తిరుమలలో శ్రీనివాసుని పాదాల మహిమ- నిజపాద దర్శనం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా?
తిరుమలలో శ్రీనివాసుని పాదాలను దర్శించడం అత్యంత పవిత్రమైనదిగా - నిజపాద దర్శనం వెనుక ఉన్న మహిమ, అలిపిరి పాదాల రహస్యం ఈ కథనంలో తెలుసుకుందాం.

Published : April 11, 2026 at 2:45 AM IST
Srivari Nijapada Darshan Significance: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల కలియుగ వైకుంఠంగా ఖ్యాతి చెందింది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీహరిని దర్శించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీనివాసుడు ఆనందనిలయంలో ఒక చేతిని తన పాదాల వైపు చూపిస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. అంటే తన పాదాలను ఆశ్రయించిన వారిని ఆ శ్రీనివాసుడు ఎల్లప్పుడూ కాపాడుతానని అభయం ఇచ్చినట్లే! శ్రీనివాసుని పాదవైభవం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
జన్మ సాఫల్యం
ఆనందనిలయంలో శ్రీనివాసుని ఆమూలాగ్రం దర్శించడం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్లుగానే భావిస్తారు. అలా జరగాలంటే శ్రీవారిని శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు, పాదాలను కూడా దర్శించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు స్వామి పాదాలను తప్పకుండా దర్శించుకోవాలి.
బ్రహ్మ కడిగిన పాదం
సాక్షాత్తు బ్రహ్మదేవుడు కడిగిన శ్రీవారి పాదం పరమపద సోపానం. అయితే శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. ఇది ఏ కొందరికో అరుదుగా దొరికే సువర్ణావకాశం. మిగిలిన సమయాల్లో స్వామి వారి మూల విరాట్ నిజ పాదాలు బంగారంతో తయారు చేసిన పాద కవచాలు తొడిగి కనిపిస్తాయి. శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. 'బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవే!' శ్రీహరి మహిమలన్నీ ఆయన పాదముల్లోనే దాగి వుంటాయి.
అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?
తిరుమలకు కాలి నడక మార్గంలో వెళ్లేవారికి అలిపిరి ప్రదేశంలో శ్రీవారి పాదాల మండపం కనిపిస్తుంది. క్రీ.శ .1628 కాలం నాటి ఈ పాదాల మండపంలో లెక్కలేనన్ని పాదరక్షలు కనిపిస్తాయి. ఇక్కడ ఇలా పాదరక్షలు కనిపించడం వెనుక ఓ గాథ ఉంది.
రెండు వేర్వేరు ప్రాంతాల్లో శ్రీవారి పాదముద్రలు
పూర్వం మాధవ దాసు అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మారిపోయాడట. తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం. ఆ రోజు శ్రీనివాసుని భక్తులు ఉపవాసం ఉండి పిండి తాళిగలు చేయడం సంప్రదాయం. ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలో హరిజనులు ఇంటిలో, కంచి ప్రాంతంలో మరో హరిజనుని ఇంటిలో శ్రీవారి పాదముద్రలు పడతాయి. అంతట వారివురు ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చెప్పులు తయారు చేసి, శ్రీకాళహస్తి నుంచి ఒకరు, కంచి నుంచి మరొకరు శ్రీవారి కోసం తయారు చేసిన పాదరక్షలను శిరస్సున పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు.
అరిగిపోయిన చెప్పులు
వీరు సమర్పించిన ఈ మండపంలోని పాదరక్షలు తరచుగా అరిగిపోతుంటాయట. అందుకు కారణమేమిటంటే, తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను శ్రీవారు ఎంతో ప్రీతితో ధరించి కొండ దిగి అలివేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళతారని, అందుకే ఈ చెప్పులు అరిగి పోయి ఉంటాయని పురాణ ఇతిహాసం.
నారాయణ పాదములు
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో నారాయణ పాదం ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలా ఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల వద్ద పాద పూజ, ఛత్రస్థాపన వంటి ఉత్సవాలు నిర్వహిస్తారు.
శ్రీనివాసా! నీ చరణాలే శరణం!
అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది. అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే! ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకునే భాగ్యం దక్కితే, సాక్షాత్తు ఆ ఏడుకొండలవాని హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్లుగా భక్తులు భావిస్తారు.ఇంతటి పవిత్రమైన పాదాలు దర్శించుకోవాలని ఎవరికుండదు? ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారి పాదాలు తప్పకుండా దర్శించుకుందాం. ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

