ఆ రాశివారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని సవాళ్లు- ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు!
2026 జనవరి 11వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Published : January 11, 2026 at 12:05 AM IST
Weekly Horoscope From 11th January 2026 To 17th January 2026 : జనవరి 11వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం గొప్ప అభ్యున్నతి ఉంటుంది. ఉన్నత పదవులు పొందుతారు. అధికార పరిధి విస్తరిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిణామాలు మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఉపయోగపడతాయి. వ్యాపారులకు ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తూ భాగస్వాములతో కలిసికట్టుగా పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. ఈ వారం ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురవుతుంది. కుటుంబం వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా జీవిత భాగస్వామితో సంయమనంతో వ్యవహరించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ వారం కొంత ఒత్తిడితో కూడి ఉంటుంది. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటే విజయం తప్పకుండా వరిస్తుంది. ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. శివ సహస్రనామాలు చదువుకుంటే శుభం జరుగుతుంది.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఇది అద్భుతమైన సమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం. కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఈ పరిచయాలు వృత్తిపరమైన ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. పదోన్నతులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. రుణభారం తొలగుతుంది. ఖర్చులు తెలివిగా నిర్వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో స్పష్టత నెలకొంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబంలో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. విద్యార్థులు విజయం సాధించాలంటే ఏకాగ్రత, అదనపు కృషి అవసరం. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. వ్యాపారులు చక్కగా రాణిస్తారు. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు, జీతాల పెంపుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. స్థానచలనం సూచన కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడం వలన ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది, దంపతుల మధ్య బంధం బలోపేతం అవుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. అయితే భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. పనిప్రదేశంలో సముచిత స్థానం లభించక నిరాశ చెందుతారు. అధికారుల మెప్పు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థికంగా సానుకూలత ఉంటుంది. అవసరానికి సరిపడా ధనం అందుబాటులో ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీ ముఖ్యం. కుటుంబంలో ఘర్షణలు కలహాలు రాకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల పట్ల గౌరవభావంతో ఉండడం అవసరం. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు తమ కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మీ ఆరోగ్యంతో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. అన్ని రకాల వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. వ్యాపారం విస్తరించి గొప్ప విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. పదోన్నతులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. వృత్తి పరంగా మీరు సాధించిన విజయాలు కెరీర్‌లో ఎదుగుదలకు దోహదపడుతుంది. ఐటీ, మెకానికల్, ఇంజనీరింగ్ రంగాల వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ధన ప్రవాహం బాగుంటుంది. పాత పెట్టుబడుల నుంచి కూడా లాభాలు అందుతాయి. వారసత్వపు ఆస్తుల ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా అవగాహనతో సర్దుకుంటాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు చదువులో రాణించడానికి మరింత కష్టపడాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా మధ్యమ ఫలితాలు ఉండవచ్చు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు, కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు చికాకు పెడతాయి. అందరినీ కలుపుకుని ముందుకు పోవడం వల్ల ఆటంకాలు అధిగమించవచ్చు. అధికారులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఆదాయం బాగున్నప్పటికీ, దైనందిన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో మోసపోకుండా ఆచి తూచి అడుగేయాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులు అజాగ్రత్త వల్ల చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది కాబట్టి మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో నెలకొన్న పోటీ కారణంగా లాభాలు కూడా తగ్గవచ్చు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. పట్టుదల, ఏకాగ్రతతో మంచి గుర్తింపు లభిస్తుంది. స్వస్థానప్రాప్తి ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అవసరాల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. ప్రేమ బంధాల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థులు చదువుపై పూర్తిగా దృష్టి సారించాలి. పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే ప్రమాదం ఉన్నందున ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో విజయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. చక్కని ప్రణాళికతో, ముందుచూపుతో లాభాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ పెంచాలి. అనవసర విషయాల్లో, ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చడం మంచిపని కాదు. ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున, ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులు నియంత్రించుకోవాలి. ప్రేమ బంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది. విద్యార్థులు కృషికి తగిన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఊహించని సవాళ్లు ఎదురు కావచ్చు. వ్యాపారంలో అనేక హెచ్చుతగ్గులు ఉంటాయి. పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదం ఉండవచ్చు. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ డబ్బు రాకలో అడ్డంకులు ఉండవచ్చు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు చోటుచేసుకోవచ్చు. వైవాహిక జీవితంలో సామరస్యం కోసం చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. తోబుట్టువులతో కూడా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శ్రమతో కూడిన ఫలితాలు ఉండవచ్చు. వ్యాపారంలో ధనయోగాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎంత కష్టపడినా పనులు పూర్తి కాకపోవడంతో నిరాశ చెందుతారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రేమ వ్యహారాలు వివాహ బంధంతో బలపడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చదువులో మంచి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం కొంత సమస్యాత్మకంగా మారవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా వ్యాపారులు నూతన వ్యూహాలతో వ్యాపారాన్ని లాభాల బాటలో నడుపుతారు. ఇది వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. తీర్థ యాత్రల నిమిత్తం అధిక ఖర్చులు ఉండవచ్చు. ప్రేమ వ్యహారాల్లో సర్దుబాటు ధోరణి అవసరం. కుటుంబంలో క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చు. జీవిత భాగస్వామి సహకారంలో సమస్యలు అధిగమిస్తారు. విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శని ధ్యానంతో శుభఫలితాలుంటాయి.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారులకు శ్రేష్టమైన సమయం. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. అధిక ఆదాయాలు అందుకుంటారు. వ్యాపార నిమిత్తం చేసే దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిప్రదేశంలో ఒత్తిడి తగ్గుతుంది. మీ ప్రతిభను, సమర్ధతను అధికారులు గుర్తిస్తారు. పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది. ఆర్థికంగా ఈ వారం చాలా యోగదాయకంగా ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లి సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం హాయిగా సాగుతుంది. సంతానం పురోగతి ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రతతో చదివి విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

