ETV Bharat / spiritual

ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చే వినాయకుని పదహారవ రూపం- ఊర్ధ్వ గణపతిని పూజిస్తే జ్ఞానసిద్ధి, ఉన్నత పదవి!

వినాయకుని పదహారవ రూపమైన శ్రీ ఊర్ధ్వ గణపతి- యోగం, ఆధ్యాత్మికత, జ్ఞానానికి ప్రతీక- ఆరాధించడం వల్ల మనోనిగ్రహం, ఆధ్యాత్మిక పురోగతి, ఉన్నత పదవి, ధన సమృద్ధి వంటి శుభ ఫలితాలు

Urdhva Ganapathi Significance
Urdhva Ganapathi Significance (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : July 1, 2026 at 3:56 AM IST

3 Min Read
Choose ETV Bharat

Urdhva Ganapathi Significance : వినాయకుని రూపాల్లో ఒకటి శ్రీ ఊర్ధ్వ గణపతి! యోగ మార్గంలోనూ, ఆధ్యాత్మిక పంథాలోనూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే గణనాథుని పదహారవ రూపమే శ్రీ ఊర్ధ్వ గణపతి. ఊర్ధ్వ గణపతిని నిరంతరం పూజించడం వల్ల మనిషి ప్రాపంచిక ఆశల నుంచి ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకుంటాడని విశ్వాసం. ఈ కథనంలో ఊర్థ్వ గణపతి స్వరూపం గురించి, ఊర్థ్వ గణపతిని ఎలా పూజించాలి? ఊర్థ్వ గణపతిని పూజించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.

ఊర్ధ్వ గణపతి అంటే?
'ఊర్థ్వ' అనే పదానికి 'పైకి చూసేది' లేదా 'ఉన్నతమైనది' అని అర్థం. ఊర్ధ్వ గణపతిని ధ్యానించడం వల్ల మనిషి ప్రాపంచిక ఆశల సుడిగుండాలు నుంచి విముక్తి పొంది ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకుంటాడని గణేశ పురాణం చెబుతోంది.

ఊర్ధ్వ గణపతి స్వరూపం!
ఊర్ధ్వ గణపతి స్వరూపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ గణపతి కరిగించిన బంగారం లాంటి ప్రకాశవంతమైన స్వర్ణ వర్ణంలో మెరిసిపోతుంటారు. ఈ రూపంలో స్వామివారికి ఆరు చేతులు ఉంటాయి. ఊర్ధ్వ గణపతి తన ఎడమ తొడపై దేవిని అంటే శక్తిని కూర్చోబెట్టుకుని, ఆమెతో కలిసి ఉన్న ఆలింగన ముద్రలో దర్శనమిస్తారు.

ఊర్ధ్వ గణపతి ఆయుధాలు
ఊర్ధ్వ గణపతి తన ఆరు చేతుల్లో ఒక చేతిలో నీలోత్పల పుష్పం అంటే నల్ల కలువ, మిగిలిన చేతుల్లో వరి వెన్ను అంటే ధాన్యపు కంకి, చెరకు విల్లు, బాణం, విరిగిన దంతం మరియు ఒక చేతిలో దానిమ్మ పండును ధరించి ఉంటారు.

ఊర్ధ్వ గణపతి స్వరూప ఆధ్యాత్మిక తత్త్వం
ఊర్ధ్వ గణపతి రూపం 'జ్ఞానం యొక్క అత్యున్నత శిఖరానికి ప్రతీక! సిద్ధుల నమ్మకం ప్రకారం, ఈ రూపాన్ని ధ్యానించడం ద్వారా మన శరీరంలోని మూలాధార చక్రంలో ఉన్న కుండలినీ శక్తిని పై ముఖంగా అనగా ఊర్థ్వ ముఖంగా కేంద్రీకరించి, సహస్రార చక్రాన్ని చేరుకునేలా చేయవచ్చు. ఊర్ధ్వ గణపతి స్వరూపం కేవలం పూజించే రూపం మాత్రమే కాదు, అత్యంత లోతైన యోగ రహస్యాలు దాగి ఉన్న అద్భుత దైవిక స్వరూపం.

పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఊర్ధ్వ గణపతిని నిరంతరం పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.

ఆధ్యాత్మిక పురోగతి
ఊర్ధ్వ గణపతిని ప్రతినిత్యం పూజించడం వల్ల ధ్యానం, యోగం, ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నవారికి చాలా త్వరగా జ్ఞానసిద్ధి లభిస్తుంది.

మనో నిగ్రహం
ఊర్ధ్వ గణపతి ఆరాధనతో చంచలమైన ఇంద్రియాలను, ఆశామోహాలను అదుపులో ఉంచుకునే మానసిక శక్తి లభిస్తుంది.

ఉన్నత పదవి
ఉద్యోగంలో అస్థిరత, సవాళ్లు ఎదుర్కొంటున్న వారు ఊర్థ్వ గణపతిని ఆరాధిస్తే వృత్తిలోనూ, సమాజంలోనూ అత్యున్నత స్థానాన్ని అధిరోహిస్తారు.

ధనధాన్య సమృద్ధి
ఊర్ధ్వ గణపతి తన చేతుల్లో వరి కంకిని, చెరకును ధరించి ఉండడం వల్ల, ఆయనను పూజించే వారి ఇంట ధాన్యానికి, సంపదకు ఎన్నటికీ కొరత ఉండదు.

సదా రక్షించే ఊర్ధ్వ గణపతి
శక్తి దేవిని ఆలింగనం చేసుకుని, నీలి తామర, వరి వెన్ను, చెరకు విల్లు, బాణం, విరిగిన దంతాన్ని ధరించి, మరో హస్తంలో పద్మాలు ధరించి, స్వర్ణ కాంతితో ప్రకాశించే ఊర్ధ్వ గణపతిని నిరంతరం పూజిస్తే ఆ స్వామి సర్వ కాలాల్లో మనల్ని రక్షిస్తూ ఉంటాడు.

ఊర్ధ్వ గణపతి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?
కర్ణాటకలోని నంజనగూడు శ్రీ నంజున్దేశ్వర ఆలయంలో ఆరు చేతులతో ఉన్న ఊర్ధ్వ గణపతి సుందరమైన విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. అలాగే తమిళనాడులో కొన్ని ప్రాచీన తంత్ర పూజా విధానాలు గల ఆలయాల్లో కూడా ఈ ఊర్ధ్వ గణపతి విగ్రహాలు దర్శించుకోవచ్చు.

మన మనస్సును, ఆలోచనలను, జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే 'ఊర్థ్వ గణపతిని' ప్రార్థించి, అజ్ఞానాన్ని పోగొట్టుకుని పరమానందాన్ని పొందుదాం!

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

సింధూర వర్ణంలో దర్శనమిచ్చే స్వయంభూ గణపతి- కోరికలు తీర్చే గణపయ్య ఆలయ విశేషాలు ఇవే!

ఉచ్చిష్ట గణపతిని ఇలా పూజిస్తే- శత్రుజయం, రుణ విముక్తి సహా- అభీష్టాలన్నీ నెరవేరడం ఖాయం!