పాపాలను హరించే శివయ్యకు - ఏఏ అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫలితాలు?
-కలతలు తీర్చి ఆనందాన్ని ప్రసాదించే శివార్చన, అభిషేకాలు - పురాణాల ప్రకారం పరమశివుడికి చేసే అర్చనలూ, అభిషేకాల ఫలితాలు ఇలా ఉంటాయట!

Published : July 2, 2026 at 3:15 PM IST
Types of Abhishekalu: యావత్ విశ్వానికి లయకారుడు పరమేశ్వరుడు. శివ అంటే సంతోషం లేదా శుభకరం. ఆద్యంతరహితుడు, జ్యోతిస్వరూపుడు, భక్తదయాళువు అయిన మహేశ్వరుడు కొలువుదీరిన ఆలయాలు ఎన్నో. ఈ క్రమంలోనే భక్తులు ప్రత్యేక నియమ నిష్ఠలతో శివయ్యను కొలుస్తూ ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా అభిషేకాలు చేస్తుంటారు. ఇక అభిషేకాలను కూడా వివిధ రకాలుగా చేస్తుంటారు. అయితే పురాణాల ప్రకారం పరమశివుడికి చేసే అర్చనలూ, అభిషేకాల ఫలితాలు వేర్వేరుగా ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నూతి శివానందం చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
జలం: చాలా మంది పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేస్తారు. అయితే ముక్కంటికి జలాభిషేకం అత్యంత ప్రీతికరం అంటున్నారు శివానందం. దోసెడు నీళ్లతో సంతుష్టుడైన స్వామి.. కోరిన వరాలిస్తాడంటున్నారు. ఇక నీటితో చేసే అభిషేకం జన్మజన్మల పాపాలను నశింపచేస్తుందని, భక్తులను పునీతులను చేస్తుందంటున్నారు.
పంచామృతం: ఆవు పాలు, నెయ్యి, తేనె, పెరుగు, పంచదారలను కలిపి పంచామృతం చేసి దానితో చాలా మంది అభిషేకం చేస్తుంటారు. అయితే పంచామృతంతో శివునికి చేసే అభిషేకం విశేష ఫలాన్నిస్తుందని అంటున్నారు. ఇది జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేస్తుందని.. పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల సమస్త దోషాలు తొలగి, సౌఖ్యం పొందుతారంటున్నారు.
భస్మం: శివునికి అత్యంత ప్రీతికరమైన భస్మంతో చేసే అభిషేకం పరమ పుణ్యప్రదం అంటున్నారు. ఇక భస్మాభిషేకం వల్ల సకల కష్టాల నుంచి రక్షణ పొందుతారని.. ఐశ్వర్యాలూ, సిరిసంపదలు కలుగుతాయంటున్నారు. ఈ అభిషేకం లోకల్యాణానికీ, ముక్తికి శ్రేష్ఠమంటున్నారు. భస్మాభిషేకం దర్శించిన వారు సైతం విశేష ఫలాలు పొందుతారని వివరిస్తున్నారు.
బిల్వపత్రాలు: పరమశివుని అర్చించడానికి బిల్వ దళం అత్యంత శ్రేష్ఠమైనదని చెబుతున్నారు. మారేడు వృక్షంలో త్రిశక్తులూ ఉంటాయని.. బిల్వం త్రిమూర్తి స్వరూపం అంటున్నారు. మారేడు దళాలతో పూజించే వారికి శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని.. లక్ష్మీకటాక్షం కూడా లభిస్తుందని చెబుతున్నారు.
జిల్లేడుపూలు: శివునికి అత్యంత ప్రీతికరమైన పుష్పాల్లో జిల్లేడు ఒకటని.. దీనినే అర్కపుష్పం అంటారంటున్నారు. ఈ పూలతో పూజించినవారికి శివుని కటాక్షం లభిస్తుందని.. ఒక్క జిల్లేడుపూవుతో పూజిస్తే పది బంగారు నాణాలు దానం చేసిన ఫలితం లభిస్తుందంటున్నారు. అలాగే దారిద్య్ర బాధలు తొలగుతాయని.. పూర్వజన్మకర్మల వల్ల వచ్చే దోషాల నుంచి విముక్తులవుతారంటున్నారు. ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుందంటున్నారు.
కలువ పువ్వులు: కలువ పూవులో లక్ష్మీదేవి కొలువుంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే హృదయకుహరంలోని కమలంలో కొలువై ఉండే పరబ్రహ్మయే ఈశ్వరుడని.. కలువపూలతో శివుని అర్చించేవారి హృదయ కమలం వికసిస్తుందంటున్నారు. సద్భావనలు కలుగుతాయని, సత్సంపదలు లభిస్తాయంటున్నారు. ఇక భక్తిజ్ఞానంతోపాటు సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని వివరిస్తున్నారు.
బిళ్లగన్నేరు: మహేశ్వరుడికి బిళ్లగన్నేరు ప్రీతికరం అంటున్నారు శివానందం. ఈ పూలతో శివుని పూజించినవారికి వేయి గోదానాల ఫలితం లభిస్తుందని.. అనుకూలవతి, సౌందర్యవతి అయిన యువతి భార్యగా లభిస్తుందంటున్నారు. అలాగే శత్రుభయం ఉండదని, వ్యాధులు నయమవుతాయంటున్నారు.
ముఖ్య గమనిక : ఇక్కడ పేర్కొన్న వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శివుని అష్టమూర్తి తత్వం అంటే ఏంటి? పరమేశ్వరుడు ఎక్కడెక్కడ వెలిశాడు?
గజకేసరి యోగం అంటే ఏమిటి? - దీని వల్ల 2026లో ఏఏ రాశులకు మంచిది!

