కాలసర్ప, రాహుకేతు దోషాలకు జంట నాగుల పూజ- ఎలా చేయాలో తెలుసా?
హిందూ సంప్రదాయంలో నాగారాధనకు విశేష ప్రాధాన్యత- ముఖ్యంగా ఆలయాల్లో అశ్వత్థ వృక్షం కింద ప్రతిష్ఠించిన జంట నాగులను పూజించడం వల్ల సంతాన ప్రాప్తి

Published : June 30, 2026 at 3:57 AM IST
Twin Naga Idols Significance: మన పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యస్వామి కుజ గ్రహానికి అధిపతి. దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి అనేక ఆలయాల్లో నాగప్రతిష్ఠల రూపంలో కూడా కొలువై ఉండి పూజలందుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆలయాల్లో కనిపించే నాగప్రతిష్ఠ విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
జీవితాన్ని మార్చేసే 'నాగ శక్తి'
భారతీయ సంస్కృతిలో నాగారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దేవాలయాల్లో అశ్వత్థ వృక్షం కింద ప్రతిష్టించిన 'జంట నాగుల'ను దర్శించుకోవడం, జంట నాగులకు క్షీరాభిషేకం చేయడం వెనక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషం నుంచి సంతాన ప్రాప్తి వరకు జంట నాగులను పూజించడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా మంగళవారం రోజు జంట నాగులను పూజిస్తే భయంకరమైన కాలసర్ప దోషాలు, కుజ దోషాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అసలు జంట నాగులను పూజించడం వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జంట నాగులు అంటే?
దేవాలయ ప్రాంగణాల్లో, ముఖ్యంగా రావి చెట్టు కింద ఒకదానికొకటి పెనవేసుకున్నట్లు ఉండే రాతి విగ్రహాలను మనం చూస్తుంటాం. వీటినే 'జంట నాగులు' అంటారు. శివకేశవులకు అత్యంత ప్రియమైన నాగేంద్రుడిని జంటగా పూజించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
జంట నాగుల విశిష్టత
ఈ చరాచర సృష్టి లోని 'శివ-శక్తి' స్వరూపానికి, 'ప్రకృతి-పురుష' తత్వానికి జంట నాగులు సంకేతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జంట నాగుల్లో ఒకటి రాహువుకు, మరొకటి కేతువుకు ప్రతిరూపాలుగా భావిస్తారు. ఈ రెండు శక్తులు పెనవేసుకున్నట్లు ఉండటం అనేది సంపూర్ణతకు సమతుల్యతకు నిదర్శనం. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కింద వీటిని ప్రతిష్టించడం వల్ల ఆ చెట్టు నుంచి వచ్చే ప్రాణవాయువు తో పాటు నాగ శక్తి కూడా కలిసి భక్తులపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
జంట నాగులను పూజించడం వల్ల ప్రయోజనాలు
స్కంద పురాణం ప్రకారం జంట నాగులను పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని తెలుస్తోంది. అవేంటో చూద్దాం.
సంతాన ప్రాప్తి
జంట నాగుల పూజ ప్రధానంగా 'సంతాన లేమి' సమస్యలతో బాధపడేవారికి ఒక గొప్ప పరిష్కారం. అందుకే సంతానం లేని దంపతులు రావిచెట్టు కింద 'నాగ ప్రతిష్ఠ' చేయడం వల్ల సంతానలేమికి కారణమయ్యే దోషాలు తొలగి సత్సంతానం సిద్ధిస్తుందని శాస్త్రవచనం.
గ్రహ దోష నివారణ
జాతకంలో రాహు-కేతు దోషాలు, కుజ దోషం లేదా కాలసర్ప దోషం ఉన్నవారు జంట నాగులకు అభిషేకం చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.
కుటుంబ సఖ్యత
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నా లేదా వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతున్న జంట నాగులను దర్శించుకోవడం వలన, జంట నాగులకు అభిషేకం జరిపించి బెల్లం నువ్వులు నైవేద్యంగా సమర్పించడం వలన సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
ఆరోగ్యం
మంగళవారం జంట నాగులను పూజించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
జంట నాగులను ఎవరు పూజించాలి?
సంతానం కోసం ఎదురుచూసే దంపతులు, జాతకంలో సర్పదోషాలు ఉన్నవారు, వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు ఎదుర్కొంటున్న వారు, మానసిక ప్రశాంతత లేని వారు అనారోగ్యంతో బాధపడేవారు జంట నాగులను పూజించడం వలన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని తెలుస్తోంది.
జంట నాగులను ఎప్పుడు పూజించాలి?
కుజ గ్రహానికి అధిపతి అయిన మంగళవారం రోజు జంట నాగులను పూజించడం శ్రేష్టం. ముఖ్యంగా నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి రోజుల్లో పాలతో అభిషేకం చేసి, పసుపు కుంకుమలతో అలంకరించి, పువ్వులు సమర్పించాలి. అనంతరం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల గ్రహ పీడలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
మనం కూడా జంట నాగులను పూజించి సుఖమయ జీవితాన్ని పొందుదాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం .
నాగసర్ప దోషాలు ఉన్నాయా? కుక్కే సుబ్రహ్మణ్యుని గుడిలో ఇలా చేస్తే చాలు! అన్నీ క్లియర్!!

