పున్నమి వెన్నెలలో శ్రీవారి ఆనంద విహారం- తిరుమల సాలకట్ల తెప్పోత్సవాల పూర్తి వివరాలు ఇవే!
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఎప్పుడు ప్రారంభం? తెప్పోత్సవాలు విశిష్టత

Published : February 26, 2026 at 3:49 AM IST
Tirumala Salakatla Teppotsavam 2026 : భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయం ఏడాది మొత్తం నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాలతో శ్రీవారి ఆనంద నిలయంలో రోజూ ఏదో ఒక ఉత్సవం, వేడుక జరుగుతూనే ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న సందర్భంగా శ్రీవారి తెప్పోత్సవాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? తెప్పోత్సవాలు విశిష్టత ఏమిటి? వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సాలకట్ల తెప్పోత్సవాలు ఎప్పటి నుంచి?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు సాధారణంగా ఏటా ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 (గురువారం) నుంచి మార్చి 2, సోమవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెప్పోత్సవాలలో మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పపై స్వామి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి తెప్పోత్సవాలు వేదిక కానున్న శ్రీవారి పుష్కరిణి విశిష్టతను తెలుసుకుందాం.
శ్రీవారి పుష్కరిణి విశిష్టత
తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్యం దిక్కులో వరాహస్వామి ఆలయం ముందు ఉండే పవిత్రమైన జలవాహినిని శ్రీవారి పుష్కరిణి అంటారు. స్వామి పుష్కరిణి గా వ్యవహరించే శ్రీవారి పుష్కరిణి సాక్షాత్తు వైకుంఠంలో శ్రీ మహా విష్ణువు చెంత ఉండే 'విరజా' నది అని వేంకటాచల మహత్యంలో వివరించి ఉంది. కలియుగంలో వైకుంఠనాథుడు వేంకటనాథునిగా అవతరించినప్పుడు విరజా నది కూడా స్వామితో పాటే భూలోకానికి వచ్చి స్వామి పుష్కరిణిగా వెలిసిందని వేంకటాచల మహత్యంలో వివరించి ఉంది.
సప్త తీర్థ సమ్మేళనం
శ్రీవారి పుష్కరిణిలో కుబేర, గాలవ, మార్కండేయ, అగ్ని, యమ, వశిష్ట, వరుణ, వాయు, సరస్వతి అనే ఏడు పవిత్ర తీర్థాలున్నాయి. అందుకే స్వామి పుష్కరిణిలో స్నానం అత్యంత పవిత్రమని శాస్త్రం చెబుతోంది. ఇక శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరిగే సమయంలో పుష్కరిణి శోభ వర్ణించనలవికాదు. తెప్పోత్సవాలు జరిగే ఈ ఐదురోజులు స్వామి వారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనం ఇవ్వడం విశేషం. తెప్పోత్సవాలలో శ్రీవారు ఏ రోజు ఏ అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు? ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం.
శ్రీవారి పుష్కరిణి లో ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పపై విహరిస్తారు.
- తెప్పోత్సవాలలో తొలి రోజైన ఫిబ్రవరి 26, గురువారం రోజు శ్రీవారు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తెప్పలపై పుష్కరిణిలో మూడు ప్రదక్షిణాలు చేసి అలరించనున్నారు.
- రెండో రోజు ఫిబ్రవరి 27, శుక్రవారం రోజు శ్రీవారు రుక్మిణీ సమేత శ్రీకృష్ణునిగా తెప్పలపై పుష్కరిణిలో మూడు ప్రదక్షిణాలు చేసి అలరించనున్నారు.
- మూడవ రోజు ఫిబ్రవరి 28, శనివారం రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు పుష్కరిణిలో మూడు ప్రదక్షిణాలు చేసి అలరించనున్నారు.
- నాలుగో రోజు మార్చి 1, ఆదివారం రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు పుష్కరిణిలో అయిదు ప్రదక్షిణాలు చేసి అలరించనున్నారు.
- చివరి రోజైన మార్చి 2, సోమవారం రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు పుష్కరిణిలో ఏడు ప్రదక్షిణాలు చేసి అలరించనున్నారు. ఈ రోజుతో శ్రీవారి తెప్పోత్సవాలు ముగియనున్నాయి.
తెప్పోత్సవాలు విశిష్టత
తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో 'తిరుపల్లి ఓడై తిరునాళ్', తెలుగులో 'తెప్ప తిరునాళ్లు' అని కూడా అంటారు. 15 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సాళువ నరసింహరాయలు శ్రీవారి తెప్పోత్సవాలు కోసం "నీరాళి" మండపాన్ని నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది.
పున్నమి వెన్నెలలో శ్రీవారి ఆనంద విహారం
చల్లని నీటిలో, పండు వెన్నెలలో శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి ఆనంద విహారం చేసే తెప్పోత్సవాలు తిలకించడం భక్తులకు ఆనందదాయకం. పదకవితా పితామహుడిగా పేరొందిన తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీవారి తెప్పోత్సవాలను ఘనంగా కీర్తించాడు.
టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు సందర్భంగా టీటీడీ భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలు జరుగనున్న ఐదు రోజులు శ్రీవారి సన్నిధిలో జరుగనున్న సహస్రదీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఉత్సవాలను టీటీడీ రద్దు చేసింది. ఇక పుష్కరిణిలో ఈ ఐదు రోజులు భక్తులను స్నానం చేయడానికి అనుమతించరు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
పున్నమి వెన్నెలలో ఉభయ దేవేరులతో స్వామి పుష్కరిణిలో విహరించే శ్రీనివాసుని మనం కూడా దర్శిద్దాం. సలక శుభాలు పొందుదాం.
ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

