భగవంతుడినే తన సర్వస్వంగా భావించిన విష్ణుచిత్తుడు- పెరియాళ్వార్‌గా పేరు పొందిన మహాభక్తుడి కథ!
శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 12 మంది ఆళ్వారులలో విష్ణుచిత్తుడు లేదా పెరియాళ్వార్‌ది ప్రత్యేకమైన స్థానం- విష్ణుచిత్తుడి భక్తి వైభవాన్ని చాటుతున్న గోదాదేవి శ్రీరంగనాథుడిని వరుడిగా పొందేలా చేసే ఘట్టాలు

Published : August 6, 2026 at 5:18 AM IST
Vishnuchitta Alvar Father of Goda Devi : శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన 12 మంది ఆళ్వారులలో విష్ణుచిత్తుడు ఒకరు. దాదాపు 9వ శతాబ్దానికి చెందిన 12 మంది అళ్వార్ల క్రమంలో ఎనిమిదో వాడిగా పరిగణలోకి వచ్చిన విష్ణుచిత్తునికి శ్రీమహావిష్ణువుపై ఉన్న అపారమైన భక్తి. దాని కారణంగా ఆయనకు పెరియాళ్వారు అనే పేరు వచ్చింది. ఈయన అసలు పేరు భట్టనాథుడు. మహాభక్తుడైన భట్టనాథుని 'చిత్తం' అంటే మనసు ఎల్లపుడు విష్ణువుపైనే నిమగ్నమై ఉంటుంది. అందుకే ఆయనకు విష్ణుచిత్తుడని పేరు వచ్చింది. ఈ కథనంలో విష్ణుచిత్తుడు భక్తిమార్గంలో తరిస్తూ శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యాన్ని ఎలా చేరుకున్నాడనే విషయాలు తెలుసుకుందాం.
భక్తి పారవశ్యం
భగవంతుడిని సేవించడంలోను, ఆయన్ని పూజించడంలోను మహాభక్తులు అనంతమైన ఆనందాన్ని పొందుతుంటారు. స్వామి సన్నిధిలో ఉంటూ అనుక్షణం ఆయన్ని ఆరాధించడంకన్నా తమకి మరేదీ అవసరం లేదన్నట్టుగానే వాళ్లు వ్యవహరిస్తుంటారు. అలాంటి మహాభక్తులకు స్వామి కూడా విశేషమైన స్థానాన్ని కల్పిస్తుంటాడు. అలా స్వామితో శాశ్వతమైన అనుబంధాన్ని పొందిన భక్తులలో 'విష్ణుచిత్తుడు' ముందు వరుసలో కనిపిస్తాడు.
జీవిత విశేషాలు
పెరియళ్వార్ మదురైకి సమీపంలో ఉన్న శ్రీ విల్లిపుత్తూరులో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. భాగవతుల ఇంట పుట్టి పెరిగిన విష్ణుచిత్తుడికి చిన్న వయసు నుంచే వేదాధ్యయనము చేస్తూ, రంగనాథస్వామి పట్ల అసమానమైన భక్తిశ్రద్ధలు ఏర్పడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి, తుమ్మెదలు కూడా వాలని పూలను కోసి స్వామివారికి మాలగా కట్టి సమర్పించేవాడు. భగవంతుడికి పూలమాల కట్టడంలో గల అనిర్వచనీయమైన అనుభూతికి మరేదీ సాటిరాదని ఆయన భావించేవాడు.
తులసి వనం
ఆజన్మ బ్రహ్మచారిగా తన జీవితాన్ని సాగించిన విష్ణుచిత్తుడు విష్ణు పూజ కోసం తులసి వనాన్ని ఏర్పాటు చేసి ఆ వనంలోని తులసిని మాలలుగా కట్టి వటపత్రశాయికి సమర్పించుకుంటూ తన జీవితాన్ని గడపసాగాడు. శ్రీకృష్ణుని నిరంతరం స్తుతిస్తూ, భక్తిలో మైమరచిపోతూ జీవితాన్ని గడిపేవాడు.
రాజ సత్కారం
తాను అల్లిన పూలమాల రంగనాథస్వామి హృదయాన్ని తాకిన ప్రతిసారి తన జన్మ ధన్యమైందన్నట్టు ఆయన సంతోషంతో పొంగిపోయేవాడు. ఇలా తన వైభవాన్ని చూసి ముచ్చటపడే విష్ణుచిత్తుడికి స్వామివారు రాజ సత్కారం లభించేలా చేస్తాడు. ఒకానొకసారి పాండ్యరాజు పెట్టిన పరీక్షలో నెగ్గిన విష్ణుచిత్తునికి పాండ్యరాజు సన్మానం చేసాడు. తన భక్తుడికి జరుగుతోన్న ఆ సత్కారాన్ని చూడటానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శంఖు చక్రాలు ధరించి ఆ రాజసభలో విష్ణుచిత్తుడికి ప్రత్యక్ష దర్శనమిచ్చి ఆయనకి సంతోషాన్ని కలిగిస్తాడు.
భగవంతునిపై పాశురాలు రచన
విష్ణుచిత్తుడు ప్రత్యేకంగా 'తిరుపల్లాండు' అనే పది పాశురాలను రచించారు. శ్రీ వైష్ణవ దేవాలయాలలో ఉదయం, సాయంత్రం ప్రార్థనల్లో ఈ మంత్రాలు పఠించడం సంప్రదాయం.
లక్ష్మీదేవి కుమార్తెగా
ఇక తన స్వామి పట్ల విష్ణుచిత్తుడు చూపే భక్తిశ్రద్ధలకు లక్ష్మీదేవి కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆజన్మ బ్రహ్మచారి అయిన విష్ణుచిత్తుడి జీవితాన్ని చరితార్థం చేయడం కోసం లక్ష్మీదేవి విష్ణుచిత్తునికి తులసి వనంలో లభిస్తుంది. విష్ణుచిత్తుడు ఆ పసిపాపను ప్రేమగా పెంచసాగాడు. ఆ విధం లక్ష్మీదేవి ఆయన కూతురుగా 'గోదాదేవి' పేరుతో పెరుగుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవికి తండ్రి స్థానాన్ని పొందిన విష్ణుచిత్తుడు, ఇంతకుమించిన భాగ్యం ఇంకెవరి దక్కుతుందంటూ పరవశాన్ని పొందుతాడు.
గోదా కల్యాణం
శ్రీరంగనాథుడే తనకు భర్తగా రావాలని కోరుకుంటూ గోదాదేవి ధనుర్మాసంలో శ్రీ వ్రతాన్ని ఆచరిస్తుంది. అప్పుడు రంగనాథస్వామి ఆదేశం మేరకు విష్ణుచిత్తుడు ఒక ఆడపిల్ల తండ్రిగా గోదాదేవిని శ్రీరంగనాథునికిచ్చి కల్యాణం జరిపిస్తాడు. ఆ విధంగా ధనుర్మాస వ్రత మహిమతో, లక్ష్మీ స్వరూపమైన గోదాదేవి శ్రీరంగనాథుడి సతీమణి అవుతుంది.
అచంచల భక్తికి లొంగిపోయి పరవశించే భగవంతుడు
అంకితభావంతో భక్తుడు గోరంత సేవచేసుకుంటే భగవంతుడు కొండంత అనుగ్రహాన్ని చూపిస్తాడనటానికి విష్ణుచిత్తుడి జీవితం నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తూ ఉంటుంది. శ్రీవిల్లిపుత్తూరులో ఇప్పటికి విష్ణుచిత్తుడు పెంచిన తులసి వనం, గోదాదేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
ఓం నమో భగవతే వాసుదేవాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఏ 'దిక్కు'లో ఉన్న శివాలయానికి వెళ్తున్నారు? - ఈ వైపు ఉన్న ఈశ్వరుడిని దర్శిస్తే విశేష ఫలితాలు!
అరుణాచలంలో మోక్ష మార్గం- ఇడుక్కు పిళ్లైయార్ గుహలో నుంచి వెళ్తే పాపాలు తొలగిపోతాయని ఎందుకు నమ్ముతారు?

