడి ఉండడం, పరీక్షలంటే భయం కలిగి ఉంటారు. తేలికగా మోసపోతారు. వ్యాపారంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి ఉండదు. ఏ వ్యాపారంలో చేసినా నష్టాలే ఎదురవుతాయి. డబ్బు వృథాగా ఖర్చవుతుంది. అనారోగ్య సమస్యలు సుదీర్ఘకాలం వేధిస్తాయి.

బుధ గ్రహ దోష పరిహారాలు
బుధ దోష నివారణకు జ్యోతిష్య శాస్త్రంలో సూచించిన కొన్ని ముఖ్యమైన పరిహారాలు గురించి తెలుసుకుందాం.

  • జాతకంలో బుధ గ్రహం అనుకూలంగా లేనప్పుడు నివారణ కోసం ప్రతి బుధవారం శ్రీమహావిష్ణువును ఆరాధించడం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
  • బుధ గ్రహ దోష నివారణ కోసం నానబెట్టిన పెసరపప్పును ఆవుకు తినిపించడం, లేదా పేదలకు పెసలతో చేసిన వంటకాలు దానం చేయడం మంచిది.
  • బుధవారం నాడు మొలకెత్తిన పచ్చటి పెసలు, ఆకుపచ్చని వస్త్రాలు, ఆకుకూరలు దానం చేయడం వల్ల బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయి.
  • ప్రతి బుధవారం ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
  • బుధ గ్రహానికి, బుధవారానికి అధిపతి గణపతి కాబట్టి బుధవారం రోజు మరకతం అంటే పచ్చ రత్నంతో తయారు చేసిన గణపతిని గరికతో పూజించి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి.
  • వినాయకునికి బుధవారం గరిక సమర్పించడం వలన బుద్ధిమాంద్యం తొలగి తెలివితేటలు వృద్ధి చెందుతాయి.

జాతకరీత్యా బుధుడు అనుకూలంగా లేనప్పుడు శాస్త్రం సూచించిన ఈ పరిహారాలు పాటించడం వలన సుఖమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

పవర్​ఫుల్​ శివక్షేత్రం- ఒక్కసారి పూజ చేస్తే రాహు, కేతువులు దోషాలు పోవడం- సంతానం కలగడం ఖాయం!

శనివారం హనుమంతుడిని ఎందుకు పూజించాలి? శని బాధలు తొలగించే శనివార వ్రతం విశిష్టత ఇదే!