ETV Bharat / spiritual

'వరలక్ష్మీ వ్రతం'లో ఏ పూలు, నైవేద్యాలు వాడాలి? - వ్రతం ముగిశాక కలశం ఏం చేయాలి?

వరలక్ష్మీ వ్రతం పూజాద్రవ్యాల లిస్ట్ ఇదే! - ఏవి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలో వివరిస్తున్న జ్యోతిష్యులు!

Varalakshmi Vratam 2026 Puja Vidhi
Varalakshmi Vratam 2026 Puja Vidhi (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 3:22 PM IST

5 Min Read
Choose ETV Bharat

Varalakshmi Vratam 2026 Puja Vidhi : శ్రావణమాసంలో తెలుగింటి ఆడపచులు భక్తిశ్రద్ధలతో 'వరలక్ష్మీ వ్రతం' నిర్వహిస్తుంటారు. ఈ రోజున లక్ష్మీ దేవిని వీలైనంత అందంగా అలంకరించి పూజిస్తుంటారు. అయితే, వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఏ పూలతో పూజ చేయాలి? వ్రతం నాడు పూజలో ఏ వస్తువులు తప్పనిసరిగా ఉంచాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఒకవేళ ఆ వారం కుదరని పక్షంలో ఈ మాసంలో ఏ శుక్రవారమైనా ఆచరించవచ్చంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్​ కుమార్. అయితే, వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే వరలక్ష్మి దేవి ఏడాదంతా వరాల జల్లు కురిపిస్తుందని పౌరాణిక గ్రంథాలలో చెప్పారు. ఈ వ్రతం రోజు అందరూ తప్పకుండా సమర్పించాల్సిన పంచ అన్న నైవేద్యాలు పురాణాల్లో చెప్పారు. అంటే, ఆరోజు ఐదు రకాలైనటువంటి అన్నంతో చేసిన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఏ ఏ నైవేద్యాలు నివేదించాలి?

  • మొట్ట మొదటిది దద్దోజనం. అంటే, తాలింపు పెట్టినటువంటి పెరుగున్నాన్ని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించాలి. దద్దోజనం నైవేద్యంగా పెడితే అమ్మవారి అనుగ్రహం వల్ల సర్వ సంపదలు లభిస్తాయంటున్నారు.
  • రెండో నైవేద్యం వచ్చేసి పాలతో చేసిన పాయసాన్నం. ఈ పాలతో చేసిన పాయసాన్నాన్ని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తే అధికార పదవులు లభిస్తాయట. అంటే, ఎవరైనా ఉద్యోగంలో ప్రమోషన్లు త్వరగా రావాలంటే, రాజకీయాల్లో పదవులు తొందరగా రావాలంటే, జీవితంలో గొప్ప గొప్ప అధికార పదవులు సిద్ధించాలంటే వరలక్ష్మీ వ్రతం నాడు ఈ పాయసాన్నాన్ని దేవికి నేవేద్యంగా సమర్పించడం ద్వారా మంచి ఫలితాలుంటాయంటున్నారు.
  • మూడోవది వచ్చేసి హరిద్రాన్నం. అంటే పులిహోర(పసుపు కలిపి అన్నం). దీన్ని దేవికి సమర్పించి, ప్రసాదంగా స్వీకరిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి, అన్యోన్యత పెరుగుతుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంటుందంటున్నారు.
  • నాలుగో నైవేద్యం వచ్చేసి పెసరపప్పు అన్నం. దీన్నే 'పులగం' అంటారు. అంటే పెసరపప్పు అన్నంలో కలిపి ఆవు నెయ్యి వేసి తయారు చేస్తారు. ఈ పులగం అమ్మవారికి నైవేద్యంగా నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబంలో అనుకూలత పెరగడంతో పాటు, మంచి పురోభివృద్ధిని సాధిస్తారంటున్నారు.
  • ఐదో నైవేద్యం వచ్చేసి గుడాన్నం. అంటే, బెల్లం కలిపిన అన్నం అని అర్థం. దీన్ని వరలక్ష్మి దేవికి నైవేద్యంగా పెట్టి, ప్రసాదంగా తీసుకుంటే సంవత్సరమంతా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్​కుమార్.

పెళ్లికానివాళ్లు, వితంతువులూ 'వరలక్ష్మీ వ్రతం' చేయొచ్చా? - 'కలశం' తప్పనిసరిగా పెట్టాలా?

అమ్మవారిని ఏ పూలతో పూజించాలంటే?

  • వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారిని పూజించవలసిన మూడు రకాలైనటువంటి పుష్పాల గురించి పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ వ్రతం చేసుకునేవారందరూ ఆ పూలు ఉండేలా చూసుకొని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండని చెబుతున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్​ కుమార్.
  • మొట్టమొదటిది వచ్చేసి మందార పూలు. ఎందుకంటే అమ్మవారికి మందార కుసుమ ప్రియ అని పేరు ఉంది. కుసుమం అంటే పుష్పం. ఆ పూలు అంటే దేవికి చాలా ఇష్టం. కాబట్టి, వరలక్ష్మీ పూజలో అమ్మవారిని ఎర్ర మందార పూలతో పూజించండి. ఈ పుష్పాలతో పూజించడం వల్ల నిద్రా సౌఖ్యం కలుగుతుందంటున్నారు.
  • రెండో పుష్పం వచ్చేసి 'కరవీర పుష్పాలు'. అంటే గన్నేరు పూలు అని అర్థం. ఈ పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారం, వెండి ఆభరణాలు త్వరగా కొనుక్కునే యోగం లభిస్తుందట. పురాణాల్లో ఏం చెప్పారంటే, సువర్ణాది ధాతువులు కొనగలిగే స్థితి రావాలంటే కరవీర పుష్పాలతో పూజించాలని చెప్పారు.
  • మూడోది వచ్చేసి తెల్లటి పూలుగా పురాణాల్లో చెప్పారు. అంటే, మల్లెపూలు, సన్నజాజి, జాజి వంటి తెల్లపూలు వేటితోనైనా వరలక్ష్మీదేవిని పూజించవచ్చంటున్నారు. వీటితో అమ్మవారిని ఆరాధించినట్లయితే మనోభీష్టాలు నెరవేరుతాయని చెబుతున్నారు.
  • అయితే, నీలం రంగు పుష్పాలు, గడ్డి పుష్పాలు వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారిని ఎట్టిపరిస్థితుల్లో పూజించరాదంటున్నారు.
  • పద్మ పుష్పంలో వరలక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక్క పద్మ పుష్పమైనా సరే వ్రతంలో ఉపయోగించడం మంచిదంటున్నారు.

వ్రత పూజలో ఉంచాల్సిన మరికొన్ని పూజాద్రవ్యాలు!

  • వరలక్ష్మీ వ్రతం ఆచరించేవారు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పిస్తే సమస్త శుభాలు చేకూరతాయని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. వాటిలో ముఖ్యమైనవి శనగలు. వీటిని రెండు రకాలుగా నైవేద్యం పెట్టొచ్చు. తాలింపు పెట్టినటువంటి శనగలు దేవికి సమర్పించి, ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే, పచ్చి శనగలు ఉంటాయి. ఇవి నీళ్లలో నానబెట్టి, అమ్మవారికి నేవేద్యం పెట్టి వాటిని తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వండి. ఇలా చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందంటున్నారు.
  • వరలక్ష్మీదేవికి కొన్ని ద్రవ్యాలు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అరటిపండు అంటే దేవికి చాలా ఇష్టం. కాబట్టి, తప్పకుండా అరటిపళ్లు నైవేద్యంగా పెట్టాలి.
  • అలాగే, కొబ్బరికాయ కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం. కాబట్టి, కొబ్బరికాయ కొట్టి దాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆవుపాలు, ఆవు నెయ్యి కూడా ఇష్టం. అందుకే, ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.
  • దానిమ్మ పండ్లు అంటే కూడా వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని కూడా నైవేద్యంగా పెట్టి, ప్రసాదంగా స్వీకరిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రు బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చంటున్నారు.
  • వరలక్ష్మీ చేసే వారందరూ తప్పకుండా పూజలో ఏనుగు బొమ్మలు ఉంచాలి. ఒక ఏనుగు బొమ్మ లేదా రెండు ఏనుగు బొమ్మలు అమ్మవారి రూపు దగ్గర లేదా రూపుకి ఇరువైపులా ఉంచుకోవడం మంచిదంటున్నారు. ఇనుముతో తప్ప ఏ లోహంతో చేసిన ఏనుగు బొమ్మ అయినా ఉంచవచ్చంటున్నారు.

ఏనుగు బొమ్మ ఎందుకు ఉంచాలంటే ?

దేవతలు, దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఆవిర్భవించినప్పుడు అష్టదిగ్గజాలు అనే పేరుతో ఎనిమిది రకాలైనటువంటి ఏనుగులు తొండంతో కలశాలు తీసుకుని, వాటిల్లో గంగాజలం నింపి ఆ నీటితో లక్ష్మీదేవికి అభిషేకం చేసినయి. అప్పుడు అమ్మవారు ఏనుగులకు వరం ఇస్తుంది. మీరు నాకు కలశాలలో గంగాజలంతో అభిషేకం చేశారు కాబట్టి మీ కుంభస్థలంలో నేను ఉంటానని గజరాజులకు దేవి వరాన్ని అనుగ్రహించిందని పద్మ పురాణంలో చెప్పారు. అందుకే, ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు మాచిరాజు.

కలశం తప్పనిసరిగా ఉండాలా?

వరలక్ష్మీ పూజ చేసేవారు తప్పసరిగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశం ఏర్పాటు చేసినప్పుడు అందులో పుష్పాలు, అక్షింతలు, ఒక నాణెం కూడా ఉంచాలి. తర్వాత ఆ నాణెంను భద్రపరచుకోవచ్చు.

వ్రతం అయిపోయాక కలశం ఏం చేయాలి?

చాలా మందికి వ్రతం పూర్తయ్యాక కలశం ఏం చేయాలనే సందేహం వస్తుంది. దీనికి పురాణాల్లో ఏం చెప్పారంటే, వరలక్ష్మీ వ్రతం పూర్తయిపోయాక అమ్మవారికి ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ కలశాన్ని దక్షిణతో పాటుగా వ్రతం చేయించిన పురోహితుడికి దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయంటున్నారు.

ఇలా వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళలందరూ పురాణాలలో చెప్పిన ఐదు రకాలైన పంచ అన్న నైవేద్యాలు, మూడు రకాల పూలు, పైన చెప్పినటువంటి మరికొన్ని పూజాద్రవ్యాలు వరలక్ష్మీదేవికి సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వండని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్​కుమార్. సమస్త శుభాలు సిద్ధంపజేసుకోండంటున్నారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"వరలక్ష్మీ వ్రతాన్ని" ఏ సమయంలోపు పూర్తిచేయాలి? - అమ్మవారికి పెట్టిన చీర, బ్లౌజ్‌పీస్‌ ఏం చేయాలి?

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం- ఇలా చేస్తే సకల సంపదలు కలగడం ఖాయం!