ETV Bharat / spiritual

పవర్​ఫుల్​ శివక్షేత్రం- ఒక్కసారి పూజ చేస్తే రాహు, కేతువులు దోషాలు పోవడం- సంతానం కలగడం ఖాయం!

రాహు, కేతువులు ఒకే శరీరంగా దర్శనమిచ్చే మహాక్షేత్రం- ఒక్కసారి దర్శిస్తే నాగదోషాలు పోవడం తథ్యం

Rahu Ketu Doshas
Rahu Ketu Doshas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 21, 2026 at 3:00 AM IST

4 Min Read
Choose ETV Bharat

Rahu Ketu Dosha Remedies : కుటుంబంలో సంతానోత్పత్తికి, వంశవృద్దికి కలిగే ఆటంకాలను సమూలంగా తొలగించే ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం తిరుపాంబురమ్. రాహువు, కేతువు అనే ఇద్దరు నాగరాజులు ఒకే శరీరంగా కలిసి, పరమశివుని గురించి తపస్సు చేసి శాపవిమోచనం పొందిన మహా శక్తివంతమైన క్షేత్రం తిరుపాంబురమ్! ఈ మహిమాన్వితమైన క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని ఆలయం ఎక్కడుంది?
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉన్న తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని ఆలయం నాగదోష నివారణకు, వంశవృద్దికి అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్నే శ్రీ శేషపురీశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో రాహువు, కేతువు వేర్వేరుగా కాకుండా ఒకే శరీరంగా కలిసి పరమశివుడిని పూజిస్తున్న రూపంలో దర్శనమివ్వడం విశేషం. పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

స్థల పురాణం - పౌరాణిక నేపథ్యం
ఒకసారి వినాయకుడు తన తండ్రియైన పరమశివుడిని పూజిస్తుండగా, శివుని మెడలో ఆభరణంగా వెలసి ఉన్న నాగరాజు ఆ పూజ తనకే జరుగుతోందని గర్వపడింది. నాగరాజు ఆలోచనను గ్రహించిన శివుడు ఆగ్రహించి, భూలోకంలోని సర్పాలన్నీ తమ శక్తులను కోల్పోయేలా శపించాడు.

నాగదోష విముక్తి
అప్పుడు శాపవిమోచనం కోసం ఆదిశేషుడు, రాహు-కేతువులు, ఇతర ముఖ్య సర్పాలు మహాశివరాత్రి రోజున భూలోకానికి వచ్చాయి. అవి ఒకే రోజున నాలుగు ప్రసిద్ధ నాగక్షేత్రాలను దర్శించాయి. ఈ నాగశ్రేష్ఠాలన్నీ ఉదయం కుంభకోణం నాగేశ్వర ఆలయాన్ని, మధ్యాహ్నం తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయాన్ని, సాయంత్రం తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని ఆలయాన్ని దర్శించగా, చివరకు తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని ఆలయంలో వీరికి శాపవిమోచనం కలిగి శక్తులు తిరిగి వచ్చాయని పురాణం వచనం. అటు తర్వాత ఆ నాగులన్నీ రాత్రి నాగూరు నాగనాథ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించి వెనుతిరిగాయంట!

రాహు-కేతు ఏక శరీర దర్శనం
సాధారణంగా ఇతర ఆలయాలలో వెలసిన నవగ్రహాల్లో రాహువు, కేతువు విడివిడిగా దర్శనమిస్తారు. కానీ తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని ఆలయంలో రాహుకేతువులు ఇద్దరు ఒకే శరీరంగా కలిసి శివుడిని పూజిస్తున్న రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అందువల్ల జాతకంలో ఉండే ఎంతటి తీవ్రమైన నాగదోషాలైనా ఇక్కడికి వచ్చి పూజిస్తే తొలగిపోతాయని నమ్ముతారు.

వంశవృద్దిని ప్రసాదించే నాగ పూజ
ఎవరి ఇంట్లో అయినా, వంశంలో అయినా వంశం ముందుకు సాగక పోవడానికి రాహు-కేతు దోషాలు లేదా నాగదోషాలు కారణమైతే, ఈ క్షేత్రానికి వచ్చి 'నాగదోష నివారణ పూజ' చేయడం వల్ల అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

సర్పాల శరణాలయం
తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఈనాటికీ పాములు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. కానీ అవి ఎవరికీ హాని కలిగించవు. ఒకవేళ పొరపాటున మనం అత్యుత్సాహంతో ఆ పాములకు ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నిస్తే వాటి ఆత్మరక్షణ కోసం అవి కరిచినా ఆ విషం శరీరానికి ఎక్కక పోవడం ఇక్కడి విస్తుగొలిపే ఆధ్యాత్మిక వింత.

పూజా ఫలం
మనశ్శాంతి, వివాహ అడ్డంకులు తొలగిపోవడం, పుత్ర భాగ్యం, సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి కోరుకునే వారు తప్పక దర్శించాల్సిన అతి ముఖ్యమైన క్షేత్రం ఇది. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించి నాగదోష నివారణ పూజలు జరిపిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోయి, ఆ తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని అనుగ్రహంతో వంశం పచ్చగా వర్ధిల్లుతుంది.
సంతాన సౌభాగ్యం కలుగుతుంది.

కుబుసం విడిచే నాగులు
తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని ఆలయంలోని శివలింగం సన్నిధిలో కానీ, అమ్మవారి సన్నిధిలో కానీ వారానికి కనీసం మూడు సార్లు పాములు తమ కుబుసాన్ని వదిలి వెళ్తుంటాయి.

ఆలయ ప్రాంగణం సువాసన భరితం
ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో ఆలయ ప్రాంగణమంతా మల్లెపూలు లేదా మొగలి పువ్వుల సువాసనలతో పరిమళభరితంగా మారుతుంది. ఈ సమయంలో అదృశ్య రూపంలో సర్పాలు వచ్చి స్వామిని పూజిస్తాయని భక్తుల విశ్వాసం.

ఆలయ విశేషాలు
తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని క్షేత్రంలో గర్భాలయంలో శివుడు స్వయంభూ లింగంగా శ్రీ పాంబురేశ్వరుడు, శేషపురీశ్వరుడు అనే పేరుతో కొలువై ఉన్నాడు. ఇక్కడ పార్వతి దేవి శ్రీ వండార్ పూంగుజలి అమ్మన్, భ్రమరాంబిక దేవిగా దర్శనమిస్తుంది.

పవిత్ర తీర్థం - దేవతావృక్షం
తిరుపాంబురమ్ పాంబురేశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఆదిశేష తీర్థం పేరుతో పవిత్ర కోనేరు ఉంది. ఈ కోనేరులో స్నానం చేసినా, నీటిని శిరస్సున చల్లుకున్నా సర్పభయం ఉండదని విశ్వాసం. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్నజమ్మి చెట్టును ఆలయ వృక్షమని, వన్ని వృక్షం అని పిలుస్తారు.

ఎలా చేరుకోవాలి?
కుంభకోణం నుంచి కారైకాల్ చేరుకునే రోడ్డు మార్గంలో తిరుపాంబురమ్ క్షేత్రం వెలసి ఉంది. కుంభకోణం నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడానికి మెరుగైన రవాణా సదుపాయాలున్నాయి. నాగదోషాలు, కాలసర్ప దోషాలు తొలగించే అత్యంత శక్తివంతమైన ఈ క్షేత్రాన్ని మనం కూడా సందర్శించి దోషాల నుంచి విముక్తి పొందుదాం. ఓం శ్రీ నాగనాథాయ నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

చార్​ధామ్ యాత్రలో మరపురాని పుణ్యక్షేత్రం గుప్తకాశీ- శివుడు పాండవులకు దాగిన దివ్య క్షేత్రం విశిష్టత ఇదే!

నీళ్లలో కొలువైన జగన్మాత- బల్కంపేట ఎల్లమ్మ తల్లి మహిమ ఇదే! బోనాల సందర్భంగా జరిగే కల్యాణోత్సవాల విశిష్టత తెలుసా?